సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిర్వహించిన పాలిసెట్-2016 పరీక్షకు 97.35 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) చైర్మన్ డాక్టర్ ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 1,27,972 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,24,584 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 220 కాలేజీల్లో 28 బ్రాంచీల్లో 53,870 సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఫలితాలను 2 వారాల్లో ప్రకటిస్తామని, ప్రవేశాలను మే మూడో వారంలో చేపడతామని తెలిపారు. తరగతులు జూన్ 9 నుంచి ప్రారంభిస్తామన్నారు.