గోటితో పోలేదు... | Goti did not go with the ... | Sakshi
Sakshi News home page

గోటితో పోలేదు...

Published Mon, May 16 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

గోటితో   పోలేదు...

గోటితో పోలేదు...

మంత్రాలకు చింతకాయలు రాలతాయా? రాలవు.
మరేం రాలతాయి? ప్రాణాలు!
మారణాయుధం... టార్గెట్‌ని మాత్రమే కొడుతుంది.
మంత్రగాడి మాట ఎవర్ని టార్గెట్ చేస్తుందో తెలీదు.
వాళ్లంటాడు... వీళ్లంటాడు... నలుపంటాడు... ఎరుపంటాడు...
జడంటాడు... ముడంటాడు...
అంజనం వేసి... ‘అదిగో చూడు’ అంటాడు.
మూర్ఖుడి చేతిలో రాయీ... మంత్రగాడి నోటి మాటా... రెండూ ఒకటే.
ఎవరి ప్రాణాలు రాలిపడతాయో చెప్పలేం.
పాపం... ఇక్కడైతే...
ఒక కుటుంబం కుటుంబమే రాలిపోయింది!

 

చుక్కలో ఏం కనిపిస్తోంది?’’ - మాంత్రికుడు.
‘‘ఒక ఛాయగా ఉంది. ఏంటో తెలియడం లేదు’’ అయోమయంగా చూస్తోంది సరోజనమ్మ.
‘‘అది మనిషి నీడ కావచ్చేమో బాగా చూసి చెప్పు’’
‘‘అవును, మనిషే’’ అన్నది సరోజనమ్మ.
‘‘ఆడా?మగా?’’
‘‘ఆడమనిషి’’
‘‘ఏం చేస్తోంది?’’
‘‘ఏదో నూరుతోంది. పచ్చడేమో!’’
‘‘ఆమె ఎక్కడ ఉంది?’’
‘‘ఇంటి పెరట్లో’’
‘‘అదెవరిల్లు?’’
‘‘ఏమో... మా పెరడులాగానే ఉంది’’
‘‘ఆమె ఏ రంగు దుస్తులు ధరించింది?’’
‘‘నల్లచీరకు ఆకుపచ్చ అంచు, ఎర్ర రవికె’’
క్లూ ఏదో దొరికినట్లు తలపంకించాడు మంత్రగాడు.
‘ఎంత ఎత్తు ఉంది?’’
‘‘నాకంటే ఎత్తుగా... పక్క వీధి రంగమ్మ ఎత్తు’’
‘‘జుట్టు ముడి వేసుకుని ఉందా, జడ వేసుకుందా?’’
‘‘ముడి వేసుకుని ఉంది’’
‘‘రంగమ్మది జడా!, ముడి వేసుకుంటుందా?’’
‘‘రంగమ్మ ముడేసుకుంటుంది’’
‘‘బాగా చూడు... ఆమె రంగమ్మలాగానే ఉందా?’’
చెప్పలేకపోతోంది సరోజనమ్మ. సందిగ్దతతో కుడిచేతి బొటన వేలి మీద రాసిన అంజనం వైపే చూస్తోంది.

 
మరికొంత అంజనం తీసుకుని ఆమె గోరు మీద రాశాడు మాంత్రికుడు. చిక్కగా నల్లగా కంటికి పెట్టుకునే కాటుకలా ఉంది అంజనం. అంజనం ఉన్న వేలిని పట్టుకున్నాడు మాంత్రికుడు. ‘‘కన్నార్పకుండా చూడు నీకంతా తెలుస్తోంది. నీ మీద చేతబడి చేసిన వాళ్లను నువ్వే పట్టేస్తున్నావు. మనిషిని గుర్తు పట్టు’’ అంటూ మాటలతో మాయ చేస్తున్నాడు. హిప్నటైజ్ అయినట్లు మగతగా సరోజనమ్మ కళ్లు మూత పడుతున్నాయి.


‘‘ఆమె రంగమ్మేనా చెప్పు’’ ఆమె చెంపల మీద చేత్తో తడుతూ అడుగుతున్నాడు ఆమె భర్త. కావచ్చేమో అనిపిస్తోంది... అవుననడానికి మనసు రావడం లేదు. తల అటూ ఇటుగా ఊపుతూ స్పృహతప్పి పడి పోయింది.మాంత్రికుడు కమండలంలోని నీటిని తీసుకుని మంత్రించి ఆమె మీద చల్లాడు. తన భుజం మీద ఉన్న తుండుతో సరోజనమ్మ ముఖం తుడిచాడు ఆమె భర్త. ఆమెను ఒక పక్కగా చాప మీద పడుకోబెట్టారు.  ‘‘చేతబడి జరిగింది’’ నిర్ధారించాడు మాంత్రికుడు. నివ్వెరపోయాడు సరోజనమ్మ భర్త. ‘‘అందుకేనేమో స్వామీ! ఎప్పుడూ పీడకలలే. అర్ధరాత్రి లేచి కూర్చున్నదంటే ఇక నిద్రపోవడానికే భయపడుతుంటుంది. కళ్లు మూసుకుంటే ఎవరో తన చుట్టూ తిరుగుతున్నారని చెబుతోంది’’ అని వాపోయాడు.

    

‘‘చేతబడి ఎవరు చేశారనేది అమ్మాయి నోటితోనే చెప్పిందిగా’’ లౌక్యంగా పిక్చర్ తెస్తున్నాడు మాంత్రికుడు. ‘‘నా భార్య బతికేదెలా స్వామీ’’ మాంత్రికుని కాళ్లు పట్టుకున్నాడు సరోజనమ్మ భర్త.  ‘‘విరుగుడు చేద్దాం’’ సాలోచనగా అన్నట్లుగా మాట జార్చాడు. అంతటితో ఆగక... ‘‘నల్లరంగు దుస్తులు ధరించి మీ ఇంటికి వచ్చిందంటే మీకు కీడు చేయడానికే. అదీ శనివారం రోజున. నీ భార్యకు ఒంట్లో బాగోలేదని, పనిలో సహాయం చేయడం అనే వంకతో వచ్చింది. ఓ మూల చేతబడి చేసిన మిరపకాయలు పెట్టి వెళ్లింది. ఆ మిరపకాయలను శుక్రవారం రోజు మీ ఇంటి నుంచే తీసుకెళ్లింది. మీరెవరూ గమనించలేదు’’ తప్పంతా మీదేనన్నట్లు కలరిచ్చాడు. ‘‘ఇంట్లో మనిషిలాగ తిరిగేది. ఇంత కుట్ర చేసిందా’’ కదిలిపోతున్నాడు సరోజనమ్మ భర్త.

 
‘‘రంగమ్మ చేతబడి చేసినట్లు నీ భార్యకు చెప్పకు. ఆడవాళ్లు మాట మనసులో దాచుకోలేరు. రేపు రంగమ్మ మీ ఇంటికి రాగానే గొడవపెట్టుకుంటే ఆమె జాగ్రత్తపడుతుంది. చేతబడి సంగతి తెలిసిపోయిందని ఇంకా పెద్ద క్షుద్రపూజ చేయిస్తుంది. అప్పుడు మనం చేసే విరుగుడు పారదు. మనిషిని వారంలో ప్రాణాలు తీసే పూజలున్నాయి. విరుగుడు అయ్యే వరకు రహస్యం’’ ఆదేశిస్తున్నట్లే ఉంది గొంతు. పాలిపోయిన ముఖంతో తలూపాడాయన.

 
సరోజనమ్మ కదలడం కనిపించింది. ఆమెను లేపి నీటిలో విబూది కలిపి తాగించాడు మాంత్రికుడు. మాంత్రికుడి కనుసైగను గమనించిన అనుచరుడు వెంటనే స్పందించాడు. ‘‘గురువు గారు ఆమెకి మంత్రం చెప్తారు. ఎవరూ ఉండకూడదు’’ అంటూ బయటకు దారి తీశాడు. ‘‘తండ్రిలాంటి వాణ్ని. భయపడవద్దు’’ అని ఆమెకి భరోసా ఇచ్చాడు. ఇక విషయంలోకి వచ్చాడు... ‘‘నీకు చేతబడి చేసిందో మహిళ. ఆమె నీ భర్త మీద మనసు పడింది. నిన్ను అడ్డు తొలగించాలని కుట్ర పన్నింది. భర్తను జాగ్రత్త చేసుకో’’ అన్నాడు. మంత్రం వేసినట్లు తలూపింది సరోజనమ్మ.

    

ఇంటికి వచ్చినప్పటి నుంచి సరోజనమ్మ మనసు మనసులో లేదు. భర్త ఎటు వెళ్తున్నా వెయ్యి కళ్లతో కనిపెడుతోంది. ఆమె భర్త మాత్రం చేతబడి విరుగుడు చేయించడానికి వనరులు సమకూర్చుకునే పనిలో ఉన్నాడు. విరుగుడు అంటే చిన్న ఖర్చు కాదు. బియ్యం, నల్ల కోడి కావాలి, మద్యం, డబ్బు... దక్షిణ ఇవ్వాలి. విరుగుడు సామగ్రి కొంటున్నట్లు ఊర్లో ఎవరికీ తెలియకూడదు. తన జాగ్రత్తలో తానున్నాడు. అతడి కదలికలు సరోజనమ్మను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. పుట్టింటి వాళ్లకు కబురు చేసింది. సమాచారం తెలిసిందే తడవుగా నలుగురు అన్నదమ్ములూ, మరిది (చెల్లెలి భర్త) వచ్చి వాలిపోయారు.

    

ఒక రోజు... ఇంకా తెల్లవారనే లేదు. రంగమ్మ ఇంట్లో హాహాకారాలు. దొరికిన వారిని దొరికినట్లు నరికేశారు సరోజనమ్మ సోదరులు, మరిది. రంగమ్మ, ఆమె భర్త, అత్త, మామ, పిల్లలు... అంతా చనిపోయారు. రెండు గంటల్లో మారణహోమం. ఎవరికీ మాట్లాడే అవకాశమే లేదు. మాకు తెలియదు మొర్రో అని మొత్తుకోవాలని ఉన్నా వినే స్థిమితం వచ్చిన ఒక్కరిలోనూ లేదు. అంతా అయిపోయింది. పోలీసులు వచ్చేటప్పటికి హంతకులు పారిపోయారు. ఆ ఇంటికి వచ్చిన చుట్టాలనే చిన్న వివరం తప్ప ఆ ఊర్లో ఎవరికీ హంతకుల ఆనవాళ్లు పెద్దగా తెలియదు. తన బావమరుదులు ఇంతటి దారుణానికి ఒడిగడతారని సరోజనమ్మ భర్తకు కూడా తెలియదు. పోలీసుల విచారణలో విషయాలు బయటకు వచ్చాయి. అయినా మాంత్రికుడిని అరెస్టు చేయడానికి ఆధారం లేదు. మంత్రాలను, క్షుద్రవిద్యలను అరికట్టి తీరాలని జిల్లా కలెక్టరు నుంచి ఆదేశాలు వచ్చాయి. హేతువాద సంఘాల జోక్యంతో అంజనం పేరుతో చేసే మాయ అని తెలిసిన తర్వాత మాంత్రికుడి ఇంటిని సోదా చేశారు. పత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా అరెస్టు చేశారు.

 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 

ఇదో రకం ప్రతీకారం
ఇలాంటి సంఘటనలు ఒడిశా రాష్ట్రం మయూర్‌భంజ్, గంజాం, సుందర్‌గఢ్, రాయగడ ప్రాంతాల్లో ఎక్కువ. సంతాలి, కోహ్లా గిరిజన తెగల్లో విపరీతంగా జరుగుతాయి. ఏడాదికి కనీసం యాభై మంది మహిళలను చేతబడి చేస్తున్నారనే ఆరోపణలతో హతమారుస్తున్నారు. అది కూడా ఒంటరి మహిళల మీద ఈ అరాచకం ఎక్కువ. ఈ కేసులో కూడా రంగమ్మ అనే మహిళను దోషిగా మార్చింది మాంత్రికుడే. అతడి దగ్గర సహాయకురాలిగా పని చేయమని గతంలో అడిగినప్పుడు ఆమె అంగీకరించకపోవడమే ఈ కుట్రకు అసలు కారణం. (ఈ కథనంలో వ్యక్తుల పేర్లు మార్చడమైంది)

 

అంజనంలో రంగమ్మ ఎలా కనిపించింది?
ఆముదంతో దీపం వెలిగిస్తారు. దీపం పైన అడ్డు పెట్టి దాని నుంచి వెలువడే నుసి గోడకు అంటేటట్లు చేస్తారు. తర్వాత దానిని గోడ నుంచి గీకి పొడి చేసి మరికొంత ఆముదం కలుపుతారు. దీనిని మాంత్రికులే స్వయంగా తయారుచేసుకుంటారు. ఇది ఆముదం కలిసి ఉండడంతో మెరుస్తూ ఉంటుంది. కుడిచేతి బొటన వేలి గోరు మొత్తానికి రాస్తారు. మనిషిని ప్రశ్నల ద్వారానే హిప్నటైజ్ చేస్తారు. వెనుక అటూ ఇటూ నడిచే మనుషుల నీడ గోరు మీద కదులుతూ ఉంటుంది. ఎవరూ కదలకపోతే మాంత్రికుని అనుచరులే ఆ పని చేస్తారు. నీడగా ఏదో లీలగా కదులుతున్నట్లు కనిపించగానే అంజనం వేయించుకున్న వాళ్లు తమ మస్తిష్కంలో ఉన్న రూపం, భావనలతో స్పందిస్తారు. గోరు కుంభాకార కటకంలాగ పని చేస్తుంది. దూరంగా ఉన్న మనిషి రూపం కూడా చిన్నగా ప్రతిబింబిస్తుంది. వాహనాలకు ఉండే మిర్రర్‌లాగ అన్నమాట.

 

ఎస్. శంకర శివరావు కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement