సాక్షి, సిటీబ్యూరో :
దీపావళి మతాబులు నగర పర్యావరణానికి పొగబెట్టాయి. పీల్చే గాలిలో అసలు ఉండకూడని అమ్మోనియా మోతాదు శ్రుతి మించింది. నగరంలోని ప్రతి క్యూబిక్ మీటరు గాలిలో 200 మైక్రోగ్రాములు దాటకూడని కాలుష్య కారక ధూళికణాలూ అనూహ్యంగా పెరిగాయి. ఫలితంగా నగరవాసుల్లో శ్వాసకోశ భాగాలన్నింటినీ అమ్మోనియా ఇబ్బందులు కలిగించింది. శ్వాసకోశాలను ఉక్కిరి బిక్కిరి చేసింది. సిటీజన్ల కళ్లను తీవ్రంగా మండించింది. పలు శ్వాసకోశ వ్యాధులకు కారణమైంది. కాగా క్యూబిక్ మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములు దాటకూడని అమ్మోనియా అత్యధికంగా జూపార్క్‌లో 175, ఉప్పల్‌లో 120, జీడిమెట్లలో 101 మైక్రోగ్రాములుగా నమోదవడం కలకలం సృష్టిస్తోంది. మరోవైపు పలు ప్రాంతాల్లోని పీల్చే గాలిలో ధూళికణాలు (పీఎం10), సూక్ష్మ ధూళి రేణువులు (టీఎస్‌పీఎం) మోతాదు కూడా పరిమితి మించి పెరిగింది. వీటితోపాటు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి మూలకాల మోతాదు కూడా భారీగా పెరగడంతో ముక్కుపుటాలు అదిరిపోయాయి.
సిటీజన్ల కళ్లు, ఊపిరితిత్తులు, శ్వాసకోశాలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. అబిడ్స్, పంజగుట్ట, కేబీఆర్‌పార్క్, చిక్కడపల్లి, కూకట్‌పల్లి, లంగర్‌హౌస్, మాదాపూర్, ఎంజీబీఎస్, నాచారం, రాజేంద్రనగర్, సైనిక్‌పురి, శామీర్‌పేట్, ప్యారడైజ్, చార్మినార్, జూపార్క్, బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, జీడిమెట్ల.. తదితర ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రత అత్యధికంగా నమోదైనట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కతేల్చింది. ఆయా ప్రాంతాల్లో దీపావళికి ముందు, పండుగ రోజు వాయు కాలుష్యాన్ని లెక్కించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలను మించి వాయు కాలుష్యం నమోదు కావడం పట్ల పర్యావరణ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా వాయుకాలుష్యం గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరగడం గమనార్హం.
అమ్మోనియా మోతాదు మించిన వివిధ ప్రాంతాలివీ... (క్యూబిక్ మీటరు గాలికి మైక్రోగ్రాముల్లో..)
ప్రాంతం అమ్మోనియా మోతాదు
ప్యారడైజ్ 71
చార్మినార్ 74
జూపార్క్ 175
బాలానగర్ 84
ఉప్పల్ 120
జూబ్లీహిల్స్ 64
జీడిమెట్ల 101
టపాసుల మోతతో పెరిగిన వాయు కాలుష్యం
Published Wed, Nov 6 2013 2:11 AM | Last Updated on Tue, May 29 2018 1:20 PM
Advertisement
Advertisement