కూతురు కాదు.. కాలాంతకురాలు
తల్లిదండ్రులను కొట్టి..
ఇంటి నుంచి గెంటేసిన కూతురు
పోలీసులను ఆశ్రయించిన వృద్ధ దంపతులు
యూసుఫ్‌గూడ: కన్నవాళ్లను కంటికిరెప్పలా చూసుకోవాల్సిన కూతురే వారిని ఇంటి నుంచి తన్ని తరిమేసింది. దీంతో రోడ్డునపడ్డ ఆ వృద్ధదంపతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. రెండు దశాబ్దాల క్రితం రెక్కలు ముక్కలు చేసుకొని పైసాపైసా కూడబెట్టి తాము నిర్మించుకొన్న ఇంటిని కూతురు తన మూడో భర్తతో కలిసి ఆక్రమించుకొని, తమను ఇంటి నుంచి గెంటేసిందని వారు కన్నీరుపెట్టుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు, బాధితులు కథనం ప్రకారం.. ఎస్‌పీఆర్ హిల్స్ రాజీవ్‌గాంధీనగర్‌లో ఉండే సీహెచ్ సరోజనమ్మ, చెన్నయ్య దంపతులకు 50 గజాల స్థలంలో ఇల్లు ఉంది. ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఈ స్థలాన్ని కొని గూడు ఏర్పాటు చేసుకున్నారు. వీరి కూతురు భర్తను వదిలేసి మరో వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇటీవల అతడిని కూడా వదిలేసి బాబు అనే మరో వ్యక్తిని పెళి ్లచేసుకుంది. అప్పటి నుండే సరోజనమ్మ దంపతులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ ఇల్లు తమదని, ఇంటి నుంచి వెళ్లిపోవాలని, వృద్ధులని కూడా చూడకుండా కూతురు, అల్లుడు తరచూ వారిని కొడుతున్నారు.
ఇప్పటికే సరోజనమ్మ దంపతులు మూడుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు వారికి నచ్చజెప్పి పంపేశారు. బస్తీ పెద్దలతో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. అయితే, ఇవేవీ ఆ వృద్ధులకు న్యాయం చేయలేకపోయాయి. మూడురోజుల నుంచి కూతురు, ఆమెతో పాటు ఉంటున్న బాబు వేధింపులు శ్రుతి మించాయని, తమను కొట్టి బయటకు నెట్టేశారని, న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.