'సూట్కేసులు మోసేవారికే టికెట్లు'
హైదరాబాద్ : కాంగ్రెస్ అధిష్టానం తీరుపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ఆర్ ప్రతాప్ తన అసంతృప్తిని వెళ్లకక్కారు. సూట్కేసులు మోసేవారికే ఎన్నికల్లో టికెట్లు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం గాంధీభవన్కు వచ్చిన ఆర్ ప్రతాప్ విలేకర్లతో మాట్లాడుతూ... వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై అధిష్టానం వ్యవహరించిన తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే వరంగల్ జిల్లా సీనియర్ నేతలు, కార్యకర్తలతో భేటీ అయి వారి అభిప్రాయాలను సేకరించారు.
ఆ క్రమంలో మాజీ ఎంపీలు వివేక్, రాజయ్య, సర్వే సత్యనారాయణ, జిల్లా నాయకుడు ఆర్ ప్రతాప్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వివేక్ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ అధిష్టానానికి తెలిపారు. ఈ నేపథ్యంలో సర్వే, రాజయ్య పేర్లు వినబడుతున్నాయి. దీంతో ఆర్ ప్రతాప్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దాంతో ప్రతాప్ పై విధంగా స్పందించారు. అయితే ప్రతాప్ ఆరోపణల్లో వాస్తవం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన పేరు కూడా కాంగ్రెస్ అధిష్టానంకు పంపామని గుర్తు చేశారు.
గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి....అనంతరం లోక్సభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా వరంగల్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఆ క్రమంలో అధికార టీఆర్ఎస్ శుక్రవారం అభ్యర్థిని ప్రకటించింది. అలాగే టీడీపీ,బీజేపీ పోత్తు నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిని నిలబెడుతున్న సంగతి తెలిసిందే.