హేరాం.. ఎంతటి దైన్యం
పేదల వైద్యానికి పెద్దపీట వేసామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి తెలంగాణ వైద్యప్రదాయిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు మాత్రం తెలియడం లేదు. ఇక్కడకు వైద్యం కోసం వచ్చేవారంతా నిరుపేదలే. కానీ సిబ్బంది మాత్రం ప్రతి పనికీ ‘ఖరీదు’ కడుతున్నారు. బేగంపేటకు చెందిన చెందిన రాజు (40) ప్రైవేటు ఎలక్ట్రీషియన్. కొద్దిరోజుల క్రితం విద్యుతాఘాతానికి గురై రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకున్నాడు.
గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగంలో చికిత్స చేయించుకున్న తర్వాత ప్రతివారం పాస్టిక్‌సర్జరీ ఓపీ సేవలు పొందాలని వైద్యులు సూచించారు. ఈ విభాగం మొదటి అంతస్తులో ఉంది. ఆస్పత్రిలో లిఫ్ట్ పనిచేయడం లేదు. గతంలో వచ్చినప్పుడు వీల్‌చైర్ కోసం సిబ్బందిని అడిగినా చేయి తడపందే ఇవ్వనన్నారు. దీంతో అతడు గురువారం ఉదయం ఆస్పత్రికి వచ్చేటప్పుడు ఇంట్లోని పిల్లల సైకిల్‌ను తెచ్చుకున్నాడు. భ్యార తోడుతో దానిపై వెళుతున్న పరిస్థితిని తోటి రోగులు చూసి అవాక్కయ్యారు. – గాంధీ ఆస్పత్రి