బిల్లులు చెల్లించకుంటే 2 నుంచి సేవలు బంద్ | Private hospitals Ultimatum on Arogya sri | Sakshi
Sakshi News home page

బిల్లులు చెల్లించకుంటే 2 నుంచి సేవలు బంద్

Published Sat, Apr 23 2016 3:43 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

Private hospitals Ultimatum on Arogya sri

 ‘ఆరోగ్యశ్రీ’పై ప్రైవేటు ఆస్పత్రుల అల్టిమేటం

 సాక్షి, హైదరాబాద్: మే ఒకటి లోగా ‘ఆరోగ్యశ్రీ’ బిల్లులు చెల్లించాలని, లేదంటే ఆ మరుసటి రోజు నుంచే తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో సంబంధిత సేవలను నిలిపివేస్తామని ‘తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్’ ప్రకటించింది. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం ఆరోగ్యశ్రీ కన్వీనర్ ఎల్.సురేష్‌గౌడ్, చైర్మన్ టి. నర్సింగ్‌రెడ్డి మాట్లాడారు. ‘ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలోని 130 కార్పొరేట్, ప్రైవేటు నర్సింగ్‌హోమ్స్‌లో సుమారు 80 వేల శస్త్రచికిత్సలు జరిగాయి. ఇందుకు ప్రభుత్వం రూ.250 కోట్లు చెల్లించాల్సి ఉంది.

తొమ్మిది మాసాలుగా బిల్లులు రాకపోవడంతో నర్సింగ్‌హోమ్‌లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రులను నిర్వహించలేకపోతున్నాం. బకాయిలు మంజూరు చేయాలని అనేకసార్లు ట్రస్ట్ సీఈఓకు విన్నవించాం. అయినా ప్రయోజనం లేదు’ అని వారు చెప్పారు. ప్రభుత్వం స్పందించి మే 1 లోగా తమ బకాయిలు చెల్లించాలని, లేదంటే 2 నుంచి ఆరోగ్యశ్రీతో పాటు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ సర్వీసులను కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు.  

 నాలుగైదు రోజుల్లో చెల్లిస్తాం: ఆరోగ్యశ్రీ సీఈఓ
 ఆరోగ్యశ్రీ బకాయిలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నాలుగైదు రోజుల్లో రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయనో ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement