నిలోఫర్‌లో స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న పోలీసులు
నాంపల్లి: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పోలీసులు భుజానెత్తుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై దృషి ్టసారించారు. లాఠీలు, తుపాకులు పక్కన పెట్టి సామాజిక సృహా కోసం పనిచేశారు. గురువారం రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో స్వచ్ఛ భారత్‌ను చేపట్టారు. మధ్య మండలం డీసీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు భగ భగ మంటున్న ఎండను కూడా లెక్క చేయకుండా స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నారు.
చేయి చేయి కలిపి ఆసుపత్రిలో పేరుకుపోయిన చెత్తను ఊడ్చేశారు. ఏడాదంతా ఊడిస్తేగా తరలిపోని చెత్తను ఒకే రోజు పోలీసులు ఎత్తిపోశారు. నిలోఫర్ ఆసుపత్రి చుట్టూ ఉన్న అపరిశుభ్రతను తొలగించారు. నాలుగు బృందాలుగా విడిపోయి పనిచేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాంమోహన్‌రావు, సైపాబాద్ ఏసీపీ సురేందర్‌రెడ్డి, నాంపల్లి ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, సైపాబాద్ ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్ రావు, రాంగోపాల్‌పేట్ ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డి ఎస్సైలు సత్యనారాయణ, నిపుణ్ పాల్గొన్నారు.
18 లారీల చెత్త తరలింపు...
స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిలోఫర్ ఆస్పత్రిని శుభ్రం చేసిన పోలీసులు మొత్తం 18 లారీల చెత్తను బయటకు తరలించారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం నిలోఫర్ వైద్య శాలను ఎంపిక చేసుకున్న మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి స్వచ్ఛంద సంస్థలతో పాటు విద్యార్థులు, ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని భాగస్వాముల్ని చేసుకున్నారు. దాదాపు వారం రోజుల ముందు నుంచీ ప్రణాళిక సిద్ధం చేసుకుని గురువారం ఉదయం 10 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించి, మధ్యాహ్నం 2 గంటలకు ముగించారు. ‘స్వచ్ఛ్ భారత్’లో భాగంగా అధికారులు ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. శుభ్రపరిచిన ప్రాంతాల్లో మళ్లీ చెత్త పేరుకుపోకుండా చూసే చర్యల్లో భాగంగా మరో రెండు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో చెట్లు నాటాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.