టీడీపీలో రాజ్యసభ హడావుడి
-మూడు సీట్లలో ఒకటి బీజేపీకి!
-రెండు సీట్ల కోసం రేసులో పలువురు టీడీపీ నేతలు
-సభ్యత్వ పునరుద్ధరణకు సుజనా యత్నాలు
-ఆశావహుల్లో ఆదాల, రామసుబ్బారెడ్డి, బీద, టీజీ, ఏరాసు
- బీజేపీకి సీటిస్తే సీతారామన్‌కే మళ్లీ అవకాశం!
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. సీట్లు ఆశిస్తున్న పలువురు నేతలు పెద్దల సభలో ప్రవేశించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎన్నికలు ఈ ఏడాది జూన్‌లో జరగనున్నాయి. జూన్ 21 నాటికి ఏపీ నుంచి ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్న సుజనా చౌదరి (టీడీపీ), నిర్మలా సీతారామన్ (బీజేపీ)లతో పాటు గతంలో మంత్రులుగా పనిచేసిన జైరాం రమేష్, జేడీ శీలం (కాంగ్రెస్) రిటైర్ కానున్నారు. ఈ నాలుగు స్థానాల భరీక్తి ఏప్రిల్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.
ఈసారి టీడీపీకి దక్కనున్న మూడు సీట్లలో ఒకటి తమకు కేటాయించాలని మిత్రపక్షమైన బీజేపీ కోరుతోంది. దీంతో మిగిలిన రెండు సీట్ల కోసం పలువురు టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. అయితే తన సొంత సామాజికవర్గానికి ఒక సీటు కేటాయించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మరో సీటు కోసం రెడ్డి, ఎస్సీ, బీసీ లేదా ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన నేతల పేర్లను పరిశీలించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రెండో సీటును కూడా సొంత సామాజిక వర్గానికే కేటాయించవచ్చని లేనిపక్షంలో కాపులకు కేటాయించవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.
పలువురు నేతలు తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేశ్‌ను కలసి కోరుతున్నారు. ఎన్‌డీఏలోని భాగస్వామ్యపక్షాలతో సన్నిహిత సంబంధాలు కలిగిన నేతలు వివిధ పక్షాల నుంచి బాబుకు ఫోన్లు చేయిస్తున్నారు. రేసులో పలువురు నేతలు 2010లో పార్టీ నేతల నుంచి కొంత నిరసన వ్యక్తమైనా సుజనాచౌదరికి చంద్రబాబు రాజ్యసభ టిక్కెట్టు ఇచ్చారు. ఈసారి కూడా తనను రాజ్యసభకు పంపాలని సుజనా ఇప్పటికే బాబును కోరారు. అయితే లోకేశ్, సుజనాచౌదరిల మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు బెడిసికొట్టాయని, దీంతో సుజనాకు సీటు ఇవ్వవద్దని తండ్రిపై లోకేశ్ ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.
కోర్టులు సుజనాకు సంబంధించిన సంస్థలపై తీర్పులు వెలువరించటం, ఆయనపై పలువురు ఈడీ, పీఎంఓ, ఆర్థిక శాఖలకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాటిని సాకుగా చూపి రాజ్యసభ సభ్యత్వం ఎగ్గొడతారనే సందేహం సుజనా సన్నిహితుల్లో వ్యక్తం అవుతుంది. సుజనాకు మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని చంద్రబాబుకు ఉండి ఉంటే కేసులను ఇంతవరకు రానిచ్చేవారు కాదనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. అయితే సుజనా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నందున తిరిగి ఆయనకు అవకాశం లభించటం ఖాయమనే వాదన బలంగా ఉంది.
ఇక తనకు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని ప్రస్తుతం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహనరావు కూడా కోరుతున్నారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు, లోకేశ్‌లను కలిసారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావులు రెడ్డి, బీసీ సామాజికవర్గాల కోటాల్లో తమ పేర్లను పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు. కర్నూలు జిల్లా నుంచి గత సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేష్ కూడా తమ సామాజికవర్గాలను దృష్టిలో ఉంచుకుని తమ పేర్లు పరిశీలించాల్సిందిగా కోరుతున్నట్లు తెలిసింది.
కడప జిల్లా నుంచి పి. రామసుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ టీడీపీ నేతలు కొందరు తమకు ఏపీ కోటాలో ఒక సీటు ఇవ్వాల్సిందిగా చంద్రబాబును కలసి కోరారు. ఇక బీజేపీకి ఒక సీటు కేటాయిస్తే అది ప్రస్తుత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటాయిస్తారని సమాచారం. సీతారామన్ రాష్ట్రం నుంచి జరిగిన ఉప ఎన్నికలో రెండు సంవత్సరాల కాల పరిమితికి గెలిచారు.