సాక్షి, హైదరాబాద్: రెండు చుక్కల మందుతో పోలియో మహమ్మారికి చెక్ పెట్టిన ప్రపంచం రెండోదశ పోరుకు సిద్ధమవుతోంది. చుక్కల మందు స్థానంలో అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్‌కు ప్రమాణాలను నిర్ధారించే ప్రయత్నాలు మొదలయ్యాయి. భవిష్యత్తులో ఈ చుక్కల మందు వాడే అవకాశం లేని పరిస్థితుల్లో కొత్త సూది మందును సిద్ధం చేసేందుకు హైదరాబాద్ వేదికగా బుధవారం చర్చలు మొదలయ్యాయి. స్వచ్ఛంద సంస్థ పాథ్, బెల్ అండ్ మెలిండా గేట్స్‌లతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (అమెరికా), వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్, ప్రభుత్వ సంస్థలు సమావేశమై కొత్త సూదిమందు ఏ మోతాదులో ఇవ్వాలి? ఎలాంటి ప్రమాణాలతో తయారు చేయాలి? వంటి అంశాలపై చర్చించారు.
ఈ వివరాలను పాథ్ ప్రాజెక్టు డైరెక్టర్ కుతుబ్ మహమూద్ విలేకరులకు వివరించారు. ప్రపంచ దేశాలన్నీ పోలియో రహితమైన తరువాత ఐదేళ్లలోపు పిల్లలకు చుక్కల మందు స్థానంలో సూది మందు ఇవ్వాలని.. తద్వారా మాత్రమే పోలియో మహమ్మారి మళ్లీ విజృంభించకుండా అడ్డుకోగలమన్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న చుక్కల మందులో సజీవ పోలియో వైరస్‌ను వాడుతుండగా... సూది మందులో నిర్జీవమైన పోలియో వైరస్ ఉంటుందని చెప్పారు. భారత్‌లో పోలియో కేసులేవీ లేనప్పటికీ నైజీరియా, పాక్, అఫ్గానిస్తాన్‌లో ఈ ఏడాది కొన్ని కేసులు బయటపడ్డాయని.. దీంతో ఈ సూది మందు వాడకం వాయిదా పడినట్లు అయిందని చెప్పారు. అయితే కొన్ని సంస్థలు ఇప్పటికే రెండు రకాలుగా ఈ సూదిమందును తయారు చేస్తున్నాయని, వీటిల్లో ఒకటి మన దేశ అవసరాలకు ఏమాత్రం సరిపోదని కుతుబ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ వాడేందుకు అనుకూలమైన సాబిన్ ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్‌ను సిద్ధం చేసేందుకు, భారీ మొత్తంలో తయారీకి నియంత్రణ సంస్థలను సిద్ధం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఐదేళ్లలో కొత్త వ్యాక్సిన్: భారత్ బయోటెక్
ఇంకో ఐదేళ్లలో భారత్ బయోటెక్ పూర్తిస్థాయిలో సాబిన్ ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ టీకాలను తయారు చేస్తుందని సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ కొత్త వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం అత్యవసరమని, ప్రస్తుతం ఆ పనిలో ఉన్నామని బుధవారం ‘సాక్షి’కి చెప్పారు. త్వరలోనే తొలిదశ క్లినికల్ ట్రయల్స్ మొదలుపెడతామని చెప్పారు. ఇవన్నీ పూర్తయ్యేందుకు నాలుగైదు ఏళ్లు పడుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న నేపథ్యంలో సాబిన్ ఐపీవీ ప్రమాణాల నిర్ధారణకు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారని వివరించారు.
పోలియోకు సూది మందు!
Published Thu, Jul 12 2018 1:25 AM | Last Updated on Thu, Jul 12 2018 10:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment