Sarojanamma
-
అసలైన టీచరమ్మ! అభాగ్యులకు ఆమె " పెద్దమ్మ"! రిటైరై కూడా..
టీచర్ అనే పదమే ఎంతో గౌరవనీయమైంది. ఇక ఆ వృత్తి చేసేవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా ఆ వృత్తే వారిని తెలియకుండా సేవ వైపుకి మళ్లీస్తుందో లేక వారి ఆలోచన స్థాయిలు అలా ఉంటాయో!. అచ్చం అలానే పదవివిరమణ చేసిన ఓ టీచరమ్మ విశ్రాంతి తీసుకోకుండా ఎందరో అభాగ్యులకు పెద్దమ్మగా, యువతకు ఓ గైడ్‌గా ఎన్నో సేవలు చేస్తూ అందరిచే మన్నలను అందుకుంటోంది. ఆమే గుర్రాల సరోజనమ్మ. ఇవరామె? ఏం చేసిందంటే.. గుర్రాల సరోజనమ్మది నిజామాబాద్ జిల్లా బోధన్. ఆమె ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే.. ఆమె భర్త వెంకట్రావు నిజాం షుగర్స్‌లో ఉద్యోగి. ఆర్థికంగా ఏ ఇబ్బందీ లేకున్నా మాకు పిల్లలు లేని లోటు ఉండేది. దత్తత ప్రయత్నాలు చేసినా అవేమీ సాధ్యపడలేదు. పాతికేళ్ల క్రితమే రిటైర్ అయ్యింది. ఆ వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. పింఛన్ వస్తోంది కాబట్టి హాయిగా విశ్రాంతి తీసుకుంటుంటుగా విధికి కన్నుకుట్టి భర్తను తీసుకుపోయింది. ఒంటరిగా మిగిలిపోయిన సరోజనమ్మ తోబుట్టువుల పిల్లలే తన పిల్లలు అన్యమనస్కంగా జీవిస్తోంది. వాళ్లొచ్చినప్పుడు తెగ సంబరపడేది. వాళ్లూ కూడా ప్రేమగానే ఉండేవారు ఆమెతో. కానీ ఆ ప్రేమలన్నీ.. నా ఆస్తి చుట్టూ తిరగడం నచ్చలేదు. ఇవన్నీ చూసి విసిగిపోయి.. ఇంటిని ఏదైనా సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నా. ఇలా ఆలోచిస్తుండగా మా ఉపాధ్యాయులు పడుతున్న బాధలే ఆమెను కదిలించాయి. విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకి సొంత భవనం లేదని తెలుసుకుంది. అందుకోసం.. ఆ సంఘానికి ఇంటిని రాసిస్తే మున్ముందు ఎందరికో సేవలు అందుతాయని విశ్వసించి మరీ ఆ ఇల్లు తన తర్వాత ఆ ఇల్లు సంఘానికి చెందేలా ఏడాదిన్నర కిందటే రిజిస్ట్రేషన్ చేయించింది. ఇప్పుడూ ఆ ఇంటి విలువ ప్రస్తుతం రెండు కోట్ల రూపాయలు. ఇది తెలిశాక బంధువులు ఆమె దగ్గరకి రావడమే మానేశారు. ఆ రెండు ఘటనలకు పరిష్కారమే ధర్మస్థల్ ఓసారి దగ్గరి బంధువొకరు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లింది. ఇంటికి కాస్త దూరంగా శవాన్ని ఉంచారు. ఏంటని ఆరా తీయగా.. ఆ ఇంటి యజమాని అనుమతించలేదని తెలిసింది. ఇంకోసారి పరిచయస్థులొకరు చనిపోతే.. వారుండే ఇంటికి దూరంలో అంత్యక్రియలకు కావాల్సిన పనులు చేస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉన్నవారికి ఈ బాధలు తప్పడం లేదని అర్థమైంది సరోజనమ్మకు. ఈ పరిస్థితి అయినవాళ్లని బాధపెడుతుంది కదా! ఈ రెండు ఘటనలూ సరోజనమ్మను ఆలోచింప చేశాయి. ఇందుకు పరిష్కారంగా వెలిసిందే.. ‘ధర్మస్థల్’. ఇందులో చనిపోయినవారి మృతదేహాన్ని అంత్యక్రియలు జరిగేవరకు భద్రపర్చుకోవచ్చు. ఫ్రీజర్ సహా అన్ని సదుపాయాలనూ ఇక్కడ ఉచితంగా అందిస్తారు. ఈ నిర్మాణం ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఇందుకోసం రూ.20 లక్షలు వెచ్చించింది. చనిపోయాక మాట అటుంచితే... బతికున్న వాళ్ల ఆరోగ్యానికి భరోసా ఎవరు? అందుకే జిల్లా కేంద్రంలో మల్లు స్వరాజ్యం ట్రస్టు సభ్యులు ప్రారంభించిన జెనరిక్ మందుల దుకాణానికి ఆమె వంతుగా రూ. 2 లక్షలు విరాళమందించింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా.. అసలు ధరకే మందుల్ని అందివ్వడం ఈ ట్రస్టు ఉద్దేశం. దీనివల్ల మధ్యతరగతి, పేదవారికి ఎంతో ప్రయోజనం. రెంజల్‌లోని కందకుర్తి గోదావరి ఒడ్డున గోశాల నిర్మాణానికీ కూడా విరాళం ఇచ్చింది యువతకోసం నా వంతుగా.. ఒక టీచర్‌గా యువతని మంచి బాట పట్టించాలనే సదుద్దేశంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం ప్రభుత్వ గ్రంథాలయంలో రూ.20 వేల విలువైన పుస్తకాలను అందించింది. ఏడాదికోసారి చింతకుంట వృద్ధాశ్రమానికి వెళ్తుంంది. అక్కడున్న వృద్థులకు నిత్యావసరాల్ని, దుస్తుల్ని అందిస్తుంది. వీలుదొరికినప్పుడల్లా అవయవదానంపై ప్రచారం చేస్తుంది. తన మరణానంతరం దేహాన్ని ప్రయోగాలకు వినియోగించాలని ఆమోదపత్రం కూడా రాసిచ్చింది. మొదట్లో తనకెవరూ లేరునుకుని బాధపడేది. ఇప్పుడు ఈసేవ కార్యక్రమాలు ఎంతోమంది ఆప్తులను ఆమెకు దొరికేలా చేసింది. పైగా వారిచేత ‘పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలిపించుకుంటుంది. నిజంగా ఆమె చాలా గ్రేట్. భర్త పోయి విశ్రాంతిగా ఉండాల్సినీ ఈ వయసులో ఎంతో చలాకీగా ఇలా సేవాకార్యక్రమాలు చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది సరోజనమ్మ!. (చదవండి: బీర్ వ్యర్థాలతో..బిస్కెట్లు, చిక్కిలు, లడ్డులా..) -
Gurrala Sarojanammam: సేవా సరోజనం
నేటి సమాజమంతా డబ్బు చుట్టూ తిరుగుతోందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు భిన్నంగా తనకున్న ఆస్తులు, కష్టార్జితాన్ని నిరుపేదలు, అనాథల అవసరాలు గుర్తించి వారికి అండగా నిలుస్తోంది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు గుర్రాల సరోజనమ్మ. ఎనిమిది పదుల వయసులో ఆమె సామాజిక సేవా దృక్పథం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తోంది. గుర్రాల సరోజనమ్మ వయసు 84 ఏళ్లు. ప్రభుత్వ స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమె విశ్రాంత జీవనం గడుపుతోంది. చుట్టుపక్కల అందరితో ఆత్మీయంగా ఉండే సరోజినమ్మ అంటే అందరికీ అభిమానమే. ఆమె ఉద్యోగం చేసి సంపాదించిన ఆస్తులను మానవతా దృక్పథంతో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలకు కేటాయిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ► సొంతిల్లు దానం పట్టణ నడిబొడ్డున గోశాల రోడ్డులో 180 గజాల విస్తీర్ణంలో సుమారు రూ. కోటి విలువ చేసే సొంతిల్లు ఉంది సరోజనమ్మకు. ఆ ఇంటిని తెలంగాణ ఆల్ పెన్షర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖకు విరాళంగా ఇచ్చేశారామె. ఇప్పుడు ఆ ఇంటిని నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి కోసం వివిధ వృత్తుల్లో శిక్షణ, ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు కేంద్రంగా ఉపయోగించుకోనున్నారు. నిజామాబాద్ నగర కేంద్రంలో మల్లు స్వరాజ్యం మెమోరియల్ క్లిని క్కు అనుబంధంగా జనరిక్ హాల్ కోసం రూ. 2 లక్షలు విరాళం అందిస్తూ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం గోదావరి నది ఒడ్డున ఉన్న గోశాలకు రూ. లక్ష విరాళం ఇచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రూ. 20 వేల విలువైన పుస్తకాలను స్థానిక గ్రంథాలయానికి అందించారామె. ప్రస్తుతం అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా, డివిజన్‌శాఖ గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సరోజనమ్మ. ఆమె సేవా కార్యక్రమాలకు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్రావు, ఇతర డివిజన్ ప్రతినిధులు తమ సహకారాన్ని అందిస్తున్నారు. ► పెన్షన్ కూడా పేదలకే! బోధన్ పట్టణంలోని రాకాసిపేట్కు చెందిన గుర్రాల సూర్యనారాయణ, వెంకట సుబ్బమ్మ రెండో కూతురు సరోజనమ్మ. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. సరోజనమ్మ ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సంపాదించింది. ఆమె భర్త వెంకట్రావ్ బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పని చేసేవారు. 1996లో సరోజనమ్మ రిటైర్డ్ అయ్యింది. 2013లో భర్త మరణించారు. వీరికి సంతానం లేదు. నెలవారీగా వచ్చే పెన్షన్‌లో అవసరాలకు కొంత ఉంచుకుని మిగిలిన డబ్బులను పేదల ఆర్థిక అవసరాలకు సహాయం చేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారామె. మరణానంతరం తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని దానపత్రం సమర్పించారు. ► అంతిమ సంస్కారాలకు ధర్మస్థలం పొట్ట కూటి కోసం పల్లె నుంచి పట్నాలకు వచ్చిన నిరుపేదలు అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తుంటారు. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు చాలాచోట్ల ఇంటి యజమానులు అనుమతించరు. ఈ విషాదకర పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు పడే మానసిక క్షోభను ప్రత్యక్షంగా చూసిన సరోజినమ్మ మనసు కలిచివేసింది. ఇందుకు ఏదో పరిష్కార మార్గం చూపాలని సంకల్పించింది. ఇలాంటి నిరుపేదలు తమ కుటుంబ సభ్యుడి అంతిమ సంస్కారాలు కుల, మత. వర్గాలకతీతంగా వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా ఉచితంగా జరుపుకునేందుకు సౌకర్యంగా ఉండేవిధంగా ధర్మస్థలిని ఏర్పాటు చేసింది. బోధన్ పట్టణంలోని చెక్కి చెరువు పరిసరాల్లో ఉన్న శ్మశాన వాటిక ప్రహరీకి ఆనుకుని తన సొంత డబ్బులు రూ. 20 లక్షలు వెచ్చించి ధర్మ స్థలం నిర్మాణం చేపట్టింది. ఈ భవనంలో ఫ్రీజర్, కరెంట్, తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ ధర్మస్థలి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – గడ్డం గంగులు, సాక్షి, బోధన్ మంచి పనులే తోడు ఎవరికైనా జీవితంలో చేసిన మంచి పనులే కడదాకా తోడుంటాయి. బతికి ఉన్నంత కాలం సాటివారికి నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నాను. అందులో భాగంగానే నా శక్తి కొలదీ సాయం చేస్తూ వచ్చాను. చేసిన మేలు చెప్పుకోకూడదంటారు. నలుగురి మేలు కోసం చేసే ఏ పనైనా అది మనకు మంచే చేస్తుంది. ఈ కార్యక్రమాలకు ఇప్పటి వరకు ఎవరి నుంచి ఆర్థిక సహాయం తీసుకోలేదు. పొదుపు చేసినవి, నెలవారీ పెన్షన్‌గా వచ్చే డబ్బులే ఖర్చు పెడుతున్నాను. సేవ కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. – గుర్రాల సరోజనమ్మ -
గోటితో పోలేదు...
మంత్రాలకు చింతకాయలు రాలతాయా? రాలవు. మరేం రాలతాయి? ప్రాణాలు! మారణాయుధం... టార్గెట్‌ని మాత్రమే కొడుతుంది. మంత్రగాడి మాట ఎవర్ని టార్గెట్ చేస్తుందో తెలీదు. వాళ్లంటాడు... వీళ్లంటాడు... నలుపంటాడు... ఎరుపంటాడు... జడంటాడు... ముడంటాడు... అంజనం వేసి... ‘అదిగో చూడు’ అంటాడు. మూర్ఖుడి చేతిలో రాయీ... మంత్రగాడి నోటి మాటా... రెండూ ఒకటే. ఎవరి ప్రాణాలు రాలిపడతాయో చెప్పలేం. పాపం... ఇక్కడైతే... ఒక కుటుంబం కుటుంబమే రాలిపోయింది! చుక్కలో ఏం కనిపిస్తోంది?’’ - మాంత్రికుడు. ‘‘ఒక ఛాయగా ఉంది. ఏంటో తెలియడం లేదు’’ అయోమయంగా చూస్తోంది సరోజనమ్మ. ‘‘అది మనిషి నీడ కావచ్చేమో బాగా చూసి చెప్పు’’ ‘‘అవును, మనిషే’’ అన్నది సరోజనమ్మ. ‘‘ఆడా?మగా?’’ ‘‘ఆడమనిషి’’ ‘‘ఏం చేస్తోంది?’’ ‘‘ఏదో నూరుతోంది. పచ్చడేమో!’’ ‘‘ఆమె ఎక్కడ ఉంది?’’ ‘‘ఇంటి పెరట్లో’’ ‘‘అదెవరిల్లు?’’ ‘‘ఏమో... మా పెరడులాగానే ఉంది’’ ‘‘ఆమె ఏ రంగు దుస్తులు ధరించింది?’’ ‘‘నల్లచీరకు ఆకుపచ్చ అంచు, ఎర్ర రవికె’’ క్లూ ఏదో దొరికినట్లు తలపంకించాడు మంత్రగాడు. ‘ఎంత ఎత్తు ఉంది?’’ ‘‘నాకంటే ఎత్తుగా... పక్క వీధి రంగమ్మ ఎత్తు’’ ‘‘జుట్టు ముడి వేసుకుని ఉందా, జడ వేసుకుందా?’’ ‘‘ముడి వేసుకుని ఉంది’’ ‘‘రంగమ్మది జడా!, ముడి వేసుకుంటుందా?’’ ‘‘రంగమ్మ ముడేసుకుంటుంది’’ ‘‘బాగా చూడు... ఆమె రంగమ్మలాగానే ఉందా?’’ చెప్పలేకపోతోంది సరోజనమ్మ. సందిగ్దతతో కుడిచేతి బొటన వేలి మీద రాసిన అంజనం వైపే చూస్తోంది. మరికొంత అంజనం తీసుకుని ఆమె గోరు మీద రాశాడు మాంత్రికుడు. చిక్కగా నల్లగా కంటికి పెట్టుకునే కాటుకలా ఉంది అంజనం. అంజనం ఉన్న వేలిని పట్టుకున్నాడు మాంత్రికుడు. ‘‘కన్నార్పకుండా చూడు నీకంతా తెలుస్తోంది. నీ మీద చేతబడి చేసిన వాళ్లను నువ్వే పట్టేస్తున్నావు. మనిషిని గుర్తు పట్టు’’ అంటూ మాటలతో మాయ చేస్తున్నాడు. హిప్నటైజ్ అయినట్లు మగతగా సరోజనమ్మ కళ్లు మూత పడుతున్నాయి. ‘‘ఆమె రంగమ్మేనా చెప్పు’’ ఆమె చెంపల మీద చేత్తో తడుతూ అడుగుతున్నాడు ఆమె భర్త. కావచ్చేమో అనిపిస్తోంది... అవుననడానికి మనసు రావడం లేదు. తల అటూ ఇటుగా ఊపుతూ స్పృహతప్పి పడి పోయింది.మాంత్రికుడు కమండలంలోని నీటిని తీసుకుని మంత్రించి ఆమె మీద చల్లాడు. తన భుజం మీద ఉన్న తుండుతో సరోజనమ్మ ముఖం తుడిచాడు ఆమె భర్త. ఆమెను ఒక పక్కగా చాప మీద పడుకోబెట్టారు. ‘‘చేతబడి జరిగింది’’ నిర్ధారించాడు మాంత్రికుడు. నివ్వెరపోయాడు సరోజనమ్మ భర్త. ‘‘అందుకేనేమో స్వామీ! ఎప్పుడూ పీడకలలే. అర్ధరాత్రి లేచి కూర్చున్నదంటే ఇక నిద్రపోవడానికే భయపడుతుంటుంది. కళ్లు మూసుకుంటే ఎవరో తన చుట్టూ తిరుగుతున్నారని చెబుతోంది’’ అని వాపోయాడు. ‘‘చేతబడి ఎవరు చేశారనేది అమ్మాయి నోటితోనే చెప్పిందిగా’’ లౌక్యంగా పిక్చర్ తెస్తున్నాడు మాంత్రికుడు. ‘‘నా భార్య బతికేదెలా స్వామీ’’ మాంత్రికుని కాళ్లు పట్టుకున్నాడు సరోజనమ్మ భర్త. ‘‘విరుగుడు చేద్దాం’’ సాలోచనగా అన్నట్లుగా మాట జార్చాడు. అంతటితో ఆగక... ‘‘నల్లరంగు దుస్తులు ధరించి మీ ఇంటికి వచ్చిందంటే మీకు కీడు చేయడానికే. అదీ శనివారం రోజున. నీ భార్యకు ఒంట్లో బాగోలేదని, పనిలో సహాయం చేయడం అనే వంకతో వచ్చింది. ఓ మూల చేతబడి చేసిన మిరపకాయలు పెట్టి వెళ్లింది. ఆ మిరపకాయలను శుక్రవారం రోజు మీ ఇంటి నుంచే తీసుకెళ్లింది. మీరెవరూ గమనించలేదు’’ తప్పంతా మీదేనన్నట్లు కలరిచ్చాడు. ‘‘ఇంట్లో మనిషిలాగ తిరిగేది. ఇంత కుట్ర చేసిందా’’ కదిలిపోతున్నాడు సరోజనమ్మ భర్త. ‘‘రంగమ్మ చేతబడి చేసినట్లు నీ భార్యకు చెప్పకు. ఆడవాళ్లు మాట మనసులో దాచుకోలేరు. రేపు రంగమ్మ మీ ఇంటికి రాగానే గొడవపెట్టుకుంటే ఆమె జాగ్రత్తపడుతుంది. చేతబడి సంగతి తెలిసిపోయిందని ఇంకా పెద్ద క్షుద్రపూజ చేయిస్తుంది. అప్పుడు మనం చేసే విరుగుడు పారదు. మనిషిని వారంలో ప్రాణాలు తీసే పూజలున్నాయి. విరుగుడు అయ్యే వరకు రహస్యం’’ ఆదేశిస్తున్నట్లే ఉంది గొంతు. పాలిపోయిన ముఖంతో తలూపాడాయన. సరోజనమ్మ కదలడం కనిపించింది. ఆమెను లేపి నీటిలో విబూది కలిపి తాగించాడు మాంత్రికుడు. మాంత్రికుడి కనుసైగను గమనించిన అనుచరుడు వెంటనే స్పందించాడు. ‘‘గురువు గారు ఆమెకి మంత్రం చెప్తారు. ఎవరూ ఉండకూడదు’’ అంటూ బయటకు దారి తీశాడు. ‘‘తండ్రిలాంటి వాణ్ని. భయపడవద్దు’’ అని ఆమెకి భరోసా ఇచ్చాడు. ఇక విషయంలోకి వచ్చాడు... ‘‘నీకు చేతబడి చేసిందో మహిళ. ఆమె నీ భర్త మీద మనసు పడింది. నిన్ను అడ్డు తొలగించాలని కుట్ర పన్నింది. భర్తను జాగ్రత్త చేసుకో’’ అన్నాడు. మంత్రం వేసినట్లు తలూపింది సరోజనమ్మ. ఇంటికి వచ్చినప్పటి నుంచి సరోజనమ్మ మనసు మనసులో లేదు. భర్త ఎటు వెళ్తున్నా వెయ్యి కళ్లతో కనిపెడుతోంది. ఆమె భర్త మాత్రం చేతబడి విరుగుడు చేయించడానికి వనరులు సమకూర్చుకునే పనిలో ఉన్నాడు. విరుగుడు అంటే చిన్న ఖర్చు కాదు. బియ్యం, నల్ల కోడి కావాలి, మద్యం, డబ్బు... దక్షిణ ఇవ్వాలి. విరుగుడు సామగ్రి కొంటున్నట్లు ఊర్లో ఎవరికీ తెలియకూడదు. తన జాగ్రత్తలో తానున్నాడు. అతడి కదలికలు సరోజనమ్మను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. పుట్టింటి వాళ్లకు కబురు చేసింది. సమాచారం తెలిసిందే తడవుగా నలుగురు అన్నదమ్ములూ, మరిది (చెల్లెలి భర్త) వచ్చి వాలిపోయారు. ఒక రోజు... ఇంకా తెల్లవారనే లేదు. రంగమ్మ ఇంట్లో హాహాకారాలు. దొరికిన వారిని దొరికినట్లు నరికేశారు సరోజనమ్మ సోదరులు, మరిది. రంగమ్మ, ఆమె భర్త, అత్త, మామ, పిల్లలు... అంతా చనిపోయారు. రెండు గంటల్లో మారణహోమం. ఎవరికీ మాట్లాడే అవకాశమే లేదు. మాకు తెలియదు మొర్రో అని మొత్తుకోవాలని ఉన్నా వినే స్థిమితం వచ్చిన ఒక్కరిలోనూ లేదు. అంతా అయిపోయింది. పోలీసులు వచ్చేటప్పటికి హంతకులు పారిపోయారు. ఆ ఇంటికి వచ్చిన చుట్టాలనే చిన్న వివరం తప్ప ఆ ఊర్లో ఎవరికీ హంతకుల ఆనవాళ్లు పెద్దగా తెలియదు. తన బావమరుదులు ఇంతటి దారుణానికి ఒడిగడతారని సరోజనమ్మ భర్తకు కూడా తెలియదు. పోలీసుల విచారణలో విషయాలు బయటకు వచ్చాయి. అయినా మాంత్రికుడిని అరెస్టు చేయడానికి ఆధారం లేదు. మంత్రాలను, క్షుద్రవిద్యలను అరికట్టి తీరాలని జిల్లా కలెక్టరు నుంచి ఆదేశాలు వచ్చాయి. హేతువాద సంఘాల జోక్యంతో అంజనం పేరుతో చేసే మాయ అని తెలిసిన తర్వాత మాంత్రికుడి ఇంటిని సోదా చేశారు. పత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా అరెస్టు చేశారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇదో రకం ప్రతీకారం ఇలాంటి సంఘటనలు ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్, గంజాం, సుందర్‌గఢ్, రాయగడ ప్రాంతాల్లో ఎక్కువ. సంతాలి, కోహ్లా గిరిజన తెగల్లో విపరీతంగా జరుగుతాయి. ఏడాదికి కనీసం యాభై మంది మహిళలను చేతబడి చేస్తున్నారనే ఆరోపణలతో హతమారుస్తున్నారు. అది కూడా ఒంటరి మహిళల మీద ఈ అరాచకం ఎక్కువ. ఈ కేసులో కూడా రంగమ్మ అనే మహిళను దోషిగా మార్చింది మాంత్రికుడే. అతడి దగ్గర సహాయకురాలిగా పని చేయమని గతంలో అడిగినప్పుడు ఆమె అంగీకరించకపోవడమే ఈ కుట్రకు అసలు కారణం. (ఈ కథనంలో వ్యక్తుల పేర్లు మార్చడమైంది) అంజనంలో రంగమ్మ ఎలా కనిపించింది? ఆముదంతో దీపం వెలిగిస్తారు. దీపం పైన అడ్డు పెట్టి దాని నుంచి వెలువడే నుసి గోడకు అంటేటట్లు చేస్తారు. తర్వాత దానిని గోడ నుంచి గీకి పొడి చేసి మరికొంత ఆముదం కలుపుతారు. దీనిని మాంత్రికులే స్వయంగా తయారుచేసుకుంటారు. ఇది ఆముదం కలిసి ఉండడంతో మెరుస్తూ ఉంటుంది. కుడిచేతి బొటన వేలి గోరు మొత్తానికి రాస్తారు. మనిషిని ప్రశ్నల ద్వారానే హిప్నటైజ్ చేస్తారు. వెనుక అటూ ఇటూ నడిచే మనుషుల నీడ గోరు మీద కదులుతూ ఉంటుంది. ఎవరూ కదలకపోతే మాంత్రికుని అనుచరులే ఆ పని చేస్తారు. నీడగా ఏదో లీలగా కదులుతున్నట్లు కనిపించగానే అంజనం వేయించుకున్న వాళ్లు తమ మస్తిష్కంలో ఉన్న రూపం, భావనలతో స్పందిస్తారు. గోరు కుంభాకార కటకంలాగ పని చేస్తుంది. దూరంగా ఉన్న మనిషి రూపం కూడా చిన్నగా ప్రతిబింబిస్తుంది. వాహనాలకు ఉండే మిర్రర్లాగ అన్నమాట. ఎస్. శంకర శివరావు కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ -
కూతురు కాదు.. కాలాంతకురాలు
తల్లిదండ్రులను కొట్టి.. ఇంటి నుంచి గెంటేసిన కూతురు పోలీసులను ఆశ్రయించిన వృద్ధ దంపతులు యూసుఫ్‌గూడ: కన్నవాళ్లను కంటికిరెప్పలా చూసుకోవాల్సిన కూతురే వారిని ఇంటి నుంచి తన్ని తరిమేసింది. దీంతో రోడ్డునపడ్డ ఆ వృద్ధదంపతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. రెండు దశాబ్దాల క్రితం రెక్కలు ముక్కలు చేసుకొని పైసాపైసా కూడబెట్టి తాము నిర్మించుకొన్న ఇంటిని కూతురు తన మూడో భర్తతో కలిసి ఆక్రమించుకొని, తమను ఇంటి నుంచి గెంటేసిందని వారు కన్నీరుపెట్టుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు, బాధితులు కథనం ప్రకారం.. ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్‌గాంధీనగర్‌లో ఉండే సీహెచ్ సరోజనమ్మ, చెన్నయ్య దంపతులకు 50 గజాల స్థలంలో ఇల్లు ఉంది. ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఈ స్థలాన్ని కొని గూడు ఏర్పాటు చేసుకున్నారు. వీరి కూతురు భర్తను వదిలేసి మరో వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇటీవల అతడిని కూడా వదిలేసి బాబు అనే మరో వ్యక్తిని పెళి ్లచేసుకుంది. అప్పటి నుండే సరోజనమ్మ దంపతులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ ఇల్లు తమదని, ఇంటి నుంచి వెళ్లిపోవాలని, వృద్ధులని కూడా చూడకుండా కూతురు, అల్లుడు తరచూ వారిని కొడుతున్నారు. ఇప్పటికే సరోజనమ్మ దంపతులు మూడుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు వారికి నచ్చజెప్పి పంపేశారు. బస్తీ పెద్దలతో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. అయితే, ఇవేవీ ఆ వృద్ధులకు న్యాయం చేయలేకపోయాయి. మూడురోజుల నుంచి కూతురు, ఆమెతో పాటు ఉంటున్న బాబు వేధింపులు శ్రుతి మించాయని, తమను కొట్టి బయటకు నెట్టేశారని, న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.