
సికింద్రాబాద్‌లో సైకో హల్‌చల్
కంటోన్మెంట్: తాగిన మైకంలో ఓ సైకో హల్‌చల్ సృష్టించాడు. గురువారం మధ్యాహ్నం సికింద్రాబాద్ వైఎంసీఏ చౌరస్తాలోని యూకో బ్యాంకు బయట ఓ వ్యక్తిని కొరికి గాయపరిచిన సైకో అనంతరం బ్యాంకులోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు తలతో బాదుతూ భయబ్రాంతులకు గురిచేశాడు. ఈ క్రమంలో ప్రధాన ద్వారాన్ని గుద్దుకోవడంతో గాయాలయ్యాయి. రక్తం కారుతున్నా లెక్క చేయకుండా బ్యాంకు కస్టమర్లు, సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. స్థానికులు అతన్ని అదుపులోకి తీసుకుని తాళ్లతో బంధించి 108కి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న 108 సిబ్బంది తాగిన మైకంలో ఉన్న అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సైకో దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. సైకోను సురేశ్‌గా గుర్తించారు.
తలతో గుద్దుతూ గాయపరిచాడు
తాగిన మైకంలో ఉన్న సైకో తొలుత యూకో బ్యాంకు ఎదురుగా ఓ వ్యక్తిని రూ.10 ఇవ్వాల్సిందిగా కోరాడు. అతడు డబ్బులు ఇవ్వకపోవడంతో తలతో గట్టిగా బాది బ్యాంకులోకి చొరబడ్డాడు. బ్యాంకులోనూ ఓ పక్క కస్టమర్లు, సిబ్బందిని డబ్బులు ఇవ్వాల్సిందిగా అడుగుతూనే మరోపక్క తలతో బాదుతూ గాయపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ క్రమంలోనే గ్లాసు డోర్‌ను బలంగా ఢీకొట్టడంతో అది పగిలిపోగా, సైకోకు గాయాలై రక్తం కారినట్లు తెలిపారు.
90 నిమిషాలు హంగామా
12.10- 12.25: గురువారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో యూకో బ్యాంకు సమీపంలోకి వచ్చిన సురేశ్ (సైకో) బ్యాంకు కాంప్లెక్స్‌లోని మరో కార్యాలయ వాచ్‌మెన్ గోపిని డబ్బులు ఇవ్వాల్సిందిగా (రూ.10) డిమాండ్ చేశాడు. సురేశ్‌ను చూసిన గోపి తప్పుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా గోపి కుడి చేతిని సురేశ్ బలంగా కొరికి గాయపరిచాడు.
12.25-12.45 : యూకో బ్యాంకులోకి చొరబడ్డాడు. అక్కడ ఇద్దరు ఖాతాదారులను డబ్బులు అడిగాడు. నిరాకరించడంతో కొరికి గాయపరిచాడు. దీంతో ఖాతాదారులు, సిబ్బంది భయంతో బయటకి పరుగులు తీశారు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డుపై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో బ్యాంకు గ్లాస్ డోరును బలంగా గుద్దుకున్నాడు. గ్లాసు పగిలిపోవడంతో సురేశ్‌కు వెన్ను, తలపై తీవ్ర గాయమైంది.
12.45-1.10: రక్తం మడుగులో పడిపోయినా అరుస్తూ దగ్గరికి వచ్చిన వారిపై దాడికి యత్నించాడు. స్థానికులు, బ్యాంకు సిబ్బంది అతడిని తాడుతో కట్టేశారు. 108కి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు.
1.10-1.40: మత్తు దిగేందుకు 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. దాదాపు అరగంట బ్యాంకు ఆవరణలోనే ఉంచి పోలీసుల సహాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.