పోస్టాఫీసుల్లో ‘నోట్ల’ దందా!
కోట్ల రూపాయలు మార్పిడి చేసిన తపాలా అధికారులు
- మూడు నెలల్లో పది కేసులు నమోదు చేసిన సీబీఐ
- ఎస్‌ఎస్‌పీవో నుంచి అటెండర్ల వరకు అందరూ ఒకే గ్యాంగ్
- తాజాగా ఖైరతాబాద్ పోస్టాఫీస్‌పై సీబీఐ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత సాధారణ ప్రజలకు నోట్ల మార్పిడి చేయాల్సిన తపాలా సిబ్బంది కమీషన్ల కోసం చేసిన ఘన కార్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు జరిగిన నోట్ల మార్పిడి వ్యవహా రాల్లో పోస్టల్ విభాగంపైనే సీబీఐ 10 కేసులు నమోదు చేసింది. హిమాయత్‌నగర్ డివిజన్ పోస్టాఫీస్ నుంచి ఖైరతాబాద్ హెడ్‌పోస్టాఫీస్ కేసు వరకు కోట్ల రూపాయలను అధికారులు, సిబ్బంది పక్కదారి పట్టించినట్టు సీబీఐ ఆధారాలతో బయటపెట్టింది.
మిగతా కేసుల్లో...
జనవరి 30న వరంగల్ హెడ్‌పోస్టాఫీస్‌లో రూ.11.01 లక్షల నోట్లను కమీషన్ పద్ధతిన నలుగురు అధికారులు మార్చినట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. పెద్దపల్లి జిల్లాలోని పో స్టాఫీస్‌లో పనిచేస్తున్న ట్రెజరర్, ఆ పరిధిలోకి వచ్చే మేడారం సబ్ పోస్టుమాస్టర్ ఇద్దరూ కలసి రూ.50 లక్షల కొత్తనోట్లను కమీషన్ పద్ధతిలో మార్పిడి చేసినట్టు గుర్తించి అరెస్ట్ చేసింది. గతేడాది నవంబర్ 25న రాష్ట్ర జీపీవో (జనరల్ పోస్టాఫీస్), హిమాయత్‌నగర్ పో స్టాఫీస్‌లో పనిచేస్తున్న సీనియర్ సూపరింటెం డెంట్‌తో పాటు ముగ్గురు అధికారులు, ముగ్గురు సిబ్బందిపై సీబీఐ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టింది. రూ.70 లక్షలకుపైగా కొత్తనోట్లను కమీషన్ కోసం వీరు పక్కదారి పట్టించినట్టు సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చింది.
డిసెంబర్ 2న గోల్కొండ, లంగర్‌హౌస్ పోస్టాఫీసుల్లోనూ స్కాం జరిగిందని సీబీఐ గుర్తించి రూ.22 లక్షలకు పైగా కొత్త నోట్లు మార్పిడి చేసినట్టు బయటపెట్టింది. డిసెంబర్ 6న కార్వాన్ పోస్టాఫీస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.1.2 కోట్ల కొత్త నోట్లు మార్పిడి చేసినట్టు గుర్తించి ఆరుగురిని అరెస్ట్ చేసింది. డిసెంబర్ 9న బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్ పోస్టా ఫీస్‌పై దాడి చేసి సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబు రూ.80 లక్షల కొత్తనోట్లను మార్పిడి చేసినట్టు సీబీఐ గుర్తించింది. ఇప్పటివరకు జరిగిన కేసుల్లో పోస్టల్ ఉద్యోగు ల నుంచి కొత్త నోట్లు మార్పిడి చేసుకున్న 16 మంది వ్యాపారులు, 22 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు వ్యాపారు లను సీబీఐ ప్రశ్నించింది.
ఖైరతాబాద్‌లో రూ.64.97 లక్షలు
ఖైరతాబాద్ డివిజన్ హెడ్ పోస్టాఫీస్‌లో ధ్రువపత్రాలు లేకుండా 8మంది ఉద్యోగు లు రూ.64.97 లక్షల కొత్త నోట్లను కమీషన్ పద్ధతిన మార్పిడి చేసినట్టు సీబీఐకి డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆచారి ఫిర్యాదు చేశారు. మెయిన్ ట్రెజరర్ ఎం.మహేష్ ఆధ్వర్యంలో సేవింగ్ బ్యాంక్ పీఏ ఆర్.జ్యోతి, కౌంటర్ క్లర్క్ సీహెచ్ వేణు, అసిస్టెంట్ ట్రెజరర్ దుర్గాబాయి, ఎక్సే్ఛంజ్ కౌంటర్ పీఏ ఎస్.భాస్కర్, కౌం టర్ క్లర్క్ పి.సంతోషిమాత, కౌంటర్ పీఏ అమ్రైల్ సింగ్, ఎక్సే్ఛంజ్ కౌంటర్ పీఏ టీవీ భాస్కర్ రూ.64.97 లక్షల కొత్త నోట్లను పలువురు వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులకు కమీషన్ పద్ధతిన మార్పిడి చేశారని కేసు నమోదు చేసినట్టు సీబీఐ డీఐజీ చంద్రశేఖర్ తెలిపారు.