ravela susheel
-
మంత్రి రావెల కుమారుడికి బెయిల్ మంజూరు
హైదరాబాద్: మహిళా టీచర్‌ను వేధించిన కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు సుశీల్, అతని డ్రైవర్ రమేష్‌కు సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 3న బంజారాహిల్స్ రోడ్‌నెం-13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో రోడ్డుపై వెళుతున్న మహిళా టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. తప్ప తాగిన మైకంలో పబ్లిక్‌గా మహిళను చేయిపట్టుకు లాగి కారులో తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటనలో నిర్భయ చట్టం, ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నాంపల్లి కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు విచారించారు. సోమవారం సాయంత్రం నిందితులు విడుదలకానున్నారు. -
రావెల సుశీల్ కి ముగిసిన పోలీసు కస్టడీ
చంచల్‌గూడ : మహిళను వేధించిన కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్, అతని కారు డ్రైవర్ రమేష్‌లను శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను విచారించేందుకు కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించిన విషయం తెలిసిందే. కాగా రెండు రోజుల విచారణ ముగియడంతో పోలీసులు ఇద్దరు నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించారు. -
రావెల సుశీల్ కారు సీజ్
బంజారాహిల్స్ : ఏపీ మంత్రి రావెల కిశోర్ తనయుడు సుశీల్(24) పోలీసు కస్టడీ గురువారం కూడా కొనసాగింది. ఆయనను బంజారాహిల్స్ పోలీసులు రెండో రోజు కూడా విచారించారు. ఈ నెల 3వ తేదీన రావెల సుశీల్ తన కారులో వెళ్తూ నడిచి ఇంటికి వెళ్తున్న ఫాతిమా బేగం అనే మహిళా టీచర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. నిర్భయచట్టం కింద కేసు నమోదై ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ ఘటనలో మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఆయనతోపాటు డ్రైవర్ రమేష్‌ను కస్టడీకి తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ రోజు ప్రయాణిస్తున్న కారు(ఏపీ 07 సీకే 1777)ను సీజ్ చేశారు. ఈ కారు నారాయణస్వామి పేరుపై ఉందని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. అయితే కొద్ది రోజులు వాడుకోవడానికి తన బంధువైన నారాయణ స్వామి నుంచి కారును తీసుకున్నట్లు సుశీల్ దర్యాప్తులో వెల్లడించారు. అయితే ఈ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం పోలీసులు గుర్తించారు. -
రెండో రోజు కొనసాగనున్న రావెల సుశీల్ విచారణ
హైదరాబాద్: మహిళను వేధించిన కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు సుశీల్, అతని డ్రైవర్ రమేష్‌ను బంజారాహిల్స్ పోలీసులు గురువారం కూడా విచారించనున్నారు. నిందితులను రెండో రోజులు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. పోలీసులు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారించారు. నేటితో విచారణ ముగియనుంది. ఇప్పటికే అతను బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 3న బంజారాహిల్స్ రోడ్‌నెం-13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో రోడ్డుపై వెళుతున్న మహిళా టీచర్ ఫాతిమా బేగం పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సుశీల్ తో పాటు అతడి కారు డ్రైవర్ రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్ప తాగిన మైకంలో పబ్లిక్‌గా ప్రైవేటు స్కూల్ టీచర్ ఫాతిమా బేగంను చేయిపట్టుకు లాగి కారులో తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటనలో నిర్భయ చట్టం, ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గురువారం విచారణ అనంతరం అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. ఇది ప్రతిపక్ష కుట్ర: సుశీల్ తనపై కేసు నమోదు చేయడం వెనక ప్రతిపక్ష పార్టీ హస్తముందని రావెల సుశీల్ ఆరోపించారు. కస్టడీలోకి తీసుకున్న అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సుశీల్ మాట్లాడుతూ.. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. ఆ ఘటనలో కేసు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. తాను మంత్రి కుమారుడినైనందునే కేసు పెద్దదైందన్నారు. హోటల్ తాజ్ బంజారాకు వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. -
సుశీల్‌కు బెయిల్ తిరస్కరించిన కోర్టు
హైదరాబాద్: మహిళను వేధించిన కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు సుశీల్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ తిరస్కరించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సుశీల్.. బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతోపాటు అతడిని తమకు అప్పగించాలన్న హైదరాబాద్ పోలీసుల అభ్యర్థనను సమ్మతించింది. ఈ నెల 9,10వ తేదీల్లో సుశీల్‌ను విచారించేందుకు వీలు కల్పించేలా మంగళవారం సాయంత్రం తీర్పు వెలువరించింది. ఈ నెల 3న బంజారాహిల్స్ రోడ్‌నెం-13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో రోడ్డుపై వెళుతున్న మహిళా టీచర్ ఫాతిమా బేగం పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సుశీల్ తో పాటు అతడి కారు డ్రైవర్ రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్ప తాగిన మైకంలో పబ్లిక్‌గా ప్రైవేటు స్కూల్ టీచర్ ఫాతిమా బేగంను చేయిపట్టుకు లాగి కారులో తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటనలో నిర్భయ చట్టం, ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్ గూడ జైలులో ఉన్నారు. -
నా కొడుకును నేనే పోలీసులకు అప్పగించా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు కొడుకు రావెల సుశీల్ తాగినమైకంలో ఓ యువతి చేయి పట్టుకుని కారులోకి లాగేందుకు ప్రయత్నించిన ఘటన అసెంబ్లీలో చర్చకు వచ్చింది. మంగళవారం అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని లేవనెత్తారు. మంత్రి కిశోర్ బాబు మాట్లాడుతూ.. తన కుమారుడు తప్పు చేసివుంటే ఎలాంటి శిక్షకయినా సిద్ధమని అన్నారు. తన కొడుకు సుశీల్‌ను తానే పోలీసులకు అప్పగించానని మంత్రి చెప్పారు. తన కొడుకును విచారించమని, తప్పు చేసివుంటే శిక్షించమని చెప్పానని తెలిపారు. తన కొడుకుపై ఆరోపణలు చేసిన యువతి తనకు కూతురుతో సమానమని చెప్పారు. ఆమె పట్ల ఎవరు తప్పుగా ప్రవర్తించినా శిక్షించాల్సిందేనని అన్నారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో సుశీల్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
రావెల సుశీల్ పోలీస్ కస్టడీ కోరుతూ పిటిషన్
బంజారాహిల్స్: ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్(24)ను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి. మార్చి 3వ తేదీ సాయంత్రం ఏం జరిగింది. ఈ కేసులో మంత్రి కుమారుడు సుశీల్ పాత్ర, డ్రైవర్ రమేష్ దెబ్బలు తినడానికి కారణాలతో పాటు పలు అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టనున్నారు. టీచర్ ఫాతిమా బేగంను తన కారులోకి లాగడానికి యత్నించిన సుశీల్, డ్రైవర్ రమేష్ స్థానికుల చేతిలో దెబ్బలు తిన్నతర్వాత రెండోసారి మళ్లీ ఘటనా స్థలానికి ఎందుకు వచ్చారన్న దానిపై పోలీసులు ఆరాతీయనున్నారు. పది మంది అనుచరులతో ఘటనా స్థలానికి సుశీల్ ఎందుకు వచ్చాడన్న దానిపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన మెడలో గొలుసు పోగొట్టుకున్నానని అందుకే రెండోసారి ఘటనా స్థలానికి వచ్చినట్లు సుశీల్ చెప్పుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సీఎం, మంత్రి ఎందుకు ఆగిపోయారు?
సుదీర్ఘ కాలం తర్వాత హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడాలనుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఆ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. ఈ సమావేశం రద్దు చేసుకోవడంపై పార్టీలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇరకాటంలో నెట్టడం వల్లే ఆయన మీడియా సమావేశం రద్దు చేసుకున్నారని ఒక మంత్రి పేర్కొన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ప్రసంగించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ హైదరాబాద్‌లోని సచివాలయంలో అడుగుపెడుతున్న చంద్రబాబు సాయంత్రం 7 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడతారని సమాచారమిచ్చారు. అంతకుముందు మంత్రి రావెల కిషోర్ బాబు కూడా శనివారం ఉదయం విలేకరుల సమావేశంలో మాట్లాడుతారని మీడియాకు సమాచారం వచ్చింది. తర్వాత ఆయన కూడా దాన్ని రద్దు చేసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం 10లో నంబర్ ప్లేటు లేని ఫార్చూనర్ కారులో ప్రయాణిస్తున్న సుశీల్.. రోడ్డుపై ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మంత్రి కుమారుడిని తప్పిస్తున్నారని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసులు మంత్రి కుమారుడికి నోటీసులు జారీచేశారు. ఆ తర్వాత కేసు నమోదు చేశారు. దీనిపై సుశీల్ ఆ తర్వాత ఫేస్బుక్ ద్వారా స్పందించాడు. తన కారుకు ఒక కుక్క పిల్ల అడ్డుగా రావడంతో దాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నంలో మహిళ గట్టిగా అరిచిందని, అంతే తప్ప ఏమీ జరగలేదంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఈ ఘటనపై అక్కడ సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు ఆ సమయంలో కారుకు అడ్డుగా కుక్కపిల్ల రాలేదన్న విషయం స్పష్టంగా బయటపడింది. సుశీల్ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడంతో పోలీసులు సుశీల్‌పై కేసును కూడా నమోదుచేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందు మంత్రి రావెల కిషోర్ బాబు దీనిపై స్పందించాలని మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. కేసు నమోదు చేశారని తెలియగానే ఆయన ఆ సమావేశాన్ని రద్దు చేసుకున్నారని సన్నిహితులు చెప్పారు. ఈ ఘటనపై ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగు చూస్తుండటంతో మీడియా సమావేశం నిర్వహిస్తే ఇరకాటమైన పరిస్థితులు ఉంటాయని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తాను మాట్లాడాలనుకున్న విలేకరుల సమావేశాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. అయితే కారణం లేకుండా రద్దు చేసుకుంటే విమర్శలొస్తాయని గ్రహించి అసెంబ్లీలో అనుసరించే వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించడానికి సమావేశం ఏర్పాటుచేసి ఆ సమావేశం కారణంగా మీడియా సమావేశం రద్దు చేసుకున్నట్టు పార్టీ నేతలతో చెప్పించారు. రావెల సుశీల్‌పై నెటిజన్ల ఆగ్రహం మీ తండ్రి ఎమ్మెల్యే, మంత్రి కాబట్టి ఏ తప్పు చేసినా చెల్లింతుందనా.. బ్లఫ్ చేయడానికి ప్రయత్నించొద్దు... కుక్క కథ చెప్పినవారిపై నిర్భయ కేసు పెట్టరంట కదా.. ఏపీలోనైతే కుక్క మీద నిర్భయ కేసు పెట్టేవారేమో... ఏపీ సీఎం ఏమంటారో... కుర్రాడు కదా... నా కొడుకు చేసిన పనితో నాకేంటి సంబంధం అని మంత్రి తప్పించుకుంటారా, స్టోరీ ఎవరి దగ్గర రాయించావు... (ఫేస్ బుక్ వివరణపై) ఏమి కథ అల్లావయ్యా రావెల తనయా... తెలుగు దర్శకులకు ఈ కథ చెప్పు అంటూ అనేకమంది వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
రావెల సుశీల్.. కుక్క పిల్ల కోసం వెళ్లాడట!
అసలు తాను ఎవరి చేయి పట్టుకోలేదని.. తాను సత్యశీలుడినని చెప్పుకోడానికి ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్ ప్రయత్నించాడు. ఆ రోజు సాయంత్రం తాను క్వార్టర్స్ నుంచి వెళ్తుండగా.. ఉన్నట్టుండి ఓ కుక్కపిల్ల తన కారుకు అడ్డం రావడంతో కారు ఆపానని, తనకు పెంపుడు జంతువులంటే ఇష్టం కాబట్టి దాన్ని చేతుల్లోకి తీసుకున్నానని ఫేస్బుక్లో ఓ భారీ పోస్ట్ పెట్టాడు. అయితే, ఆ మహిళ అకారణంగా తనపై అరుస్తూ తిట్టిందని, దాంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చారని అన్నాడు. ఏం జరిగిందో చెప్పేలోపే వాళ్లు సహనం కోల్పోయి తనను కొట్టారన్నాడు. ఆ వివాదం మొత్తం శుక్రవారమే పరిష్కారం అయిపోయినా, కావాలనే దాన్ని సాగదీస్తున్నారని మండిపడ్డాడు. కానీ.. కుక్క పిల్ల కోసం వెళ్లానంటూ రావెల సుశీల్ చేసిన వాదనలో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నాయి వీడియో సాక్ష్యాలు. పకడ్బందీగా రికార్డయిన సీసీటీవీ కెమెరా విజువల్స్‌లో సుశీల్ వాహనం స్పష్టంగా మహిళ వెంటపడిందని తేలింది. బంజారాహిల్స్ రోడ్లో బాధితురాలు ఓ రోడ్డుపై నడిచి వెళ్తుండగా.. సుశీల్ తన ఫార్చూనర్ కారుతో ఆమె వెంట పడినట్లు స్పష్టంగా నిర్ధారణ అవుతోంది. టయోటా ఫార్చూనర్ కారులో రావెల సుశీల్.. బాధితురాలి వెంట పడుతున్నట్టు తేలింది. నిదానంగా వాహనాన్ని నడుపుతూ బాధితురాలిని చాలా దూరం నుంచి అనుసరించినట్టు విజువల్స్‌ను బట్టి తెలుస్తోంది. వాహనం పైపైకి వస్తుండడంతో తప్పనిసరై బాధితురాలు రోడ్డుకు దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరా విజువల్స్‌లో కనిపిస్తున్నాయి. తన తప్పు ఏమీ లేదంటూ ఫేస్బుక్లో సుశీల్ చేసిన కామెంట్లు అంతా అసత్యమేనని తేలిపోయాయి. రెడ్ హ్యాండెడ్‌గా దొరికి స్థానికుల చేతిలో దెబ్బలు తిన్నా.. కేసుల నుంచి తప్పించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు. మినిస్టర్ కొడుకునంటూ పోలీస్ స్టేషన్లో కాసేపు ఖాకీలను బెదిరించిన సుశీల్... ఆ తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయాడు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఏపీ రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు రావెల సుశీల్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. అంతటి దుశ్చర్యకు పాల్పడినా మంత్రి కుమారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. -
‘మంత్రి కుమారుడిని అరెస్ట్ చేయాలి’
పత్తిపాడు: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన మంత్రి కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లాలో ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. మంత్రి కొడుకైతే అతనికి ఏమైనా కొమ్ములు ఉంటాయా.. రాజ్యాంగానికి అతీతుడా అని నినాదాలు చేస్తూ.. మైనార్టీ సంఘాల నాయకులు రాస్తారోకో చేస్తున్నారు. ప్రత్తిపాడులోని ఓల్డ్ మద్రాస్‌రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పాఠశాల నుంచి వస్తున్న ఉపాధ్యాయురాలి చేయి పట్టుకొని లాగిన వ్యక్తిపై కేసు పెట్టకుండా అతనికి సాయం చేసిన డ్రైవర్‌పై కేసు పెట్టి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. -
రావెల కుమారుడికి నోటీసులు
హైదరాబాద్ : యువతిని వేధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్ కుమార్‌కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన పోలీసులు మంత్రి రావెల క్వార్టర్స్‌కు వెళ్లి నోటీసులు అందించారు. సాయంత్రం 6 గంటలలోగా సుశీల్ కుమార్ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. కాగా బంజారాహిల్స్ రోడ్‌నెం-13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో నివసించే ఫాతిమాబేగం(20) వింటేజ్ స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా గురువారం స్కూల్ వేళలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో రావెల కుమారుడు సుశీల్, తన డ్రైవర్‌తో కలిసి నంబర్ ప్లేట్ లేని కారులో ఆమెను వెంబడించి, వేధించారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో తొలుత కారు డ్రైవర్‌తోనే సరిపెట్టే ప్రయత్నం చేశారు. పెద్దల వ్యవహారం కావడంతో మంత్రి కొడుకును తప్పించేందుకు శతవిధాలా యత్నించారు. అయితే బాధితురాలి బంధువులు స్టేషన్‌కు వెళ్లి నిలదీయడంతో వ్యవహారం కాస్త బయటకు వచ్చింది. మీడియాలోనూ పెద్దఎత్తున ప్రచారం కావడంతో చేసేది లేక పోలీసులు అమాత్యుడి తనయుడికి ఎట్టకేలకు నోటీసులు ఇచ్చారు. కాగా బాధితురాలు తన ఫిర్యాదులో వ్యక్తి పేరు చెప్పకపోవడం వల్లే సుశీల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదని బంజారాహిల్స్ సీఐ మురళీ కృష్ణ తెలిపారు. తమ దగ్గరకు డ్రైవర్‌ను మాత్రమే తీసుకురావడంతో అతడి పేరును మాత్రమే చేర్చామన్నారు. ఆమె సుశీల్‌ను గుర్తుపట్టడంతో అతడికి నోటీసులు పంపామన్నారు. -
ఏపీ మంత్రి రావెల తనయుడి కీచకపర్వం
టీచర్ చేయి పట్టి కారులోకి లాగిన సుశీల్ * బాధితురాలి కేకలు విని సుశీల్, ఆయన డ్రైవర్‌ను చితకబాదిన స్థానికులు * టీచర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు * మంత్రి తనయుడు కావడంతో కేసు నుంచి తప్పించేందుకు పోలీసుల యత్నం * బాధితురాలి బంధువులు స్టేషన్‌కు వెళ్లి నిలదీయడంతో వెలుగులోకి వచ్చిన అసలు విషయం * సుశీల్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు సాక్షి, హైదరాబాద్: ఆయనో మంత్రి కొడుకు.. నంబర్ ప్లేట్‌లేని కారులో దూసుకొచ్చాడు.. దారిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ టీచర్ చేయి పట్టాడు.. కారులోకి రమ్మంటూ బలవంతపెట్టాడు.. ఆమె ప్రతిఘటించడంతో కారులోకి తోసే ప్రయత్నం చేశాడు.. ఇదంతా గమనించిన స్థానికులు ఆ ‘పోకిరి’ని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు.. నడిరోడ్డుపై ఇలా వీరంగం వేసిన ఘనుడు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు సుశీల్‌కుమార్! బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో తొలుత కారు డ్రైవర్‌తోనే సరిపెట్టే ప్రయత్నం చేశారు. పెద్దల వ్యవహారం కావడంతో మంత్రి కొడుకును తప్పించేందుకు శతవిధాలా యత్నించారు. అయితే బాధితురాలి బంధువులు స్టేషన్‌కు వెళ్లి నిలదీయడంతో వ్యవహారం కాస్త బయటకు వచ్చింది. మీడియాలోనూ పెద్దఎత్తున ప్రచారం కావడంతో చేసేది లేక పోలీసులు అమాత్యుడి తనయుడికి నోటీసులు ఇచ్చారు. కారులోకి రావాలంటూ వేధింపులు బంజారాహిల్స్ రోడ్‌నెం-13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో నివసించే ఫాతిమాబేగం(20) వింటేజ్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా గురువారం స్కూల్ వేళలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో మంత్రి రావెల కుమారుడు రావెల సుశీల్ (26), తన డ్రైవర్‌తో కలిసి నంబర్ ప్లేట్ లేని కారులో ఆమెను వెంబడించారు. ఆమె బంజారాహిల్స్ వైట్‌హౌస్ ముందుకు రాగానే సుశీల్ ఆమె చేయి పట్టుకొని కారు ఎక్కాల్సిందిగా బలవంతం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో కారులోకి తోసేందుకు యత్నించాడు. ఆమె భయంతో గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారు గుమిగూడారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆమె భర్త సయ్యద్ కూడా అక్కడికి వచ్చారు. అంతా కలసి సుశీల్‌తోపాటు డ్రైవర్ అప్పారావును చితకబాదారు. ఈ సమయంలో సుశీల్ వారి నుంచి తప్పించుకొని కారులో పారిపోయే యత్నం చేశాడు. స్థానికులు బైక్‌లపై వెళ్లి కారును అడ్డగించి బయటకు లాగారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన సుశీల్‌తోపాటు అప్పారావు ఫోటోలను ఫాతిమా తన సెల్ఫోన్లో బంధించారు. అనంతరం స్థానికుల సహకారంతో ఇద్దరినీ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. బాధితురాలి నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. సుశీల్‌ను తప్పించేందుకు పోలీసుల యత్నం సుశీల్ ఏపీ మంత్రి రావెల్ కిశోర్ కుమార్ కొడుకు అని తెలియడంతో పోలీసులు అతడిని కేసు నుంచి తప్పించే యత్నం చేశారు. ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విషయం మీడియాకు పొక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం డ్రైవర్‌పైనే లైంగిక వే ధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. కిశోర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. డ్రైవర్‌ను కూడా పంపేశారు. అయితే శుక్రవారం బాధితురాలి బంధువులు మరోసారి స్టేషన్‌కు వెళ్లి కేసుపై ఆరా తీశారు. నిందితులు ఎక్కడంటూ నిలదీశారు. స్టేషన్ వద్ద గొడవ పై మీడియా ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. ఫాతిమా తన సెల్ఫోన్లో ఉన్న ఫొటోలను చూపిస్తూ జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించింది. దీంతో మంత్రి కొడుకు కీచక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుశీల్‌ను కొట్టారంటూ పీఎస్‌లో ఫిర్యాదు మంత్రి రావెల ఆదేశాల మేరకు ఆయన అనుచరులు రంగంలోకి దిగి బాధితులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారు. బాధితులపైనే ఎదురు కేసు బనాయించారు. బంజారాహిల్స్ మీదుగా వెళ్తున్న సుశీల్‌ను కారును అకారణంగా అడ్డగించి దాడి చేశారంటూ మణికొండ రమేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పీకల దాకా మద్యం తాగిండు: ఫాతిమా బేగం పాఠశాల విధులు ముగించుకొని నడుచుకుంటూ ఇంటికి వస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కారులో నన్ను వెంబడించారు. పీకల దాకా మద్యం తాగి ఇష్టానుసారంగా వ్యవహించారు. సుశీల్ అనే వ్యక్తి చేయి పట్టుకొని కారు ఎక్కాల్సిందిగా బలవంతం చేశాడు. గట్టిగా అరవడంతో స్థానికులు, బంధువులు వచ్చి కొట్టారు. అందులో టాటూ వేసుకున్న(సుశీల్) వ్యక్తి చాలా అసభ్యంగా వ్యవహరించాడు. ఎలాంటి ఒత్తిళ్లు లేవు: టి.మురళీకృష్ణ, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రావెల సుశీల్‌కు నోటీసులు జారీ చేశాం. శనివారం సాయంత్రంలోగా బంజారాహిల్స్ స్టేషన్లో హాజరు కావాల్సిందిగా కోరాం. బాధితురాలు తన ఫిర్యాదులో వ్యక్తి పేరు చెప్పకపోవడంతో ఎఫ్ఐఆర్లో చేర్చలేకపోయాం. మా వద్దకు డ్రైవర్‌ను మాత్రమే తీసుకొచ్చారు. కనుక అతడి పేరునే ఎఫ్ఐఆర్లో చేర్చాం. తాజాగా ఆమె సుశీల్‌ను గుర్తుపట్టడంతో అతడికి నోటీసులు జారీ చేశాం. ఈ కేసులో ఎలాంటి ఒత్తిళ్లు లేవు.