‘పోలియో’పై పోరు | war on polio | Sakshi
Sakshi News home page

‘పోలియో’పై పోరు

Published Thu, Jun 16 2016 4:05 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

‘పోలియో’పై పోరు - Sakshi

‘పోలియో’పై పోరు

- కదలిన కేంద్రం, అంతర్జాతీయ యంత్రాంగం
- హైదరాబాద్‌కు యూనిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధుల రాక
- వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు ఇక్కడే మకాం
- పరిస్థితిని సమీక్షించిన కేంద్ర ఇమ్యునైజేషన్ డిప్యూటీ కమిషనర్
- ఆ వైరస్ ప్రమాదకరం కాదు.. పోలియోను
- విస్తరింపజేయదు: మంత్రి లక్ష్మారెడ్డి
- ఇంజెక్షన్ రూపంలో వ్యాక్సిన్ ఇవ్వడానికి సన్నాహాలు
- చెన్నై నుంచి 3 లక్షల డోసుల మందు
- ఈ నెల 20 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడతాం: కేంద్రం
- భారత్ పోలియో రహిత దేశంగానే కొనసాగుతుందని వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పోలియో వైరస్ వెలుగుచూడడంతో జాతీయ, అంతర్జాతీయ యంత్రాంగం అప్రమత్తమైంది. యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధులు ఐదుగురు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఈ నెల 20 నుంచి 26 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు వారిక్కడే మకాం వేస్తారు. 2011 తర్వాత హైదరాబాద్‌లో పోలియో వైరస్ వెలుగుచూడడంతో జాతీయ, అంతర్జాతీయ చానళ్లు సైతం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ప్రత్యేక ఇంట ర్వ్యూలు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ప్రతినిధి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటు కేంద్రం కూడా ఆగమేఘాలపై కదిలింది. కేంద్ర ఇమ్యునైజేషన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ హల్దార్ బుధవారం హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగంతో సమీక్ష జరిపారు. వైరస్ బయటపడిన మూడు వారాల్లోగా ఇమ్యునైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు.

 చెన్నై నుంచి 3 లక్షల డోసుల ఇంజెక్షన్ మందు
 బుధవారం రాత్రికి చెన్నై నుంచి 3 లక్షల డోసుల పోలియో ఇంజెక్షన్ మందు హైదరాబాద్‌కు రానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలియో వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నందున ఇంటింటికి తిరిగి ఇవ్వడం సాధ్యం కాదు. హైదరాబాద్‌లో నిర్దేశించిన ప్రాంతంలో 700 బూత్‌లు, రంగారెడ్డి జిల్లాలో 126 బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. పిల్లలున్న వారంతా ఆ బూత్‌ల వద్దకే వెళ్లాల్సి ఉంటుంది. అందుకు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల ద్వారా పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం చేస్తారు. పిల్లలకు ఇంజెక్షన్ మందు వేయడానికి రెండు వేల మంది వైద్య సిబ్బందిని సిద్ధం చేశారు. వారికి శిక్షణ మొదలు పెట్టారు. 500 మంది సిబ్బంది ని నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి తీసుకొస్తున్నారు. మొత్తం వ్యాక్సినేషన్‌ను ప్రజారోగ్య సంచాలకులు పర్యవేక్షిస్తారు. వ్యాక్సిన్ ఇంజెక్షన్ రూపంలో ప్రైవేటులో ఎక్కడా లభ్యం కాదని, ప్రైవేటు ఔషధ కంపెనీల ద్వారా కేంద్రమే కొనుగోలు చేసిందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు.
 
 నగరంలో వైద్య సిబ్బంది పర్యటన
 హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం వైద్య ఆరోగ్య సిబ్బంది పర్యటించారు. బస్తీల్లో ఇంటింటికి తిరిగి ఆరు మాసాల నుంచి మూడేళ్ల లోపు ఉన్న చిన్నారులను గుర్తించే పనిలో పడ్డారు. అమీర్‌పేట్, శ్రీరాంనగర్, గోల్కొండ క్లస్టర్ల పరిధిలో వైరస్ ఉండే అవకాశం లేకపోవడంతో సర్వే నుంచి వాటిని మినహాయించారు. అంబర్‌పేట, బార్కాస్, కంటోన్మెంట్, మలక్‌పేట, కోఠి, లాలాపేట, డబీర్‌పుర, జంగంమెట్, పానీపుర, సీతాఫల్‌మండి, సూరజ్‌భాను తదితర ప్రాంతాల్లో వైరస్ ఉండే అవకాశం ఉండటంతో వాటిని హైరిస్క్ జోన్లుగా ప్రకటించారు. జిల్లా వైద్యాధికారులు ఆయా బస్తీల్లో పర్యటించి మూడేళ్లలోపున్న చిన్నారుల వివరాలు నమోదు చేశారు. గ్రేటర్‌లో ఐదేళ్లలోపు 9.6 లక్షల మంది చిన్నారులు ఉండగా, వీరిలో ఆరు మాసాల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు నాలుగున్నర లక్షల వరకు ఉండే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
 
 20 నుంచి హైదరాబాద్, రంగారెడ్డిల్లో వ్యాక్సిన్: కేంద్రం
 సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో వెలుగు చూసిన పోలియో వైరస్‌పై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారత్ పోలియో రహిత దేశంగా కొనసాగుతుందని, గత ఐదేళ్లలో ఎక్కడా వైరస్ బయటపడలేదని బుధవారం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో గుర్తించిన వైరస్.. వ్యాక్సిన్ కారణంగానే ఏర్పడిందేనని, చిన్నారులెవరూ దాని ప్రభావానికి గురికాలేదని వివరించింది. అయినా ముందు జాగ్రత్త చర్యగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ నెల 20 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 3 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా 6 వారాల నుంచి మూడు సంవత్సరాల చిన్నారులకు అదనంగా ఒక డోస్ ఇస్తామని తెలిపింది. దాదాపుగా 17 ఏళ్ల క్రితం 1999లో ప్రమాదకర పోలియో వైరస్‌ను చివరిసారిగా గుర్తించామని, వ్యాక్సిన్ కారణంగా బయటపడ్డ వైరస్‌తో పోలియో రహిత స్థితిలో మార్పురాదని వివరించింది. వ్యాక్సిన్ కారణంగా బయటపడ్డ వైరస్ జన్యుపరమైన మార్పునకు గురై ఉంటుందని పేర్కొంది.
 
 ప్రమాదమేమీ లేదు: లక్ష్మారెడ్డి
 హైదరాబాద్‌లో వెలుగు చూసిన పోలియో వైరస్ చుక్కల మందు వ్యాక్సిన్ ద్వారా మనిషి శరీరంలోంచి బయటకు వచ్చిందేనని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. చుక్కల మందులో సజీవంగా  వైరస్ ఉంటుందని, అది రోగ నిరోధక శక్తి తక్కువున్న పిల్లల నుంచి బయటకు వచ్చి మురుగునీటిలో ప్రవేశించి ఉంటుందన్నారు. ఈ వైరస్‌కు పోలియోను కలిగించే శక్తి లేదని, ఏమాత్రం ఆందోళన చెందవద్దని సూచించారు. ముందు జాగ్రత్త కోసమే వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించామన్నారు. చుక్కల మందు కంటే ఇంజెక్షన్ ద్వారా వేసే ఇన్ యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (ఐపీవీ) సురక్షితమని చెప్పారు. చుక్కల మందు 1, 3 రకాల వైరస్‌లను నాశనం చేస్తుందని, ఐపీవీ ఇంజెక్షన్ మాత్రం మూడు రకాల వైరస్‌లను నాశనం చేస్తుందని వివరించారు. అందుకే చుక్కల మందుతోపాటు ఇంజెక్షన్లు ఇస్తున్నామన్నారు. గతంలో చుక్కల మందు వేసినందున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 20 నుంచి 26 వరకు ఐపీవీ ఇంజెక్షన్ మాత్రమే ఇస్తామన్నారు. 2018 నుంచి కేవలం ఇంజెక్షన్ ద్వారానే పోలియో వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. అప్పటివరకు చుక్కల మందుతోపాటు ఐపీవీ ఇంజెక్షన్ ఇస్తామని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement