ఆస్తి పన్ను రూ. 101 లోపే!
రూ. 1,200 లోపు పన్నుకు బదులు రూ. 101 లోపు నామమాత్రపు విధింపు
సూత్రప్రాయంగా నిర్ణయించిన కేసీఆర్.. 5 లక్షల మందికి లబ్ధి
నెల రోజుల్లో గ్రేటర్ రహదారుల మరమ్మతుకు ఆదేశాలు
అక్రమ నిర్మాణాల అదుపు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచన
జీహెచ్‌ఎంసీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలో ప్రస్తుతం రూ.1,200, అంతకంటే తక్కువ మొత్తంలో ఆస్తి పన్ను చెల్లిస్తున్న వారిపై రూ.101కు మించకుండా నామమాత్రపు పన్నులు విధించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా నిర్ణయిం చారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రూ.1,200, ఆ లోపు పన్నులు చెల్లిస్తున్న 5 లక్షలకు పైగా గృహాల యజమానులు లబ్ధిపొందనున్నారు. దీనిపై తుది నిర్ణయం కోసం సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలని సీఎం కేసీఆర్ జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రహదారుల మరమ్మతులు, ఆస్తి పన్నుల రాయితీ తదితర అంశాలపై గురువారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం అధికారిక నివాసంలో జరిగిన ఈ సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం ముఖ్యకార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.
వర్షాలతో నగరంలో చాలా ప్రాంతాల్లో రహదారులు ధ్వంసమయ్యాయని, యుద్ధప్రాతిపదికన రహదారుల మరమ్మతులు జరపాలని, పది రోజుల్లో పనులు ప్రారంభించి నెల రోజుల్లో పూర్తి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తక్కువ సమయంలో పనులు ప్రారంభించేందుకు వీలుగా తక్షణమే దెబ్బతిన్న రహదారులను గుర్తించి జాబితాను రూపొందించాలని సూచించారు. మెట్రో రైలు నిర్మాణ ప్రాంతాల్లో ధ్వంసమైన రహదారులకు సైతం మరమ్మతులు చేయాలని, మెట్రో పనులకు ఆటంకం కలగకుండా అవసరమైన ఏర్పాట్ల కోసం సంబంధిత అధికారులతో చర్చలు జరపాలని ఆదేశించారు. నగరం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారులకు సైతం ఏకకాలంలో మరమ్మతులు జరపాలని జాతీయ రహదారుల సంస్థ చీఫ్ ఇంజనీర్‌కు సీఎం కేసీఆర్ సూచించారు. ఆర్‌అండ్‌బీ నుంచి జీహెచ్‌ఎంసీకి బదలాయించిన రహదారులకు సైతం ఇదే తరహాలో మరమ్మతులు జరపాలని, జీహెచ్‌ఎంసీలోని అన్ని జోన్ల పరిధిలో ఏకకాలంలో రహదారుల మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు.
మరమ్మతుల సమయంలో బలోపేతం, నవీకరణ చేపట్టిన రహదారుల సంఖ్యను సేకరించాలని, అక్కడక్కడ ఉండే చిన్నచిన్న అతుకు(ప్యాచ్)లపై సైతం దృష్టిసారించాలన్నారు. ఎక్కువ కాలం పాటు రహదారులు మన్నికగా ఉండేందుకు మరమ్మతుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలన్నారు. నగరంలో కాంక్రీట్‌తో నిర్మించదగ్గ రహదారుల విస్తీర్ణంపైనా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు. రహదారుల ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా నగరంలో రూ.500 కోట్ల అంచనా వ్యయంతో వెయ్యి లేన్ కిలోమీటర్ల రహదారులను తారుతో, 400 లేన్ కిలోమీటర్ల రహదారులను కాంక్రీట్‌తో నవీకరించాలని నిర్ణయం తీసుకున్నారు.
అక్రమ నిర్మాణాలపై ఫ్లయింగ్ స్క్వాడ్..
గతంలో బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ పథకాలను అమలు చేసినా నగరంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండటంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల అదుపు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. ఇందు కోసం జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్వీయ నియంత్రణలో ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసుకోవాలని, కట్టుదిట్టమైన ప్రణాళికతో దీనిని నడపాలని సూచించారు.