
చలి... సమస్యల కౌగిలి!
ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు మృగ్యం
దృష్టి పెట్టని యంత్రాంగం
కప్పుకోవడానికి దుప్పట్లూ కరువే
మంచాలపై సర్దుకుంటున్న రోగులు
నైట్‌షెల్టర్లలోనూ ఇదే దుస్థితి
ఓ వైపు ఎముకలు కొరికేస్తున్న చలి... మరోవైపు మూకుమ్మడిగా దోమల దాడి... కప్పుకోవడానికి దుప్పట్ల కరువు. పోనీ పరుపులైనా బాగుంటాయనుకుంటే... భరించలేని దుర్వాసన... రాత్రివేళల్లో కంటిపై నిద్ర కరువు... ఇవీ మహానగరంలోని పేరు గొప్ప ఆస్పత్రుల్లో రోగుల కష్టాలు. పెద్ద మొత్తంలో నిధులు మూలుగుతున్నా రోగులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న దిశగా యంత్రాంగం ఆలోచించడం లేదు. ఇక రోగులకు సహాయంగా వచ్చేవారి పరిస్థితి చెప్పక్కరలేదు. బాధితులకు నయమయ్యే లోపు సహాయకులు మంచాన పడే దుస్థితి తలెత్తుతోంది.
సిటీబ్యూరో గ్రేటర్‌పై చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులకు తోడు మంచు ప్రభావంతో నగర ప్రజలు గజగజ వణుకుతున్నారు. ముఖ్యంగా వివిధ అనారోగ్య కారణాలతో ఆస్పత్రుల్లో చేరిన వారి అవస్థలు వర్ణనాతీతం. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో చలిగాలులు... కనీసం కప్పుకునేందుకు దుప్పట్లు కూడా లేకపోవ డంతో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, సుల్తాన్‌బజార్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, కింగ్‌కోఠి, పేట్లబురుజు, నిమ్స్, ఫీవర్, ఈఎన్‌టీ, ఛాతి, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, మాన సిక చికిత్సాలయాల్లో చికిత్స పొందుతున్న వృద్ధులు, శిశువులు, బాలింతలు, గర్భిణులు, ఇతర రోగులు విలవిల్లాడుతున్నారు. అసలే అనారోగ్యం.. ఆపై దుప్పట్లు లేకపోవడంతో వారు నరకం చూస్తున్నారు. పడుకునేందుకు ఎక్కడా సరైన పడకలు లేవు. ఒకటీ, అరా ఉన్నా చిరిగి.. మాసిపోయి...ఇబ్బందికరంగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఒకే మంచాన్ని ఇద్దరు ముగ్గురు పంచుకోక తప్పని పరిస్థితి. ఓ వైపు ఎముకలు కొరికే చలి.. మరో వైపు వార్డుల్లో డెంగీ, మలేరియా దోమల స్వైర విహారంతో తట్టుకోలేక పోతున్నారు. ఆస్పత్రుల ఆవరణలో ఏర్పాటు చేసిన నైట్‌షెల్టర్స్‌లో కనీస సదుపాయాలు లేకపోవడంతో రోగులసహాయకులు జాగారం చేయాల్సి వస్తోంది.
బీరువాల్లోనే...
ప్రతిష్ఠాత్మక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఏ మంచంపై చూసినా పూర్తిగా మాసిపోయి, చిరిగిపోయిన పరుపులే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి వీటిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. గత్యంతరం లేక వీటిని కప్పుకున్న రోగులకు ఇన్‌ఫెక్షన్ సోకుతోంది. గాంధీలో రోగులకు సరిపడే స్థాయిలో దుప్పట్లు ఉన్నప్పటికీ..వాటిని రోగులకు ఇవ్వకుండా బీరువాల్లోనే భద్రపరుస్తున్నారు. దీంతో అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారు సొంతంగా వీటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. పొరపాటున ఎవరైనా దుప్పటి తెచ్చుకోకపోతే రాత్రంగా చలికి వణకాల్సిందే. ఇక నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలో పడుకునేందుకు మంచాలే కాదు, రాత్రి చలేస్తే కప్పుకునేందుకు దుప్పట్లు కూడా లేకపోవడంతో శిశువులు గజగజ వ ణికుతున్నారు. సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, కింగ్‌కోఠి, మలక్‌పేట్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో బాలింతలు, గర్భిణుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. వీరిని పట్టించుకునే నాథుడే లేరు.