బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచారం..
హైదరాబాద్: బ్యూటీ పార్లర్ ముసుగులో నడుస్తున్న వ్యభిచార గృహం గుట్టును తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి వెల్లడించిన వివరాలివీ.. హయత్‌నగర్‌కు చెందిన ఎ.వీరాస్వామి నాయుడు ముసారాంబాగ్ ప్రాంతంలో వీఎస్ యునెక్స్ బ్యూటీ పార్లర్ అండ్ స్పా నిర్వహిస్తున్నాడు. ఏపీలోని ఏలూరుతో పాటు నల్లగొండ ప్రాంతానికి చెందిన కె.శ్రీకాంత్, డి.దామోదర్‌లతో కలిసి బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్, కోల్‌కతా, బెంగళూరు నుంచి యువతుల్ని తీసుకువచ్చి ఈ రొంపిలో దింపుతూ ధనార్జన చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు సోమవారం దాడి చేశారు. వీరాస్వామి, శ్రీకాంత్, దామోదర్‌లతో పాటు విటులుగా వచ్చిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను అరెస్టు చేశారు. నలుగురు యువతులకు విముక్తి కల్పించారు. వీరి నుంచి రూ.26 వేల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును స్థానిక పోలీసులకు అప్పగించారు.