
గాంధీ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
హైదరాబాద్: ఓ పదేళ్ల బాలుడు ఆడుకుంటూ పొరపాటున విజిల్ ను మింగాడు. దీంతో అతడి నోటి నుంచి వింతవింత శబ్దాలు రావడం మొదలైంది. ఈ శబ్దాలు విన్న తల్లిదండ్రులు బెంబేలెత్తిపోయారు. అతడు విజిల్ మింగిన విషయం తెలియక.. అతన్ని తీసుకొని ప్రైవేటు ఆస్పత్రులన్నింటి చుట్టూ తిరిగారు. అయినా, ఎంతకూ సమస్య పరిష్కారం కాకపోవడంతో గాంధీ ఆస్పత్రిని ఆశ్రయించారు.
గాంధీ ఆస్పత్రి ఈఎన్టీ వైద్యులు బాలుడి ఊపిరితిత్తులలో విజిల్ ను గుర్తించారు. కష్టసాధ్యమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి.. బాలుడి ఊపిరితిత్తుల నుంచి విజిల్ ను బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన గాంధీ వైద్యులపై ప్రశంసల జల్లు కురుస్తోంది.