హైదరాబాద్‌లో పోలియో వైరస్
పరిశోధనల్లో గుర్తింపు ఆరా తీసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో పోలియో వైరస్ వెలుగు చూసింది. నగరంలోని మురికి నీళ్లల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ఉలిక్కి పడింది. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరా తీస్తోంది. భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించాక సంబంధిత వైరస్ హైదరాబాద్‌లో వెలుగుచూడడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని మురికి నీళ్ల నమూనాలను ముంబైలోని ఒక పరిశోధన కేంద్రంలో పరీక్షించాక ఈ విషయాన్ని గుర్తించారు. అయితే మనుషుల్లో కాకుండా మురికి నీళ్లలో ఈ వైరస్ రావడానికి గల కారణాలపై పరిశోధన జరుగుతోంది.
నగరంలో మురికివాడలు అధికంగా ఉండటంతో వైరస్ ఎలా సోకిందో ఆరా తీస్తున్నారు. విదేశీయుల ద్వారా వచ్చిందా? లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న అంశంపై అధికారులు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం సమావేశమయ్యారు. శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ దీనిపై సీనియర్ వైద్య అధికారులతో చర్చించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆరా తీసింది. వెంటనే పరిశోధనలను ముమ్మరం చేయాలని... ఎలా వచ్చిందో కనుగొనాలని శాస్త్రవేత్తలకు సూచించింది.