‘విద్యుత్’ సమ్మె యథాతథం
- ఈ నెల 14లోగా డిమాండ్లు
- పరిష్కరించకపోతే 15 నుంచి సమ్మె
- తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ స్పష్టీకరణ
- 14న మంత్రి జగదీశ్‌రెడ్డితో
- మరో దఫా చర్చలకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఈ నెల 14వ తేదీలోపు పరిష్కరించకపోతే 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతారని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ పునరుద్ఘాటించింది. సమస్యలను పరిష్కరించని పక్షంలో ట్రాన్స్‌కో, జెన్‌కో, ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంల ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు మూకుమ్మడిగా సమ్మెకు దిగుతారని ఫ్రంట్ చైర్మన్ ఎన్.పద్మారెడ్డి, కన్వీనర్ ఈ. శ్రీధర్ శనివారం తెలిపారు.
అధికార పార్టీ టీఆర్‌ఎస్ అనుబంధ సంఘం టీఆర్‌వీకేఎస్ మినహా రాష్ట్రంలో మిగిలిన 13 విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాల కలయికతో ఏర్పడిన ఈ ఫ్రంట్... కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఆలోగా కాంట్రాక్టు కార్మికులకు వేతనాల చెల్లింపు డిమాండ్లు సహా మొత్తం 34 డిమాండ్ల పరిష్కారం కోరుతూ గత నెల 19న విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో ఉత్తర, దక్షిణ డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, కె.వెంకటనారాయణ శనివారం విద్యుత్‌సౌధలో ఫ్రంట్ నేతలతో చర్చలు జరిపారు. సానుకూల దృక్పథంతో చర్చలు జరిగాయని, తక్షణమే కొన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించామని చర్చల అనంతరం డి.ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.
తక్షణమే పరిష్కరించలేని డిమాండ్లను ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగించాలని ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చాయన్నారు. విధానపర నిర్ణయాలతో ముడిపడిన డిమాండ్లపై ఈ నెల 14న సచివాలయంలో ఉదయం 11 గంటలకు విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో మళ్లీ చర్చలకు రావాలని యాజమాన్యాలు ఆహ్వానించగా ట్రేడ్ యూనియన్ల నేతలు అంగీకరించారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నామని, ఈ నెల 15నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని ప్రభాకర్‌రావు ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు.
13న ఆందోళనలు ...
విద్యుత్ సంస్థల సీఎండీలతో జరిగిన చర్చల్లో కాంట్రాక్టు కార్మికులకు నేరుగా వేతనాల చెల్లింపుతో పాటు అదనపు పోస్టుల మంజూరు, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు బదలాయింపు, తదితర డిpower employess strike will be as usualమాండ్లను పరిష్కరించాల్సిందేనని ట్రేడ్ యూనియన్ల ఫ్రంట్ నేతలు పట్టుబట్టారు. ఈ అంశాలపై ప్రభుత్వ అనుమతి అవసరమని యాజమాన్యాలు స్పష్టం చేశాయని ఫ్రంట్ కన్వీనర్ ఈ. శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న తలపెట్టిన ఆందోళనలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. సర్కిల్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ గేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాల్లో మార్పులేదన్నారు.