చదువు‘కొనలేని’ సరస్వతీ పుత్రుడు
నాగోలు: అనాథ విద్యార్థి గృహంలో ఉంటూ.. పుస్తకాలే నేస్తంగా.. చదువే దైవంగా.. ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా.. పట్టుదలతో కష్టపడి చదివిన అతనికి విజయం దాసోహమైంది.. అందరిలోనూ తనను సరస్వతీ పుత్రుడిగా నిలబెట్టింది. కానీ.. నా అనే వారే లేని ఈ అనాథ విద్యార్థికి లక్ష్మీ కటాక్షం కరువై.. చదువు ‘కొనలేని’ పరిస్థితి తలెత్తింది. దీంతో అతని కళ్లు మనసున్న మారాజుల చేయూత కోసం ఎదురుచూస్తున్నాయి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో ఎల్‌బీనగర్‌లోని అనాథ గృహంలో చేరాడు జీవన్. టెన్త్ క్లాస్‌లో మంచి మార్కులు సాధించి.. వనస్థలిపురంలోని నారాయణ కాలేజీలో ఉచితంగా సీటు పొందాడు.
974 మార్కులతో ఇంటర్ ఫలితాల్లోనూ సత్తా చాటి జేఈఈఈ మెయిన్స్ (ఎన్‌ఐటీ)లో బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో సీటు పొందాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఎన్‌ఐటీలో నాలుగేళ్ల కోర్సు, పుస్తకాలకు గాను రూ.4 లక్షల వరకు అవసరమవుతున్నాయి. ఇంత ఖర్చు పెట్టి చదువుకునే పరిస్థితి లేకపోవడంతో దాతల సాయాన్ని అర్థిస్తున్నాడు. ఈ నెల 12వ తేదీ లోపు రూ.20 వేలు చెల్లిస్తేనే జీవన్‌కు సీటు దక్కుతుందని అనాథ విద్యార్థి గృహం నిర్వాహకులు చెబుతున్నారు. అమ్మానాన్న లేని తనకు విద్యాదానం చేసి ఆదుకోవాలని జీవన్ కోరుతున్నాడు. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి తనలాంటి అనాథలు, నిరుపేదలకు సాయం చేయాలన్నదే ఆశయమని చెబుతున్నాడు. వివరాలకు సెల్: 9490792576.