సేఫ్టీ సర్టిఫికెట్ రావడమే తరువాయి..
మార్చిలోనే మొదలుపెట్టేందుకు యోచన
సేవలు మొదలైతే గంటకు పైగా ప్రయాణ సమయం ఆదా
సాక్షి, ముంబై: నగర వాసులు వచ్చే నెల నుంచి మెట్రో రైలు సేవలు పొందనున్నారు. సేఫ్టీ సర్టిఫికెట్ పొందడంలో జాప్యం వల్ల ఈ మెట్రో మొదటి కారిడార్‌ను వచ్చే నెలకు వాయిదా వేసినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లయితే దీని ప్రారంభోత్సవానికి తలనొప్పిగా మారనుంది. ‘రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్’ (ఆర్డీఎస్‌ఓ) గత వారంలోనే సేఫ్టీ ట్రైల్ రన్‌ను నిర్వహించింది. 11.4 కి.మీ. మేర వర్సోవ-అంధేరి-ఘాట్కోపర్‌ల (వీఏజీ) కారిడార్‌ను వీలైతే ఇదే నెలలో నగర వాసుల కోసం అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. అయితే సేఫ్టీ సర్టిఫికెట్ ప్రక్రియలో జాప్యం జరగడంతో ఆర్‌ఎస్‌డీఓ ప్రయోగాత్మకంగా నడిపిన రైలుపై నివేదికను సమర్పించలేదు. ఈ నివేదికను సమర్పించిన తర్వాత కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్) చివరగా సేఫ్టీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది.
ఈ సందర్భంగా ఎంఎంఆర్డీఏ కమిషనర్ యూపీఎస్ మదన్ మాట్లాడుతూ.. సేఫ్టీ సర్టిఫికెట్ లభించేందుకు కొంత సమయం పట్టనుందన్నారు. అది లభించడమే ఆలస్యం.. మార్చి వరకు మెట్రో కారిడార్‌ను సిద్ధం చేస్తామన్నారు. ఇదిలావుండగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ) జాగృతి నగర్‌లో స్థలాన్ని సేకరించి వీఏజీ కారిడార్ కోసం మరో కొత్త స్టేషన్ కోసం మెట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే సమయానికి ఈ స్టేషన్ కూడా సిద్ధమవుతుందన్నారు. గతంలో ఫైర్ బ్రిగేడ్ ఇక్కడ స్టేషన్‌ను మెట్లు లేకుండా నిర్మించడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో అధికారులు స్టేషన్ వద్ద హాల్ట్‌ను ఏర్పాటు చేయవద్దని నిర్ణయించుకున్నారు. కాగా, ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.2,356 కోట్ల వ్యయమైనట్లు అధికారులు తెలిపారు.
ఈ మెట్రో వన్ ప్రాజెక్టు తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాలను అనుసంధానం చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐదేళ్ల క్రితం ప్రారంభించారు. 2010 డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలని గడువు విధించినప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఇప్పటివరకు ఏడు మార్లు గడువును పొడిగించారు. ఈ 11.4 కి.మీ వర్సావ-ఘాట్కోపర్‌ల మధ్య ప్రయాణం చేయడంతో రద్దీ సమయంలో ఇతర పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌తో పోల్చితే 60 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది.
మెట్రో భద్రత..: అన్ని మెట్రో స్టేషన్లలో దాదాపు 100 ఎల్సీడీలను అమర్చనున్నారు. ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తదితర సమాచారాన్ని వీడియో క్లిప్పింగ్స్, సమాచారం ద్వారా తెలియజేయనున్నారు. భద్రతా కంట్రోలర్‌తోపాటు అన్ని మెట్రో స్టేషన్లలో సెక్యూరిటీ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ స్టేషన్లు దాదాపు 95 ఎస్కలేటర్లు కలిగి ఉంటాయి. 45 ఎలివేటర్లు, ప్రయాణికుల సౌకర్యార్థం 100 మెట్ల నిర్మాణాలను చేపట్టారు.
మెట్రో కారిడార్ సిద్ధం..
Published Sun, Feb 23 2014 12:30 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
Advertisement
Advertisement