37 ఏళ్ల వయసులో తొలి టైటిల్ నెగ్గిన భారత టెన్నిస్ ప్లేయర్ విజయ్ సుందర్ ప్రశాంత్
జీవన్ నెడుంజెళియన్‌తో కలిసి హాంగ్జౌ ఓపెన్‌లో పురుషుల డబుల్స్ టైటిల్ సొంతం
హాంగ్జౌ (చైనా): భారత టెన్నిస్ ప్లేయర్ విజయ్ సుందర్ ప్రశాంత్ తన కెరీర్‌లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ తన కెరీర్‌లో తొలి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
తమిళనాడుకు చెందిన 37 ఏళ్ల విజయ్ మంగళవారం ముగిసిన హాంగ్జౌ ఓపెన్ టోరీ్నలో భారత్‌కే చెందిన తమిళనాడు ప్లేయర్ జీవన్ నెడుంజెళియన్‌తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్‌ను దక్కించుకున్నాడు. గంటా 49 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో విజయ్–జీవన్ ద్వయం 4–6, 7–6 (7/5), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో కాన్‌స్టన్‌టిన్ ఫ్రాంట్‌జెన్–హెండ్రిక్ జెబెన్స్ (జర్మనీ) జోడీని ఓడించింది.
విజయ్–జీవన్‌లకు 52,880 డాలర్ల (రూ. 44 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో రెండో సీడ్, మూడో సీడ్ జోడీలను విజయ్–జీవన్ ఓడించడం విశేషం. 35 ఏళ్ల జీవన్‌కిది రెండో ఏటీపీ డబుల్స్ టైటిల్. 2017లో రోహన్ బోపన్నతో కలిసి జీవన్ చెన్నై ఓపెన్ టైటిల్‌ను సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment