రావెల సుశీల్.. కుక్క పిల్ల కోసం వెళ్లాడట!
అసలు తాను ఎవరి చేయి పట్టుకోలేదని.. తాను సత్యశీలుడినని చెప్పుకోడానికి ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్ ప్రయత్నించాడు. ఆ రోజు సాయంత్రం తాను క్వార్టర్స్ నుంచి వెళ్తుండగా.. ఉన్నట్టుండి ఓ కుక్కపిల్ల తన కారుకు అడ్డం రావడంతో కారు ఆపానని, తనకు పెంపుడు జంతువులంటే ఇష్టం కాబట్టి దాన్ని చేతుల్లోకి తీసుకున్నానని ఫేస్‌బుక్‌లో ఓ భారీ పోస్ట్ పెట్టాడు. అయితే, ఆ మహిళ అకారణంగా తనపై అరుస్తూ తిట్టిందని, దాంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చారని అన్నాడు. ఏం జరిగిందో చెప్పేలోపే వాళ్లు సహనం కోల్పోయి తనను కొట్టారన్నాడు. ఆ వివాదం మొత్తం శుక్రవారమే పరిష్కారం అయిపోయినా, కావాలనే దాన్ని సాగదీస్తున్నారని మండిపడ్డాడు.
కానీ.. కుక్క పిల్ల కోసం వెళ్లానంటూ రావెల సుశీల్ చేసిన వాదనలో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నాయి వీడియో సాక్ష్యాలు. పకడ్బందీగా రికార్డయిన సీసీటీవీ కెమెరా విజువల్స్‌లో సుశీల్ వాహనం స్పష్టంగా మహిళ వెంటపడిందని తేలింది. బంజారాహిల్స్ రోడ్‌లో బాధితురాలు ఓ రోడ్డుపై నడిచి వెళ్తుండగా.. సుశీల్ తన ఫార్చూనర్ కారుతో ఆమె వెంట పడినట్లు స్పష్టంగా నిర్ధారణ అవుతోంది. టయోటా ఫార్చూనర్ కారులో రావెల సుశీల్.. బాధితురాలి వెంట పడుతున్నట్టు తేలింది. నిదానంగా వాహనాన్ని నడుపుతూ బాధితురాలిని చాలా దూరం నుంచి అనుసరించినట్టు విజువల్స్‌ను బట్టి తెలుస్తోంది. వాహనం పైపైకి వస్తుండడంతో తప్పనిసరై బాధితురాలు రోడ్డుకు దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరా విజువల్స్‌లో కనిపిస్తున్నాయి.
తన తప్పు ఏమీ లేదంటూ ఫేస్‌బుక్‌లో సుశీల్ చేసిన కామెంట్లు అంతా అసత్యమేనని తేలిపోయాయి. రెడ్ హ్యాండెడ్‌గా దొరికి స్థానికుల చేతిలో దెబ్బలు తిన్నా.. కేసుల నుంచి తప్పించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు. మినిస్టర్ కొడుకునంటూ పోలీస్ స్టేషన్‌లో కాసేపు ఖాకీలను బెదిరించిన సుశీల్... ఆ తర్వాత అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు.
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఏపీ రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు రావెల సుశీల్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. అంతటి దుశ్చర్యకు పాల్పడినా మంత్రి కుమారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.