
చెరువు కాదిది.. పంజాగుట్ట ఫ్లై ఓవర్!
హైదరాబాద్: అవును మీరు విన్నది నిజమే. పంజాగుట్ట ఫ్లై ఓవర్ నీటితో నిండింది. దాని పైనుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి..! గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వందలాది అపార్టుమెంట్ల సెల్లార్లు నీటితో నిండాయి. అయితే లోతట్టు ప్రాంతాల్లోనే కాకుండా భారీ వర్షాలకు విచిత్రంగా ఎగువ ప్రాంతాల్లో కూడా నీటి కష్టాలు తప్పడం లేదు. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై కొద్దిసేపు నీరు భారీగా ప్రవహించింది. దీంతో ఆ రూట్ లో ప్రయాణించినవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తీసిన ఫొటో చూస్తే.. పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై ఏమేర నీరు నిలిచిందో అర్థమవుతుంది. హైదరాబాద్‌లో మరో రెండురోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేయడంతో శుక్ర, శనివారాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
మున్సిపల్ మంత్రి కేటీఆర్‌తో పాటు నగరానికి చెందిన మంత్రులు, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం, పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాలు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాలను సహాయ చర్యల్లో ఉపయోగిస్తున్నారు.
మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం కంటే ఎక్కువ పరిమాణంతో ప్రవహిస్తోంది. సాగర్‌లోకి నిండుగా చేరిన నీరు లుంబినీపార్కులోకి ప్రవేశించడంతో పార్కులోకి సందర్శకుల ప్రవేశాన్ని అధికారులు నిలిపేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, లుంబినీ పార్కులకు శుక్ర, శనివారాల్లో సెలవు ప్రకటించారు.