నీటిలోనే ఉందా.. ఎవరికైనా సోకిందా?
- రాజధానిలో పోలియో వైరస్ వెలుగు చూడటంపై ప్రజల ఆందోళన
- 20 నుంచి 26 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్
సాక్షి, హైదరాబాద్: మహానగర డ్రైనేజీ నీటిలో బయటపడిన పోలియో వైరస్‌తో ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్ మురుగునీటిలోనే ఉండిపోయిందా... లేక అక్కడి నుంచి తాగునీటిలో కలసి పిల్లలెవరికైనా సోకిందా... అన్న అనుమానాలతో ఆందోళన చెందుతున్నారు. పిల్లల్లో ఉంది కాబట్టే అది మలం ద్వారా డ్రైనేజీలోకి వెళ్లి ఉండొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో సర్కారు యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించింది. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వారం రోజులపాటు ప్రత్యేకంగా పోలియో వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయించింది.
నోటి ద్వారా వ్యాక్సినేషన్ వల్లేనా?
అమెరికా వంటి దేశాల్లో పోలియో వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు. పోలియో వైరస్ ద్వారానే తయారైన వ్యాక్సిన్‌ను మన వద్ద ఎక్కువగా చుక్కల రూపంలో అందిస్తున్నారు. ఆ వ్యాక్సిన్ శరీరంలో యాంటీబాడీస్‌ను తయారుచేసి వైరస్ రాకుండా నిరోధిస్తుంది. అయితే చుక్కల రూపంలో వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఒక్కోసారి వైరస్ బతికుండే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వైరస్ సోకిన పిల్లలు మలం విసర్జిస్తే డ్రైనేజీ ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశాలుంటాయంటున్నారు. అదే ఇంజెక్షన్ల ద్వారా ఇస్తే వైరస్ విస్తరించే అవకాశాలుండవంటున్నారు. ఇటీవల నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మాత్రం 2 రూపాల్లోనూ ఇచ్చారు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే వ్యాక్సిన్ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించలేదు. దీనిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోలియో రహితంగా ఎలా ప్రకటించారు?
నూటికి నూరు శాతం పోలియో రహిత దేశంగా 2014 మార్చి 27న భారత్‌ను ప్రకటించారు. పూర్తి స్థాయిలో నిర్మూలించకుండా ఇలా ప్రకటనలు చేయడం వల్ల పోలియో నిర్మూలనకు సంబంధించిన చర్యలు తగ్గాయన్న విమర్శలూ ఉన్నాయి. గత అక్టోబర్‌లో ఢిల్లీలో వైరస్‌ను గుర్తించారు. ఆ తర్వాత బిహార్, గుజరాత్‌లోనూ ఇది కనిపించింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ వెలుగు చూసింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలియో రహిత దేశంగా ఎలా చెప్పుకోగలం? వాస్తవానికి తెలంగాణలో పోలియో వ్యాక్సినేషన్‌తోపాటు మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ద్వారా కూడా వ్యాక్సిన్ వేశారు. అయినా వైరస్ వెలుగు చూసిందంటే నిర్లక్ష్యం ఎవరిది.. కారణం ఏమిటి.. అన్నదానిపై చర్చ జరుగుతోంది.
వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి సమీక్ష..
పోలియో వైరస్ సోకిందన్న నిర్ధారణతో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావుతో పాటు ఇతర అధికారులతో చర్చించారు. అంబర్‌పేట, బార్కస్, కంటోన్మెంట్, డబీర్‌పురా, జంగంమెట్, కింగ్ కోఠి, లాలాపేట్, మలక్‌పేట్, నాంపల్లి, పానిపురా, సీతాఫల్‌మండి, సూరజ్‌భాన్ తదితర ప్రాంతాల్లో పోలియో వైరస్ ఉండే అవకాశముందని గుర్తించారు. ఈ 12 ప్రాంతాల్లో ప్రత్యేక టీమ్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తారు. ఈ ప్రాంతాల్లో 2.82 లక్షల మంది పిల్లలకు వ్యాక్సినేషన్ వేయాల్సిన అవసరం ఉందని అధికారులు నిర్ధారించారు.
అపోహలు వద్దు..
పోలియో వైరస్‌పై ఆందోళన చెం దాల్సిన అవసరం లేదు. ఎలాంటి అపోహలూ అక్కర్లేదు. వైరస్ వల్ల ఇతరులకు సోకిందన్న అనుమానాలు అవసరం లేదు. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయించింది. ఇంజెక్షన్ల రూపంలో ఇస్తున్నాం.
- లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి