సీసీ కెమెరాల నిఘాలో రైల్వే స్టేషన్లు
అన్ని ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు.. ఒక్క సికింద్రాబాద్‌లోనే వంద కెమెరాలు
సాక్షి, హైదరాబాద్: రైల్వే స్టేషన్లను పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలోకి తేవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే శాఖను ఆదేశించటంతో యుద్ధప్రాతిపదికన అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 980 స్టేషన్లను ఎంపిక చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలుత 50 స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రధాన స్టేషన్లలో మాత్రమే సీసీ కెమెరాలున్నాయి. మిగతా చోట్ల లేవు. దీంతో నేరాలు జరిగినప్పుడు దర్యాప్తునకు విఘాతం కలుగుతోంది. రైల్వే స్టేషన్లలో మహిళలపై వేధింపులు కూడా తీవ్రమయ్యాయి.
ఇటీవల తమిళనాడులో రైల్వే ఫ్లాట్‌ఫాంపైనే ఓ యువతి హత్యకు గురైంది. ఉగ్రవాదులు కూడా రైళ్లలో ప్రయాణించడం సురక్షితంగా భావిస్తున్నారు. దోపిడీ దొంగల ఆగడాలకు లెక్కేలేదు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లు ఆగంతకులకు అడ్డాలుగా ఉండరాదన్న ఉద్దేశంతో వాటిని సీసీ కెమెరాల నిఘాలోకి తెచ్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశించింది. వీటి ఏర్పాటుకు ‘నిర్భయ నిధి’ నుంచి డబ్బులు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో రూ. 500 కోట్లతో వీటిని ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 50 ప్రధాన పట్టణాల్లోని రైల్వే స్టేషన్లలో తొలి విడతలో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ప్లాట్‌ఫామ్‌లు, వేచి ఉండే ప్రాంతాలు, పార్కింగ్, లోనికి వచ్చే అన్ని మార్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.
సికింద్రాబాద్ స్టేషన్‌లో కొత్తగా వంద కెమెరాలు
దేశంలోనే పరిశుభ్రమైన రెండో స్టేషన్‌గా తాజాగా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ స్టేషన్ పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలోకి వెళ్లనుంది. ప్రస్తుతం స్టేషన్‌లోని వివిధ ప్రాంతాల్లో 86 సీసీ కెమెరాలున్నాయి. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ స్టేషన్ మరింత భద్రంగా ఉండాలంటే వీటి సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల రైల్వే బోర్డుకు ప్రతిపాదన కూడా పంపారు. దీంతో ఈ ఒక్క స్టేషన్ పరిసరాల్లోనే కొత్తగా వంద కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో కూడా వాటిని ఏర్పాటు చేస్తారు. లోనికి వచ్చే మార్గాలు సహా అన్ని విభాగాల్లో వాటిని ఏర్పాటు చేస్తారు.
ఆ కెమెరాలు రికార్డు చేసే దృశ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తారు. అందులో టీవీలపై దృశ్యాలను నిరంతరం రైల్వే పోలీసులు పరిశీలిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా అనుమానితులపై దృష్టి సారిస్తారు. సికింద్రాబాద్‌కు పరిశుభ్ర స్టేషన్‌గా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులోనూ స్వచ్ఛంగా ఉంచేందుకు సీసీ కెమెరాలను వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. పరిశుభ్రతను పర్యవేక్షించాల్సిన సిబ్బంది పనితీరును ఈ కెమెరాల ద్వారా పరిశీలిస్తారు. ఎంఎంటీఎస్ స్టేషన్లను కూడా వీటి పరిధిలోకి తెస్తారు.