ఇంటికి చేరిన పూర్ణిమ సాయి
ఇంటికి చేరిన పూర్ణిమ సాయి
Published Sat, Jul 22 2017 3:21 AM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM
ఎట్టకేలకు పూర్ణిమ కథ సుఖాంతం
- కౌన్సెలింగ్‌తో ఆమెలో మార్పు
హైదరాబాద్: పూర్ణిమసాయి కథ సుఖాంతమైంది. సినిమాల ప్రభావంతో బాలీవుడ్‌లో ప్రవేశించాలని ఇంటి నుంచి వెళ్లిన పూర్ణిమసాయి శుక్రవారం తల్లిదండ్రుల చెంతకు చేరింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు పూర్ణిమకు కౌన్సెలింగ్ నిర్వహించి నచ్చచెప్పారు. దీంతో ఆమె తన తల్లిదండ్రులు నాగరాజు, విజయలతో కలసి ఇంటికి వెళ్లేందుకు అంగీకరించింది. కూతురు తమతో పాటు వచ్చేందుకు అంగీకరించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ముంబై నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న తరువాత పూర్ణిమను కాచిగూడలోని బాలికాసదన్‌లో ఉంచారు. మూడురోజుల పాటు సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు అప్పగించారు. వారు సంతోషంగా తమ కూతురును ఇంటికి తీసుకెళ్లారు.
అసలేం జరిగిందంటే..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేటకు చెందిన పూర్ణిమసాయి జూన్ 7న ప్రైవేటు క్లాస్‌కని ఇంటి నుంచి వెళ్లింది. సికింద్రాబాద్‌లో రైలెక్కి 8న షిర్డీలో దిగింది. అక్కడ పదిహేను రోజులపాటు బాబా ఆశ్రమంలో గడిపి ముంబై వెళ్లింది. పోలీసులు పూర్ణిమను సాయిసుధార్ అనే ఆశ్రమంలో చేర్పించారు. పూర్ణిమ మిస్సింగ్ ఫొటోలను బోయవాడ పోలీసులు గుర్తించి తుకారాం గేట్ సీఐకి సమాచారం ఇచ్చారు. ఆయన బాచుపల్లి పోలీసులకు వివరాలను అందజేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు అక్కడి పోలీసులతో మాట్లాడి పూర్ణిమసాయి ఆశ్రమంలోనే ఉన్నట్లు నిర్ధారించారు. అయితే సాయిబాబా కలలోకి వచ్చాడని తాను ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు ముప్పు అని, అందుకే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని పోలీసులకు తెలిపింది.
కంటికి రెప్పలా చూసుకుంటాము...
తమ కుమార్తెను కంటికి రెప్పలా చూసుకుంటామని పూర్ణిమ తల్లిదండ్రులు నాగరాజు, విజయలు తెలిపారు. సీడబ్ల్యూసీ సభ్యులు తమ కుమార్తెలో మార్పు తీసుకువచ్చి అప్పగించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. బాలికాసదన్‌లోని తోటి బాలికలకు టాటా చెబుతూ తండ్రి నడుపుతున్న కారు ఎక్కింది.
తీవ్ర ఉత్కంఠ...
బాలికాసదన్ వద్ద శుక్రవారం ఉత్కంఠ నెలకొంది. ఉదయం 10:30కే తల్లిదండ్రులు బాలి కాసదన్ వద్దకు వచ్చారు. కూతురిలో మార్పు వస్తుందో రాదోనని ఆందోళనగా గడిపారు. కౌన్సె లింగ్ అనంతరం పూర్ణిమసాయి తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లేందుకు అంగీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్ణిమను ఆమె తల్లిదండ్రులకు అప్పగిస్తున్నట్లు సీడబ్ల్యూసీ సభ్యులు వెంకటేశ్వర్లు, నామ నాగేశ్వర్‌రావు, బాల్‌రాజులు మీడియాకు వెల్లడించారు. మూడు రోజులపాటు తాము నిర్వహించిన కౌన్సెలింగ్‌తో పూర్తి మార్పు వచ్చిందని చెప్పారు.
Advertisement
Advertisement