chennayya
-
టీడీపీ కార్యాలయం వద్ద ప్రమాదం
మంగళగిరి: గుంటూరు జిల్లా ఆత్మకూరులోని టీడీపీ జాతీయ కార్యాలయం వద్ద శుక్రవారం బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ర్యాలీగా ఇక్కడకి వచ్చారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు మద్యం మత్తులో ఇష్టానుసారంగా బాణసంచా కాల్చారు. దీంతో అక్కడ ఉన్న బాణసంచాకు అంతటికీ నిప్పు రవ్వలు అంటుకుని ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంగళగిరిలోని మార్కండేయ కాలనీకి చెందిన తాడిశెట్టి చెన్నయ్య, తాడిశెట్టి వెంకటేశ్వర్లు, నంబూరుకు చెందిన కారు డ్రైవర్ కొడాలి షణ్ముఖ, కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కేసర గ్రామానికి చెందిన ఎస్కే హుస్సేన్ సాహెబ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం చినకాకాని ఎన్నారై వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో చెన్నయ్య, వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కార్యాలయం వద్ద ర్యాలీ అదుపుతప్పడం, కార్యకర్తలు మద్యం సేవించి ఉండటం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. -
కిషన్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలి: జి. చెన్నయ్య
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తూ దళితుల మధ్య అంతరాలను పెంచుతున్న కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ కిషన్‌రెడ్డి దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వడాన్ని చెన్నయ్య నిరసించారు. -
కాలానికి నిలిచిన ‘గడియారం’ కృషి
అతడు నిజంగానే అనేక యుద్ధములలో ఆరితేరిన వృద్ధమూర్తి. జీవించింది ఎనభై ఏడేళ్ళు. స్వాతంత్య్రోద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభలు, సంఘ సంస్కరణ, నిజాం వ్యతిరేక పోరాటం, ఆంధ్ర సారస్వత పరిషత్తు మొదలైన ఉద్యమాల్లో పాల్గొన్న వజ్ర సంకల్ప సదృశ నాయకత్వం, కవితా రచన, పత్రికా రచన, శాసన పరిశోధన, కావ్యాలంకార నాటక వ్యాకరణాది శాస్త్ర పాండిత్యం, అనువాదం, నాటక సమాజస్థాపన, నటన, దర్శకత్వం వంటి సాంస్కృతికాభ్యుదయ శాఖల్లో సాంద్రతరమైన కృషితో తాను సంచరించిన తెలంగాణను వెలిగించిన బహుముఖీన ప్రతిభామూర్తి గడియారం రామకృష్ణశర్మ. 1919 మార్చి 6 న అనంతపురం జిల్లాలో జన్మించారు. బాల్యదశలోనే తెలంగాణలోని ఆలంపురం వచ్చారు. ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్య సాఫీగా సాగలేదు. 4వ తరగతిలో లెక్కల్లో ఉత్తీర్ణులు కాలేకపోవడంతో ఆగిపోయింది. కానీ ఆ కాలంలో తెలుగుమీద విశేషమైన అభిమానాన్ని ఏర్పరుచుకొని నవలలు, కాశీమజిలీ కథలు, మనుచరిత్ర, వసుచరిత్ర మొదలైన ప్రబంధాలు అధ్యయనం చేశారు. 16 ఏండ్ల వయసులో పద్యరచన ప్రారంభించారు. సంçస్కృతంలో కావ్య, నాటక, అలంకార శాస్త్రాలను అధ్యయనం చేశారు. ఆంధ్ర యువజన నాట్యమండలిని స్థాపించి పదేళ్లు తానే సంస్థ నిర్వాహకునిగా, నాటక దర్శకునిగా, ప్రధాన పాత్రల నటునిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్ర మహాసభకు తాలూకా కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. పల్లెల్లో గ్రంథాలయాలు, రాత్రి పాఠశాలల స్థాపన, స్థానికంగా, రాష్ట్రస్థాయిలో జరిగే సభలు, సమావేశాలకు వెళ్ళడంతో ముఖ్య నాయకునిగా రూపొందారు. 1942 మే నెలలో వరంగల్ సమీపంలోని ధర్మవరంలో నవమ ఆంధ్ర మహాసభ, 1943 మేలో హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో దశమాంధ్ర మహాసభ జరిగాయి. అప్పుడే ‘నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు’ ప్రారంభమైంది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా బులెటిన్లు విడుదల చేస్తూ ‘భాగ్యనగర్ రేడియోను’ ప్రారంభించి ప్రచారం చేశారు. కర్నూలు జిల్లా నిడుజురాలో పదేళ్ళ వయసు గల బాల వితంతువుకు పునర్వివాహం చేయించారు. అట్లా 5–6 వితంతు పునర్వివాహాలు చేయించడమే గాక స్వయంగా వితంతువును వివాహం చేసుకున్నారు. కులబహిష్కార దండనను ధైర్యంగా ఎదు ర్కొని నిలిచారు. 1953లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆలంపురంలో సప్తమ మహాసభలు జరుపుకున్నది. సభల్లో 30వేల మంది పాల్గొనడం ఒక రికార్డు. 1953లో గడియారం ‘సుజాత’ పత్రికను తిరిగి ప్రారంభించి మూడేళ్ళపాటు నడిపారు. తెలంగాణ ప్రత్యేక సంచికను వెలువరించారు. లిపిశాస్త్రం, శాసన శాస్త్రాలపై ప్రావీణ్యం సముపార్జించారు. బ్రహ్మీ, వేంగీ లిపి, తెలుగన్నడ లిపి, తెలుగు లిపి, నాగరిలిపులను నేర్చుకున్నారు. ఆలంపూరులోని దాదాపు అన్ని శాసనాలకు పాఠాలు తయారు చేశారు. లక్ష్మణరాయ పరిశోధక మండలిలో వున్న శాసన ప్రతి కృతులను చదివి తెలంగాణ శాసనాల రెండో భాగానికి సంపాదకత్వం వహిం చారు. ‘ఆలంపూరు శిథిలాలు’, ‘ఆలంపూరు చరిత్ర’, ‘దక్షిణ వారణాసి’, ‘దిమాన్యుమెంట్స్ ఆఫ్ ఆలంపూరు’, ‘ఉమామహేశ్వర చరిత్ర’, ‘బీచుపల్లి క్షేత్ర చరిత్ర’, ‘అనిమెల సంగమేశ్వర చరిత్ర’ రాశారు. పరిషత్తు విద్యార్థులకోసం ‘భారతదేశ చరిత్ర’ను నూతన దృక్పథంతో రాశారు. దేవాలయ నిర్మాణ రీతులను అధ్యయనం చేసి ‘భారతీయ వాస్తు విజ్ఞానము’, ‘మన వాస్తు సంపద’, ‘ఆంధ్రుల వాస్తు వైభవం’ గ్రంథాలను ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యునిగా సేవలందించారు. విశిష్ట సభ్యునిగా గౌరవించబడ్డారు. మంచన ‘కేయూర బాహు చరిత్ర’, కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’లను పరిష్కరించి విపుల పీఠికలు రాశారు. కన్నడలోని ‘కవి గదాయుద్ధ’ కావ్యాన్ని, ‘కన్నడ సణ్ణక తెగళ్ళు’ అనే గ్రంథాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ కోసం తెలుగులోకి అనువాదం చేశారు. గదాయుద్ధానికి అనువాద పురస్కారం లభించింది. కాలంతో పోటీపడి అవిరళ కృషి చేసిన గడియారం రామకృష్ణ శర్మ 25 జూలై 2006న కన్నుమూశారు. (తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నేడు గడియారం శతజయంతి సమాపనోత్సవం) వ్యాసకర్త: డా, జె.చెన్నయ్య తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి -
మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రాధిక షాద్‌నగర్ క్రైం/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: పిండి నేలపై పారబోసిందని క్షణికావేశంలో కన్నకూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించడంతో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న బాలిక మూడురోజులపాటు మృత్యువుతో పోరాడి సోమవారం తుదిశ్వాస విడిచింది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని చింతగూడకి చెందిన చెన్నయ్య, స్వరూప దంపతులు గత శుక్రవారం రాత్రి ఇంట్లో గొడవపడుతున్నారు. అప్పుడే వీరి చిన్న కుమార్తె రాధిక (9) రొట్టెల పిండిని తీసుకొస్తూ కింద పడేసింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లి స్వరూప కూతురి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. గ్రామస్తులు రాధికను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందిన రాధిక సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. మంగళవారం రాధిక మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు. ఆ తల్లిపై హత్యకేసు పెట్టాలి: బాలల హక్కుల సంఘం క్షణికావేశంలో కూతురి పట్ల కర్కశంగా వ్యవహరించి మరణానికి కారణమైన తల్లి స్వరూపపై హత్య కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరికొన్ని ఇళ్లల్లో.. రాధిక లాగే మిగిలిన పిల్లలకు రక్షణ లేదని, తల్లిదండ్రుల నుంచి వారికి ప్రాణాపాయం పొంచి ఉందన్న అభిప్రాయాన్ని ఆ సంఘం వ్యక్తం చేసింది. ఇలాంటి వారిని ప్రభుత్వ సంరక్షణ గృహానికి తరలించి వారి బాగోగులు చూసుకోవాలని సంఘం ప్రభుత్వాన్ని కోరింది. -
కూతురు కాదు.. కాలాంతకురాలు
తల్లిదండ్రులను కొట్టి.. ఇంటి నుంచి గెంటేసిన కూతురు పోలీసులను ఆశ్రయించిన వృద్ధ దంపతులు యూసుఫ్‌గూడ: కన్నవాళ్లను కంటికిరెప్పలా చూసుకోవాల్సిన కూతురే వారిని ఇంటి నుంచి తన్ని తరిమేసింది. దీంతో రోడ్డునపడ్డ ఆ వృద్ధదంపతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. రెండు దశాబ్దాల క్రితం రెక్కలు ముక్కలు చేసుకొని పైసాపైసా కూడబెట్టి తాము నిర్మించుకొన్న ఇంటిని కూతురు తన మూడో భర్తతో కలిసి ఆక్రమించుకొని, తమను ఇంటి నుంచి గెంటేసిందని వారు కన్నీరుపెట్టుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు, బాధితులు కథనం ప్రకారం.. ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్‌గాంధీనగర్‌లో ఉండే సీహెచ్ సరోజనమ్మ, చెన్నయ్య దంపతులకు 50 గజాల స్థలంలో ఇల్లు ఉంది. ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఈ స్థలాన్ని కొని గూడు ఏర్పాటు చేసుకున్నారు. వీరి కూతురు భర్తను వదిలేసి మరో వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇటీవల అతడిని కూడా వదిలేసి బాబు అనే మరో వ్యక్తిని పెళి ్లచేసుకుంది. అప్పటి నుండే సరోజనమ్మ దంపతులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ ఇల్లు తమదని, ఇంటి నుంచి వెళ్లిపోవాలని, వృద్ధులని కూడా చూడకుండా కూతురు, అల్లుడు తరచూ వారిని కొడుతున్నారు. ఇప్పటికే సరోజనమ్మ దంపతులు మూడుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు వారికి నచ్చజెప్పి పంపేశారు. బస్తీ పెద్దలతో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. అయితే, ఇవేవీ ఆ వృద్ధులకు న్యాయం చేయలేకపోయాయి. మూడురోజుల నుంచి కూతురు, ఆమెతో పాటు ఉంటున్న బాబు వేధింపులు శ్రుతి మించాయని, తమను కొట్టి బయటకు నెట్టేశారని, న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.