మెట్రో.. రెడీ
మెట్రో తొలిదశ ప్రారంభానికి సన్నాహాలు ఉగాదికి ఉషోదయం
మార్చి 21న నాగోల్-మెట్టుగూడలో పరుగులు
ప్రభుత్వ అనుమతులే తరువాయి కనీస చార్జీలపై త్వరలో స్పష్టత
సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో రైలు పరుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. మార్చి 21 (ఉగాదిన)న ఇది పట్టాలెక్కనుంది. ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర రైల్వే శాఖ జారీ చేయనున్న సేఫ్టీ సర్టిఫికెట్, సెంట్రల్ మెట్రో యాక్ట్ ప్రకారం ఇతర అనుమతులను త్వరలో పొందనున్నట్లు వెల్లడించాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తరవాత రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో తొలిదశను ప్రారంభిస్తామని తెలిపాయి. ఇప్పటికే నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో స్టేషన్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. రంగులద్దడం, మెట్లు, ఎస్కలేటర్ల ఏర్పాటు ప్రక్రియ వడివడిగా జరుగుతున్నాయి. సిగ్నలింగ్, ట్రాక్, డ్రైవర్ రహిత టెక్నాలజీ వినియోగం, లైటింగ్, రైళ్ల సామర్థ్యం వంటి సాంకేతిక అంశాల్లో ఉప్పల్ మెట్రోడిపోలోని 8 రైళ్లు విజయవంతంగా ప్రయోగ పరీక్షలు పూర్తి చేసుకున్నాయని పేర్కొన్నాయి. మియాపూర్-ఎస్.ఆర్.నగర్ రూట్లోనూ ఈ నెలాఖరులోగా ఎనిమిది మెట్రో రైళ్లకు ప్రయోగ పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపాయి. పాతనగరంలో మెట్రో అలైన్‌మెంట్ 3.2 కి.మీ. పెరిగిన నేపథ్యంలో ఆ రూట్లో వాణిజ్య పరంగా ఎంతవరకు సాధ్యమో తేల్చేందుకు మరో ఆరునెలల్లోగా అధ్యయనం పూర్తి చేయనున్నట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు పేర్కొన్నాయి.
చార్జీలపై త్వరలో స్పష్టత
మెట్రో రైలు కనీస చార్జీ ఎంత ఉండాలన్న అంశంపై త్వరలో స్పష్టత రానుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే టోకుధరల సూచీ, ద్రవ్యోల్బణం ఆధారంగానే కనీస, గరిష్ట చార్జీలు, పార్కింగ్ చార్జీలను నిర్ణయించనున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమని ఎల్‌అండ్‌టీ వర్గాలు స్పష్టం చేశాయి. 2012లో నిర్ణయించిన చార్జీల కంటే ఒకటి నుంచి రెండు రూపాయల మేర స్వల్పంగా పెరగనున్నట్లు తెలిసింది. కనీస, గరిష్ట చార్జీల్లో పెరుగుదల స్వల్పంగానే ఉంటుందని తెలుస్తోంది. ఒకసారి చార్జీలు నిర్ణయించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ నోటిఫికేషన్ జారీ చేస్తుందని సమాచారం. ఇక తొలిదశ ప్రాజెక్టుకు అవసరమైన పార్కిం గ్ స్థలాల అన్వేషణ ప్రారంభించినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. నాగోల్,ఉప్పల్ క్రాస్‌రోడ్స్ తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
మెర్రీ గో అరౌండ్ బస్సులపై...
ఇక మెట్రో స్టేషన్లలో దిగిన ప్రయాణికులు సమీపంలోని కాలనీలకు చేరుకునేందుకు వీలుగా ప్రవేశపెట్టనున్న మెర్రీ గో అరౌండ్ బస్సులు, మినీ బస్సులు, బ్యాటరీ ఆధారంగా నడిచే బస్సులు, పెద్ద ఏసీ బస్సులను ఎన్నిటిని నడపాలన్న అంశంపై మార్చి నెలలోనే స్పష్టత రానుంది. ఈ విషయంలో ఆర్టీసీతో చర్చించిన తరవాతనే బస్సులను ప్రవేశపెడతామని మెట్రో వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.