గణనీయ ఆర్థికాభివృద్ధి దిశగా దేశం
► గత మూడేళ్లలో దేశం జీడీపీలో బ్రిటన్‌ను మించిపోయింది
► సుస్థిర విధానాలతోనే 2008లో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించింది
► ఫ్యాప్సీ శతాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
సాక్షి, హైదరాబాద్: మన దేశం గణనీయ ఆర్థికాభివృద్ధి దిశగా పురోగమిస్తోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ‘2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తరువాత ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ కుంటినడకనే సాగుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ మాత్రం వేగంగా పురోగమిస్తోంద’అని అన్నారు. ప్రజలందరూ కలసి కష్టపడితే భిన్న దేశాల మధ్య మనకు సగౌరవ స్థానం లభించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో, ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పన, ఆహారం వంటి కనీస అవసరాల విషయంలో సమస్యలను అధిగమించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
దేశ జనాభాలో 50 శాతమున్న 25 ఏళ్ల లోపు వయసు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించాల్సిన అవసరముందన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో శుక్రవారం జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సమాఖ్య(ఎఫ్‌టీఏపీసీసీఐ) శతాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించగా, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎఫ్‌టీఏపీసీసీఐ అధ్యక్షుడు రవీంద్ర మోదీ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్రం ఫలితంగా దేశంలో సామాన్యులకు సాంఘిక, ఆర్థిక స్వాతంత్య్రం లభించిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. గడిచిన మూడేళ్లలో దేశ తలసరి వార్షిక ఆదాయం బ్రిటన్ నుంచి మించిపోయిందన్నారు.
బ్రిటన్‌లో మన పెట్టుబడులు సైతం అత్యధిక స్థాయికి చేరుకొన్నాయని, అంతే కాకుండా ఆ దేశంలో ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్నాయన్నారు. కేంద్రం చేపట్టిన డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్– అప్ ఇండియా, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ రంగ ప్రముఖులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. గత పదిహేనేళ్ల కాలంలో మన వృద్ధి రేటు అధికంగా ఉండడం మాత్రమే కాక, 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం చేదు ఫలితాల నుంచి మనను కాపాడిందని స్పష్టం చేశారు. 2008 నాటి అమెరికా ఆర్థిక సంక్షోభం జీ–20 కూటమి ఏర్పాటుకు దారితీస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. ఎఫ్‌టీఏపీసీసీఐ సంస్థ ద్వారా పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య అభివృద్ధికి కృషి చేసిన ఎందరో వ్యక్తుల విజయగాథలు దీని వెనక ఉన్నాయని కొనియాడారు.