రాష్ట్ర రహదారులు డీనోటిఫై!
కొత్త మద్యం పాలసీపై ప్రతిపాదనలు సిద్ధం
- సుప్రీం తీర్పు ప్రభావాన్ని తప్పించుకొనేలా మార్పులు
- పాత మద్యం పాలసీకే ఏపీ ఎక్సైజ్ పాలసీలోని అంశాల జోడింపు
- లైసెన్స్ ఫీజు మూడు శ్లాబులకు కుదింపు
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దుకాణాలకు ఫీజు పెరిగే అవకాశం
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యథాతథం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. పాత మద్యం పాలసీకే కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేయడంతోపాటు.. ఏపీ ఎక్సైజ్ పాలసీలోని పలు అంశాలను జోడించి నూతన పాలసీని సిద్ధం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు జాతీయ రహదారులకే పరిమితమయ్యేలా చేసేందుకు.. రాష్ట్రస్థాయి రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా (ఎండీఆర్) డీనోటిఫై చేయాలని, పాత పాలసీ ప్రకారమే (100 మీటర్ల దూరంలోపు) దుకాణం లైసెన్స్‌లు కేటాయించాలని కొత్త పాలసీలో ప్రతిపాదించనున్నారు.
ఇక పాత పాలసీలో 6 శ్లాబులుగా ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజును ఈ సారి మూడు శ్లాబులకు కుదించాలని నిర్ణయించారు. ఇందులో తొలి రెండు శ్లాబుల పరిధిలోకి వచ్చే గ్రామీణ, పట్టణ ప్రాంత దుకాణాలకు లైసెన్స్ ఫీజు పెంచాలని... చివరి శ్లాబ్ పరిధిలోకి వచ్చే గ్రేటర్ హైదరాబాద్‌లోని దుకాణాలకు రూ.1.4 కోట్లు ఉన్న ఫీజును యథాతథంగా కొనసాగించాలని ప్రతిపాదించారు. ఇక ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, లాటరీ పద్ధతిలో లైసెన్స్ కేటాయింపు, రెండు సంవత్సరాల లీజు కాలం వంటి నిబంధనలను కూడా ఉన్నది ఉన్నట్లుగా కొనసాగించనున్నారు.
సుప్రీం తీర్పుతో జాప్యం
రాష్ట్రంలో పాత ఎక్సైజ్ పాలసీ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. అక్టోబర్ ఒకటి నుంచి కొత్త పాలసీ అమల్లోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త పాలసీకి ఇప్పటికే తుది రూపు రావాల్సింది. కానీ జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణాలు ఉండవద్దన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు ఉండగా.. ఇందులో 1,184 మద్యం దుకాణాలు సుప్రీంకోర్టు నిబంధన పరిధిలోకి వస్తున్నాయి. అధిక లైసెన్సు ఫీజు కారణంగా మరో 72 దుకాణాల లైసెన్స్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అంటే మిగిలేవి 960 దుకాణాలు మాత్రమే.
అదే జరిగితే ఎక్సైజ్ రాబడి అమాంతం పడిపోతుంది. దీంతో సుప్రీంతీర్పుకు అనుగుణంగా పాలసీ రూపొందించాలా? లేక డీనోటిఫై సిఫారసును ప్రతిపాదించాలా? అన్నదానిపై ఎక్సైజ్ అధికారులు కొంతకాలం తర్జనభర్జన పడ్డారు. అయితే ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చింది. ఆ పాలసీలో అక్కడి రాష్ట్ర రహదారులను ఎండీఆర్ (మెయిన్ డిస్టిక్ రోడ్స్)గా పునః సమీక్షించారు. దీంతో తెలంగాణలోనూ రాష్ట్ర రహదారులను డీనోటిఫై చేసుకొని.. పాత పాలసీ ప్రకారం ప్రధాన రోడ్డుకు 100 మీటర్ల దూరంలోపు దుకాణం నిర్వహించరాదన్న నిబంధనను అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో సుప్రీం నిబంధనల పరిధి నుంచి 562 మద్యం దుకాణాలు బయటపడతాయి.
ఇక జాతీయ రహదారుల పక్కన ఉన్న దుకాణాలను కూడా జిల్లా ప్రధాన రోడ్డు వైపునకు మార్చుకోవచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు ఇంకా సమీక్ష దశలోనే ఉన్నాయి. వీటిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ పరిశీలిస్తున్నారు. అవసరమైన మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తున్నారు.