Polio virus
-
Polio virus: పదేళ్ల తర్వాత పోలియో కలకలం.. తొలి కేసు నమోదు!
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో దాదాపు దశాబ్దం తర్వాత పోలియో కలకలం సృష్టించింది. పదేళ్ల తర్వాత తొలి కేసు నమోదైనట్లు అమెరికా గురువారం ప్రకటించింది. రాక్లాండ్ కౌంటీకి చెందిన ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్‌గా తేలినట్లు న్యూయార్క్ ఆరోగ్య విభాగం వెల్లడించింది. వ్యాధుల నియంత్రణ నిర్మూల కేంద్రం వివరాల ప్రకారం.. అమెరికాలో చివరి సారిగా 2013లో పోలియో కేసు నమోదైంది. నోటి ద్వారా పోలియే వ్యాక్సిన్(ఓపీవీ) తీసుకున్న వ్యక్తి నుంచి ఈ వైరస్ సోకినట్లు నిపుణులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలోనే నోటి ద్వారా వేసే వ్యాక్సిన్‌కు స్వస్తి పలికింది అమెరికా. ‘ అమెరికా వెలుపల ఓపీవీ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి నుంచి ఈ వైరస్ వచ్చినట్లు స్పష్టమవుతోంది. అధునాత వ్యాక్సిన్ల ద్వారా కొత్త రకాలు ఉద్భవించవు.’ అని పేర్కొంది న్యూయార్క్ ఆరోగ్య విభాగం. వైరస్ వ్యాప్తిని గుర్తించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించింది. పోలియో టీకా తీసుకోని ప్రజలు వెంటనే వేసుకోవాలని హెచ్చరించింది. తొలి కేసు నమోదైన నేపథ్యంలో అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయంగా చేస్తున్న కృషి వల్ల పోలియో అంతరించే స్థాయికి చేరుకుంది. ఈ వైరస్ ఎక్కువగా ఐదేళ్లలోపు పిల్లలపైనే అధిక ప్రభావం చూపుతుంది. 1988 నుంచి కొత్త కేసులు 99 శాతం తగ్గాయి. అప్పటి నుంచి 125 దేశాలను పోలియో రహిత దేశంగా ప్రకటించారు. మొత్తం 3,50,000 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో మాత్రం 1960లో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలోనే కేసులు తగ్గుముఖం పట్టాయి. నేరుగా పోలియో సోకిన కేసు 1979లో నమోదైంది. ఇదీ చదవండి: New Polio Virus In London: పోలియో వైరస్ కొత్త టైప్ గుర్తింపు. ఏ రూపంలో అయినా ముప్పే! -
Poliovirus: పోలియో వైరస్‌లో కొత్త టైప్ గుర్తింపు
దాదాపు కనుమరుగు అయ్యిందనుకుంటున్న పోలియో వైరస్.. కొత్త వేరియెంట్ రూపంలో మళ్లీ తెర మీదకు వచ్చింది. పోలియో వైరస్‌లో వీడీపీవీ2 రకాన్ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే.. ఇందుకు సంబంధించిన కేసులేవీ అధికారికంగా నమోదు కావడం భారీ ఊరట ఇచ్చే అంశం. లండన్‌లోని మురుగు నీటి నమునాలో ఈ కొత్త వేరియెంట్‌ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. టీకాల నుండి తీసుకోబడిన ఈ రకమైన పోలియోవైరస్ టైప్‌ను గుర్తించామని బ్రిటిష్ ఆరోగ్య ప్రతినిధులు సైతం బుధవారం ధృవీకరించారు. ప్రస్తుతానికి ఈ వేరియెంట్ బారిన పడినట్లు ఏ కేసు నమోదు కాలేదని, ఈ వేరియెంట్‌పై మరింత విశ్లేషణ జరుగుతోందని బ్రిటిష్ ప్రతినిధులు తెలిపారు. ‘‘వైరస్.. పర్యావరణ నమూనాల నుండి మాత్రమే వేరు చేయబడింది. కానీ, పక్షవాతం యొక్క సంబంధిత కేసులు ఏవీ కనుగొనబడలేదు అని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో. అయితే పోలియో వైరస్ ఏ టైప్, వేరియెంట్లో, ఏ రూపంలో ఉన్నా.. పిల్లలకు ప్రమాదమేన’’ని హెచ్చరించింది. పోలియోను అరికట్టేందుకు దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు ఎంతో కృషి చేస్తున్నాయి. 1988 సంవత్సరంతో పోలిస్తే.. ప్రస్తుత కాలంలో 99 శాతం కేసులు తగ్గాయి. దాదాపు 125 దేశాల్లో.. 3,50,000 కేసులు మాత్రమే గుర్తించబడ్డాయి. ప్రమాదకరమైన పోలియో వైరస్ అఫ్గనిస్తాన్, పాకిస్తాన్లో మాత్రం ఇంకా మనుగడలో ఉంది. ఇక భారత దేశం పోలియో రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లో ప్రకటించింది. కానీ ఈ మధ్యే కోల్‌కతాలో పోలియో వైరస్ నూతన రూపాంతరాన్ని గుర్తించారు. యునిసెఫ్ (UNICEF)తో కలిసి నిర్వహించిన అధ్యయనంలో పోలియో వైరస్ రూపాంతరం బయటపడింది. పశ్చిమ బెంగాల్లో చివరిసారిగా.. హౌరాలో 2011లో పన్నెండేళ్ళ బాలికకు పోలియో వైరస్ సోకినట్లు గుర్తించారు. ఆ తర్వాత UNICEFతో కలిసి రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన అధ్యయనాల్లో తాజాగా ఈ వైరస్ రూపాంతరం కనిపించింది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న బాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, టీకాలు వేయించడం.. పోలియో బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకునే మార్గాలు. చదవండి: వేల సంఖ్యలో కోవిడ్ కేసులు.. మరో వేవ్‌కు సంకేతమా? -
పోలియోకు సూది మందు!
సాక్షి, హైదరాబాద్: రెండు చుక్కల మందుతో పోలియో మహమ్మారికి చెక్ పెట్టిన ప్రపంచం రెండోదశ పోరుకు సిద్ధమవుతోంది. చుక్కల మందు స్థానంలో అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్‌కు ప్రమాణాలను నిర్ధారించే ప్రయత్నాలు మొదలయ్యాయి. భవిష్యత్తులో ఈ చుక్కల మందు వాడే అవకాశం లేని పరిస్థితుల్లో కొత్త సూది మందును సిద్ధం చేసేందుకు హైదరాబాద్ వేదికగా బుధవారం చర్చలు మొదలయ్యాయి. స్వచ్ఛంద సంస్థ పాథ్, బెల్ అండ్ మెలిండా గేట్స్లతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (అమెరికా), వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్, ప్రభుత్వ సంస్థలు సమావేశమై కొత్త సూదిమందు ఏ మోతాదులో ఇవ్వాలి? ఎలాంటి ప్రమాణాలతో తయారు చేయాలి? వంటి అంశాలపై చర్చించారు. ఈ వివరాలను పాథ్ ప్రాజెక్టు డైరెక్టర్ కుతుబ్ మహమూద్ విలేకరులకు వివరించారు. ప్రపంచ దేశాలన్నీ పోలియో రహితమైన తరువాత ఐదేళ్లలోపు పిల్లలకు చుక్కల మందు స్థానంలో సూది మందు ఇవ్వాలని.. తద్వారా మాత్రమే పోలియో మహమ్మారి మళ్లీ విజృంభించకుండా అడ్డుకోగలమన్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న చుక్కల మందులో సజీవ పోలియో వైరస్‌ను వాడుతుండగా... సూది మందులో నిర్జీవమైన పోలియో వైరస్ ఉంటుందని చెప్పారు. భారత్‌లో పోలియో కేసులేవీ లేనప్పటికీ నైజీరియా, పాక్, అఫ్గానిస్తాన్‌లో ఈ ఏడాది కొన్ని కేసులు బయటపడ్డాయని.. దీంతో ఈ సూది మందు వాడకం వాయిదా పడినట్లు అయిందని చెప్పారు. అయితే కొన్ని సంస్థలు ఇప్పటికే రెండు రకాలుగా ఈ సూదిమందును తయారు చేస్తున్నాయని, వీటిల్లో ఒకటి మన దేశ అవసరాలకు ఏమాత్రం సరిపోదని కుతుబ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ వాడేందుకు అనుకూలమైన సాబిన్ ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్‌ను సిద్ధం చేసేందుకు, భారీ మొత్తంలో తయారీకి నియంత్రణ సంస్థలను సిద్ధం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదేళ్లలో కొత్త వ్యాక్సిన్: భారత్ బయోటెక్ ఇంకో ఐదేళ్లలో భారత్ బయోటెక్ పూర్తిస్థాయిలో సాబిన్ ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ టీకాలను తయారు చేస్తుందని సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ కొత్త వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం అత్యవసరమని, ప్రస్తుతం ఆ పనిలో ఉన్నామని బుధవారం ‘సాక్షి’కి చెప్పారు. త్వరలోనే తొలిదశ క్లినికల్ ట్రయల్స్ మొదలుపెడతామని చెప్పారు. ఇవన్నీ పూర్తయ్యేందుకు నాలుగైదు ఏళ్లు పడుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న నేపథ్యంలో సాబిన్ ఐపీవీ ప్రమాణాల నిర్ధారణకు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారని వివరించారు. -
200 బృందాలతో పోలియోపై సమరం
పర్యవేక్షిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మళ్లీ వెలుగుచూసిన పోలియో వైరస్‌ను అరికట్టేందుకు వైద్య, ఆరోగ్య శాఖ నడుం బిగిం చింది. అంబర్‌పేట, నాగోలులోని మురుగు నీటి శుద్ధి ప్లాంట్లలో ఇటీవల టైప్-2 వ్యాక్సిన్ వైరస్ బయటపడటంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖ.. వ్యాక్సిన్ ఎక్కడెక్కడుందో కనుగొనేందుకు 200 బృందాలను నియమించింది. మొత్తం 800 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను జల్లెడ పడుతున్నారు. ప్రపంచ ఆరో గ్య సంస్థ అధికారులు కూడా ఈ బృందాలను పర్యవేక్షిస్తున్నారు. కొందరు ఆ బృందాలతో పర్యటిస్తున్నారు. శుక్రవారం రెండు ప్రైవేటు నర్సింగ్‌హోంలలో వైరస్ ఉన్న వ్యాక్సిన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో మూడు నాలుగు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిం చి నగరంలోని అన్ని ఆస్పత్రులనూ పరిశీలిస్తామని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గత నెల 28వ తేదీన అంబర్‌పేట, నాగోలులోని మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నుంచి శాంపిళ్లను సేకరించి ముంబైలోని ఈఆర్ఎస్ లేబొరేటరీకి పరీక్షలకు పంపగా రెండు చోట్ల కూడా పోలియో వైరస్ ఉన్నట్లు తేలింది. -
మళ్లీ పోలియో మహమ్మారి
* అంబర్‌పేట, నాగోలు నీటి శుద్ధి ప్లాంట్లలో బయటపడిన 2 కేసులు * ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మళ్లీ పోలియో వైరస్ వెలుగు చూసింది. నాలుగు నెలల్లోనే మళ్లీ పోలియో వైరస్ వెలుగు చూడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. సరిగ్గా గత జూన్ నెలలో అంబర్‌పేట మురుగునీటి నాలాలో పోలియో వైరస్ బయటపడిన సంగతి తెలిసిందే. మళ్లీ అంబర్‌పేట, నాగోలుల్లోని మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో టైప్-2 వ్యాక్సిన్ వైరస్ బయటపడిందని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఇది ప్రమాదకారి కాదని ఆయన వివరించారు. గత నెల 28వ తేదీన అంబర్‌పేట, నాగోలుల్లోని మురుగునీటి శుద్ధిప్లాంట్ల నుంచి శాంపిళ్లను సేకరించి ముంబైలోని ఈఆర్ఎస్ లేబరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించారు. ఆ పరీక్షల్లో రెండు చోట్ల కూడా పోలియో వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరా తీస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించాక సంబంధిత వైరస్ హైదరాబాద్‌లో నాలుగు నెలల్లోనే రెండుసార్లు వెలుగు చూడటంతో వైద్య ఆరోగ్యశాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మనుషుల్లో కాకుండా మురికి నీళ్లలో ఈ వైరస్ రావడానికి గల కారణాలపై పరిశోధన జరుగుతోంది. పోలియో వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన వైద్యాధికారులు, ఔషధ నియంత్రణ అధికారులు, మిలటరీ, రైల్వే, ఆర్టీసీ, ఐపీఎం అధికారులు హాజరయ్యారు. ఎలాంటి వైరస్ ఇది..? ఎలా వచ్చింది..? ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీ వరకు రాష్ట్రంలో ట్రైవలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (నోటి ద్వారా వేసే వ్యాక్సిన్-టీవోపీవీ)ను పిల్లలకు వేసేవారు. ఆ తర్వాత నుంచి దాన్ని నిషేధించారు. ఎందుకంటే నోటిద్వారా వేసే వ్యాక్సిన్‌లో బతికున్న పోలియో వైరస్ ఉంటుంది. అది సురక్షితం కాదని ఆ తర్వాత నుంచి ఇంజెక్షన్ రూపంలో వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే టీవోపీవీ వ్యాక్సిన్‌ను ఇంకా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడైనా ఉంచి ఉంటారని అనుమానిస్తున్నారు. వాటిని విచ్చలవిడిగా బయట పారేయడం వల్లే ఇప్పుడు పోలియో వెలుగు చూసిందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదకరమైన దీన్ని వేడినీళ్లలో మరగించి ప్రత్యేక పద్ధతుల్లో నాశనం చేయాలి. కానీ వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది మురుగునీటిలోకి వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. నేటి నుంచి మూడు రోజులు ప్రత్యేక డ్రైవ్ ఈ వైరస్ మురుగు నీటిలోనే ఉండి పోయిందా? మురుగు నీటి నుంచి తాగునీటిలో కలిసి పిల్లలెవరికైనా సోకిందా? అన్న అనుమానాలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 జిల్లాల్లోని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడైనా టైప్-2 వ్యాక్సిన్ ఇంకా ఉంటే.. వాటిని గుర్తించి నాశనం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. వివిధ శాఖలకు చెందిన 800 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటారు. -
ఆందోళన అవసరం లేదు: జేపీ నడ్డా
హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ లో బయట పడిన పోలీయో వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరో్గ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ఐదేళ్లుగాదేశంలో ఒక్క పోలియో కేసుకూడా నమోదు కాలేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ ను 2011 లోనే పోలియో రహిత దేశంగా గుర్తించిందని గుర్తు చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య సిబ్బంది తనిఖీల్లో అంబర్ పేటలో పోలియో వైరస్ బయటపడిన అనంతరంఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా చిన్నారులకు పోలియో వాక్సిన్ అందించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో తాము సమన్వయంతో పని చేస్తున్నామని అన్నారు. -
‘పోలియో’పై పోరు
- కదలిన కేంద్రం, అంతర్జాతీయ యంత్రాంగం - హైదరాబాద్‌కు యూనిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధుల రాక - వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు ఇక్కడే మకాం - పరిస్థితిని సమీక్షించిన కేంద్ర ఇమ్యునైజేషన్ డిప్యూటీ కమిషనర్ - ఆ వైరస్ ప్రమాదకరం కాదు.. పోలియోను - విస్తరింపజేయదు: మంత్రి లక్ష్మారెడ్డి - ఇంజెక్షన్ రూపంలో వ్యాక్సిన్ ఇవ్వడానికి సన్నాహాలు - చెన్నై నుంచి 3 లక్షల డోసుల మందు - ఈ నెల 20 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడతాం: కేంద్రం - భారత్ పోలియో రహిత దేశంగానే కొనసాగుతుందని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పోలియో వైరస్ వెలుగుచూడడంతో జాతీయ, అంతర్జాతీయ యంత్రాంగం అప్రమత్తమైంది. యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధులు ఐదుగురు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఈ నెల 20 నుంచి 26 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు వారిక్కడే మకాం వేస్తారు. 2011 తర్వాత హైదరాబాద్‌లో పోలియో వైరస్ వెలుగుచూడడంతో జాతీయ, అంతర్జాతీయ చానళ్లు సైతం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ప్రత్యేక ఇంట ర్వ్యూలు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ప్రతినిధి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటు కేంద్రం కూడా ఆగమేఘాలపై కదిలింది. కేంద్ర ఇమ్యునైజేషన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ హల్దార్ బుధవారం హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగంతో సమీక్ష జరిపారు. వైరస్ బయటపడిన మూడు వారాల్లోగా ఇమ్యునైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. చెన్నై నుంచి 3 లక్షల డోసుల ఇంజెక్షన్ మందు బుధవారం రాత్రికి చెన్నై నుంచి 3 లక్షల డోసుల పోలియో ఇంజెక్షన్ మందు హైదరాబాద్‌కు రానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలియో వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నందున ఇంటింటికి తిరిగి ఇవ్వడం సాధ్యం కాదు. హైదరాబాద్‌లో నిర్దేశించిన ప్రాంతంలో 700 బూత్‌లు, రంగారెడ్డి జిల్లాలో 126 బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. పిల్లలున్న వారంతా ఆ బూత్‌ల వద్దకే వెళ్లాల్సి ఉంటుంది. అందుకు అంగన్వాడీ, ఆశా కార్యకర్తల ద్వారా పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం చేస్తారు. పిల్లలకు ఇంజెక్షన్ మందు వేయడానికి రెండు వేల మంది వైద్య సిబ్బందిని సిద్ధం చేశారు. వారికి శిక్షణ మొదలు పెట్టారు. 500 మంది సిబ్బంది ని నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి తీసుకొస్తున్నారు. మొత్తం వ్యాక్సినేషన్‌ను ప్రజారోగ్య సంచాలకులు పర్యవేక్షిస్తారు. వ్యాక్సిన్ ఇంజెక్షన్ రూపంలో ప్రైవేటులో ఎక్కడా లభ్యం కాదని, ప్రైవేటు ఔషధ కంపెనీల ద్వారా కేంద్రమే కొనుగోలు చేసిందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు. నగరంలో వైద్య సిబ్బంది పర్యటన హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం వైద్య ఆరోగ్య సిబ్బంది పర్యటించారు. బస్తీల్లో ఇంటింటికి తిరిగి ఆరు మాసాల నుంచి మూడేళ్ల లోపు ఉన్న చిన్నారులను గుర్తించే పనిలో పడ్డారు. అమీర్‌పేట్, శ్రీరాంనగర్, గోల్కొండ క్లస్టర్ల పరిధిలో వైరస్ ఉండే అవకాశం లేకపోవడంతో సర్వే నుంచి వాటిని మినహాయించారు. అంబర్‌పేట, బార్కాస్, కంటోన్మెంట్, మలక్‌పేట, కోఠి, లాలాపేట, డబీర్‌పుర, జంగంమెట్, పానీపుర, సీతాఫల్మండి, సూరజ్‌భాను తదితర ప్రాంతాల్లో వైరస్ ఉండే అవకాశం ఉండటంతో వాటిని హైరిస్క్ జోన్లుగా ప్రకటించారు. జిల్లా వైద్యాధికారులు ఆయా బస్తీల్లో పర్యటించి మూడేళ్లలోపున్న చిన్నారుల వివరాలు నమోదు చేశారు. గ్రేటర్లో ఐదేళ్లలోపు 9.6 లక్షల మంది చిన్నారులు ఉండగా, వీరిలో ఆరు మాసాల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు నాలుగున్నర లక్షల వరకు ఉండే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. 20 నుంచి హైదరాబాద్, రంగారెడ్డిల్లో వ్యాక్సిన్: కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో వెలుగు చూసిన పోలియో వైరస్‌పై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారత్ పోలియో రహిత దేశంగా కొనసాగుతుందని, గత ఐదేళ్లలో ఎక్కడా వైరస్ బయటపడలేదని బుధవారం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో గుర్తించిన వైరస్.. వ్యాక్సిన్ కారణంగానే ఏర్పడిందేనని, చిన్నారులెవరూ దాని ప్రభావానికి గురికాలేదని వివరించింది. అయినా ముందు జాగ్రత్త చర్యగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ నెల 20 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 3 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా 6 వారాల నుంచి మూడు సంవత్సరాల చిన్నారులకు అదనంగా ఒక డోస్ ఇస్తామని తెలిపింది. దాదాపుగా 17 ఏళ్ల క్రితం 1999లో ప్రమాదకర పోలియో వైరస్‌ను చివరిసారిగా గుర్తించామని, వ్యాక్సిన్ కారణంగా బయటపడ్డ వైరస్‌తో పోలియో రహిత స్థితిలో మార్పురాదని వివరించింది. వ్యాక్సిన్ కారణంగా బయటపడ్డ వైరస్ జన్యుపరమైన మార్పునకు గురై ఉంటుందని పేర్కొంది. ప్రమాదమేమీ లేదు: లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లో వెలుగు చూసిన పోలియో వైరస్ చుక్కల మందు వ్యాక్సిన్ ద్వారా మనిషి శరీరంలోంచి బయటకు వచ్చిందేనని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. చుక్కల మందులో సజీవంగా వైరస్ ఉంటుందని, అది రోగ నిరోధక శక్తి తక్కువున్న పిల్లల నుంచి బయటకు వచ్చి మురుగునీటిలో ప్రవేశించి ఉంటుందన్నారు. ఈ వైరస్‌కు పోలియోను కలిగించే శక్తి లేదని, ఏమాత్రం ఆందోళన చెందవద్దని సూచించారు. ముందు జాగ్రత్త కోసమే వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించామన్నారు. చుక్కల మందు కంటే ఇంజెక్షన్ ద్వారా వేసే ఇన్ యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (ఐపీవీ) సురక్షితమని చెప్పారు. చుక్కల మందు 1, 3 రకాల వైరస్‌లను నాశనం చేస్తుందని, ఐపీవీ ఇంజెక్షన్ మాత్రం మూడు రకాల వైరస్‌లను నాశనం చేస్తుందని వివరించారు. అందుకే చుక్కల మందుతోపాటు ఇంజెక్షన్లు ఇస్తున్నామన్నారు. గతంలో చుక్కల మందు వేసినందున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 20 నుంచి 26 వరకు ఐపీవీ ఇంజెక్షన్ మాత్రమే ఇస్తామన్నారు. 2018 నుంచి కేవలం ఇంజెక్షన్ ద్వారానే పోలియో వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. అప్పటివరకు చుక్కల మందుతోపాటు ఐపీవీ ఇంజెక్షన్ ఇస్తామని పేర్కొన్నారు. -
వైరస్ వార్తతో ఉలిక్కిపడ్డ అంబర్‌పేట
వైరస్ వార్తలతో అంబర్‌పేట ప్రజలు ఉలిక్కిపడ్డారు. తమ ప్రాంతంలో వైరస్ ఉనికి కనిపించిందనే వార్తపై అంతా ఆరా తీయడం కనిపించింది. అంబర్‌పేట నాలాలో పోలియో వైరస్‌ను గుర్తించినట్లు ప్రపంచ అరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించడంతో స్థానికంగా సోమవారం చర్చనీయాంశం అయింది. వైరస్ తమ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిందా అంటూ కొంత మంది అధికారులను ఆరా తీశారు. అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ప్రధానంగా మూడు నాలాలు ప్రవహిస్తాయి. హుస్సేన్‌సాగర్, మోయిన్చెరువు, ఉప్పల్నాలాలు జనావాసాల మధ్య నుంచి వెళతాయి. ఇవే కాకుండా అంబర్‌పేట నియోజకవర్గం మెజార్జీ ప్రాంతాలకు అనుకొని మూసీ కూడా ప్రవహిస్తుంది. డబ్ల్యూహెచ్‌వో అంబర్‌పేటలోని ఏ ప్రాంతంలో నమూనాలు సేకరించిందో తెలియజేయనప్పటికి అంబర్‌పేట పేరు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నియోజకవర్గంలోని వివిధ బస్తీలు, కాలనీల్లో తరచూ నీరు కలుషిత మవుతుంటుంది. ఇప్పుడు పోలియో వైరస్ ఉందని తెలియడంతో కలుషిత నీరుపై అప్రమత్తంగా అధికారులు వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. పెద్ద పెద్ద నాలాలకు, తాగు నీటి సరఫరాకు సంబంధం లేదు... ప్రజలు భయపడాల్సిన పని కూడా లేదని జలమండలి జనరల్ మేనేజర్ రాం చంద్రారెడ్డి తెలిపారు. హుస్సేన్ సాగర్‌లో కలిసే కూకట్పల్లి నాలాను మారియేట్ హోటల్ వద్ద దారి మళ్లించి నేరుగా అంబర్‌పేట మీదుగా మూసీ నదిలో కలుపుతున్నామన్నారు. కెమికల్స్ కలిసిన మురుగు నీటిలో బహుశా వెలుగు చూసి వుండవచ్చు. తమకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని వివరణ ఇచ్చారు. -
నీటిలోనే ఉందా.. ఎవరికైనా సోకిందా?
- రాజధానిలో పోలియో వైరస్ వెలుగు చూడటంపై ప్రజల ఆందోళన - 20 నుంచి 26 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ సాక్షి, హైదరాబాద్: మహానగర డ్రైనేజీ నీటిలో బయటపడిన పోలియో వైరస్‌తో ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్ మురుగునీటిలోనే ఉండిపోయిందా... లేక అక్కడి నుంచి తాగునీటిలో కలసి పిల్లలెవరికైనా సోకిందా... అన్న అనుమానాలతో ఆందోళన చెందుతున్నారు. పిల్లల్లో ఉంది కాబట్టే అది మలం ద్వారా డ్రైనేజీలోకి వెళ్లి ఉండొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో సర్కారు యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించింది. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వారం రోజులపాటు ప్రత్యేకంగా పోలియో వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయించింది. నోటి ద్వారా వ్యాక్సినేషన్ వల్లేనా? అమెరికా వంటి దేశాల్లో పోలియో వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు. పోలియో వైరస్ ద్వారానే తయారైన వ్యాక్సిన్‌ను మన వద్ద ఎక్కువగా చుక్కల రూపంలో అందిస్తున్నారు. ఆ వ్యాక్సిన్ శరీరంలో యాంటీబాడీస్‌ను తయారుచేసి వైరస్ రాకుండా నిరోధిస్తుంది. అయితే చుక్కల రూపంలో వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఒక్కోసారి వైరస్ బతికుండే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వైరస్ సోకిన పిల్లలు మలం విసర్జిస్తే డ్రైనేజీ ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశాలుంటాయంటున్నారు. అదే ఇంజెక్షన్ల ద్వారా ఇస్తే వైరస్ విస్తరించే అవకాశాలుండవంటున్నారు. ఇటీవల నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మాత్రం 2 రూపాల్లోనూ ఇచ్చారు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే వ్యాక్సిన్ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించలేదు. దీనిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలియో రహితంగా ఎలా ప్రకటించారు? నూటికి నూరు శాతం పోలియో రహిత దేశంగా 2014 మార్చి 27న భారత్‌ను ప్రకటించారు. పూర్తి స్థాయిలో నిర్మూలించకుండా ఇలా ప్రకటనలు చేయడం వల్ల పోలియో నిర్మూలనకు సంబంధించిన చర్యలు తగ్గాయన్న విమర్శలూ ఉన్నాయి. గత అక్టోబర్‌లో ఢిల్లీలో వైరస్‌ను గుర్తించారు. ఆ తర్వాత బిహార్, గుజరాత్‌లోనూ ఇది కనిపించింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ వెలుగు చూసింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలియో రహిత దేశంగా ఎలా చెప్పుకోగలం? వాస్తవానికి తెలంగాణలో పోలియో వ్యాక్సినేషన్‌తోపాటు మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ద్వారా కూడా వ్యాక్సిన్ వేశారు. అయినా వైరస్ వెలుగు చూసిందంటే నిర్లక్ష్యం ఎవరిది.. కారణం ఏమిటి.. అన్నదానిపై చర్చ జరుగుతోంది. వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి సమీక్ష.. పోలియో వైరస్ సోకిందన్న నిర్ధారణతో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావుతో పాటు ఇతర అధికారులతో చర్చించారు. అంబర్‌పేట, బార్కస్, కంటోన్మెంట్, డబీర్‌పురా, జంగంమెట్, కింగ్ కోఠి, లాలాపేట్, మలక్‌పేట్, నాంపల్లి, పానిపురా, సీతాఫల్మండి, సూరజ్భాన్ తదితర ప్రాంతాల్లో పోలియో వైరస్ ఉండే అవకాశముందని గుర్తించారు. ఈ 12 ప్రాంతాల్లో ప్రత్యేక టీమ్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తారు. ఈ ప్రాంతాల్లో 2.82 లక్షల మంది పిల్లలకు వ్యాక్సినేషన్ వేయాల్సిన అవసరం ఉందని అధికారులు నిర్ధారించారు. అపోహలు వద్దు.. పోలియో వైరస్‌పై ఆందోళన చెం దాల్సిన అవసరం లేదు. ఎలాంటి అపోహలూ అక్కర్లేదు. వైరస్ వల్ల ఇతరులకు సోకిందన్న అనుమానాలు అవసరం లేదు. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయించింది. ఇంజెక్షన్ల రూపంలో ఇస్తున్నాం. - లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి -
హైదరాబాద్‌లో పోలియో వైరస్
పరిశోధనల్లో గుర్తింపు ఆరా తీసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సాక్షి, హైదరాబాద్: రాజధానిలో పోలియో వైరస్ వెలుగు చూసింది. నగరంలోని మురికి నీళ్లల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ఉలిక్కి పడింది. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరా తీస్తోంది. భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించాక సంబంధిత వైరస్ హైదరాబాద్‌లో వెలుగుచూడడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని మురికి నీళ్ల నమూనాలను ముంబైలోని ఒక పరిశోధన కేంద్రంలో పరీక్షించాక ఈ విషయాన్ని గుర్తించారు. అయితే మనుషుల్లో కాకుండా మురికి నీళ్లలో ఈ వైరస్ రావడానికి గల కారణాలపై పరిశోధన జరుగుతోంది. నగరంలో మురికివాడలు అధికంగా ఉండటంతో వైరస్ ఎలా సోకిందో ఆరా తీస్తున్నారు. విదేశీయుల ద్వారా వచ్చిందా? లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న అంశంపై అధికారులు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం సమావేశమయ్యారు. శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ దీనిపై సీనియర్ వైద్య అధికారులతో చర్చించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆరా తీసింది. వెంటనే పరిశోధనలను ముమ్మరం చేయాలని... ఎలా వచ్చిందో కనుగొనాలని శాస్త్రవేత్తలకు సూచించింది.