పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
హైదరాబాద్ : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూకు బహుమతుల వర్షం కురుస్తోంది. తాజాగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.3 కోట్ల నగదు, ఏపీ రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలంతో పాటు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే కోచ్ గోపిచంద్కు రూ.50 లక్షల బహుమతిని ఏపీ సర్కార్ ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల్లోపు సింధూతో పాటు గోపీచంద్ ను ప్రభుత్వం సన్మానించనుంది. అలాగే సాక్షి మాలిక్ కు రూ.50 లక్షల బహుమతి ప్రకటించింది.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే సింధూకు రెండు కోట్ల రూపాయిల నజరానాను ఇస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మరోవైపు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా సింధూకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనుంది. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును సింధుకు ప్రకటన చేసింది.
మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్లో సింధు 21-19, 12-21, 15-21తో టాప్ సీడ్ మారిన్ చేతిలో ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడింది. దీంతో ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలి గేమ్ను గెలిచిన సింధు.. ఆపై వరుస రెండు గేమ్లలో ఒత్తిడికి లోనై ఓటమి చెందింది.