
ట్రావెల్స్ ‘పండగ’
పండగ ప్రయాణం గురువారం పోటెత్తింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పలువురు కుటుంబాలతో కలిసి సొంతూళ్లకు పయనమయ్యారు.
- ప్రైవేటు ట్రావెల్స్ దందా
- రెట్టింపు చార్జీలు వసూలు
- ప్రయాసగా సంక్రాంతి ప్రయాణం
- రైళ్లలో ‘నో రూమ్’.. అదే రూట్‌లో ఆర్టీసీ
సాక్షి, సిటీబ్యూరో: పండగ ప్రయాణం గురువారం పోటెత్తింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పలువురు కుటుంబాలతో కలిసి సొంతూళ్లకు పయనమయ్యారు. ఏటా మాదిరిగానే ఈసారీ ప్రయాణం ప్రయాసగా మారుతోంది. ఒకపక్క రవాణా అధికారుల దాడులు.. అయినా తగ్గని ప్రైవేటు ట్రావెల్స్ దూకుడు.. సంక్రాంతి పేరుతో రెట్టింపు వసూళ్లు.. మరోపక్క సరిపడా లేని రైళ్లు, బస్సులు.. ఈ పరిస్థితుల్లో సామాన్యుడి పల్లె‘టూరు’ భోరుమంటోంది. సంక్రాంతికి ఊర్లకు వెళ్లే ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా రైళ్లు, ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
సాధారణ రోజుల్లో తీసుకొనే చార్జీలపై ఒకటి, రెండు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం తమను సంప్రదిస్తున్న ప్రయాణికులను మొదట సీట్లు లేవంటూ హడలెత్తిస్తున్నారు. ఆ తరువాత అదనపు చార్జీలు చెల్లిస్తే ఏర్పాటు చేస్తామంటూ బేరానికి దిగుతున్నారు. గతేడాది సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులతో సొంతూళ్లకు వెళ్లలేకపోయిన వారు ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో భారీగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. రైలు, బస్సు సౌకర్యాలు అందుకు తగినట్టుగా లేవు. దీంతో రెండు నెలలుగా ఆర్టీఏ దాడుల్లో పట్టుబడుతూ, తిరిగి రోడ్డెక్కిస్తూ బస్సులు నడుపుతున్న ప్రైవేట్ ఆపరేటర్లు సంక్రాంతి పండగను సొమ్ము చేసుకొంటున్నారు.
రవాణా అధికారులు ట్రావెల్స్ కార్యాలయాలపై దాడులు చేసినప్పటికీ ఆన్‌లైన్ బుకింగ్‌లు నిలిచిపోలేదు. హైదరాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సులను ఆర్టీఏ ఏ మాత్రం నియంత్రించలేకపోతోంది. కాంట్రాక్ట్ క్యారే జీలుగా తిరగవలసిన బస్సులు స్టేజీక్యారేజీలుగా తిరగడమే పర్మిట్ల ఉల్లంఘనగా పరిగణించి కేసులు నమోదు చేస్తున్నారు.
బస్సులను జఫ్తు చేస్తున్నారు. కానీ ప్రైవేట్ బస్సుల చార్జీలపై మాత్రం ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండట్లేదు. ప్రైవేట్ ఆపరేటర్లు ఈ లొసుగుల్ని ఆసరాగా చేసుకుని పకడ్బందీగా, వ్యూహాత్మకంగా ప్రయాణికుల జేబులు లూఠీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు సాధారణ రోజుల్లో తీసుకొనే ఏసీ/నాన్ ఏసీ బస్సుల చార్జీలకు ప్రస్తుతం తీసుకుంటున్న చార్జీలకు మధ్య ఎంతో తేడా ఉంది. కొన్ని రూట్లలో రెట్టింపు ఉంటే మరికొన్ని రూట్లలో అంతకంటే ఎక్కువే ఉంది. ప్రస్తుతం నలుగురైదుగురు ఉన్న కుటుంబం ఊరెళ్లాలంటే దాదాపు రూ.6 వేల పైనే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.
ఆర్టీసీదీ అదే బాట.. రైళ్లు కిటకిట
ప్రైవేటు బస్సుల దోపిడీ భరించలేక పడుతూలేస్తూ ఆర్టీసీ బస్సు ఎక్కుదామంటూ అక్కడా ప్రయాణికుల డిమాండ్‌ను సొమ్ము చేసుకునే పనిలో అధికారులు పడ్డారు. చార్జీలకు రెక్కలు తొడిగేశారు. రోజువారీ తిరిగే సూపర్ లగ్జరీ బస్సులు ఫుల్ కావడంతో ‘స్పెషల్’ పేరిట డొక్కు బస్సుల్ని రోడ్డెక్కిస్తున్నారు. వీటిలో 20 నుంచి 50 శాతం మేర ఛార్జీలను పెంచేసి పండగ ఆనందంపై నీళ్లు చల్లుతున్నారు. ఆర్టీసీ ఈ ఏడాది 4950 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. వాటిలోనూ ఇప్పటికే 2000 బస్సులకు అడ్వాన్స్ బుకింగ్ పూర్తయింది. ఉన్నంతలో ఉత్తమమని రైళ్ల వైపు చూద్దామంటే.. అటువైపు వెళ్లకుండానే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్లు నిండిపోయి, ప్రత్యేక రైళ్లలో చాంతాడంత వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. జనరల్ బోగీల్లో కాలు మోపేంత చోటు దొరకడమూ గగనమవుతోంది.
పండగ ఆనందమే లేదు
నెల్లూరు వెళ్లేందుకు తత్కాల్ టికెట్ల కోసం ప్రయత్నించినా దొరకలేదు. చేసేది లేక ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించా. నాన్ ఏసీ బస్సులో టికెట్‌కు రూ. 900 తీసుకున్నారు. అసలు రేటు రూ. 500. ఇక పండగ ఆనందమేది?.
- రజాక్, ఎస్‌ఆర్‌నగర్
ప్రయాణం రద్దు
సంక్రాంతికి సొంత ఊరు ఏలూరు వెళ్దామంటే రైళ్లు, బస్సులు ఖాళీలేవు. ఉన్నా.. నలుగురి కోసం రూ.5 వేల పైచిలుకు వెచ్చించాల్సిందే. అంత స్థోమత లేక పండక్కి ఊరెళ్లడం మానుకున్నాం.
- క్రాంతి, ఎస్‌ఆర్‌నగర్