
'రాజకీయాలు వ్యాపారంగా మారాయి'
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలు వ్యాపారంగా మారాయి అనడానికి ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీని వదిలి అధికారపార్టీ వైపు వెళ్లాలనే ప్రయత్నాలే తాత్కారణమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం సాక్షితో మాట్లాడుతూ... ఓట్లు వేసే ప్రజలకు పార్టీలు వేర్వేరు అనే భావనలో ఉండొచ్చుకాని... ఎన్నికైన ఈ ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది పార్టీలకు మధ్య వ్యత్యాసంలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలు రాజకీయాలు అభిమానించే వారికి బాధకలిగించేవి అయినా అశ్యర్యాన్ని మాత్రం తెప్పించడంలేదన్నారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు రాష్ట్రంలో ఉన్న అధికారాల మొత్తాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవడం వల్ల ఎమ్మెల్యేలు పనుల కోసం అధికార పార్టీ వైపు వెళ్లక తప్పడంలేదన్న భావన వ్యక్తమవుతుందని చెప్పారు. కేవలం ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్న అధికారం మంత్రులు, జిల్లా నాయకులు, గ్రామ స్థాయికి వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరున్నా గ్రామాల్లో మాకు కావాల్సిన పనులు మేము చేసుకోగలమన్న పరిస్థితి ఉత్పన్నం అయినప్పుడే ఇలాంటి పరిమాణాలకు ముగింపు ఉంటుందని తెలిపారు.