సీఎం, మంత్రి ఎందుకు ఆగిపోయారు? | chandra babu and ravela kishore defer pressmeets due to susheel incident | Sakshi
Sakshi News home page

సీఎం, మంత్రి ఎందుకు ఆగిపోయారు?

Published Sat, Mar 5 2016 7:46 PM | Last Updated on Sat, Jul 28 2018 6:51 PM

సీఎం, మంత్రి ఎందుకు ఆగిపోయారు? - Sakshi

సీఎం, మంత్రి ఎందుకు ఆగిపోయారు?

సుదీర్ఘ కాలం తర్వాత హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడాలనుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఆ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. ఈ సమావేశం రద్దు చేసుకోవడంపై పార్టీలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇరకాటంలో నెట్టడం వల్లే ఆయన మీడియా సమావేశం రద్దు చేసుకున్నారని ఒక మంత్రి పేర్కొన్నారు.

శనివారం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ప్రసంగించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ హైదరాబాద్‌లోని సచివాలయంలో అడుగుపెడుతున్న చంద్రబాబు సాయంత్రం 7 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడతారని సమాచారమిచ్చారు. అంతకుముందు మంత్రి రావెల కిషోర్ బాబు కూడా శనివారం ఉదయం విలేకరుల సమావేశంలో మాట్లాడుతారని మీడియాకు సమాచారం వచ్చింది. తర్వాత ఆయన కూడా దాన్ని రద్దు చేసుకున్నారు.

బంజారాహిల్స్ రోడ్ నెం 10లో నంబర్ ప్లేటు లేని ఫార్చూనర్ కారులో ప్రయాణిస్తున్న సుశీల్.. రోడ్డుపై ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మంత్రి కుమారుడిని తప్పిస్తున్నారని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసులు మంత్రి కుమారుడికి నోటీసులు జారీచేశారు. ఆ తర్వాత కేసు నమోదు చేశారు. దీనిపై సుశీల్ ఆ తర్వాత ఫేస్‌బుక్ ద్వారా స్పందించాడు. తన కారుకు ఒక కుక్క పిల్ల అడ్డుగా రావడంతో దాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నంలో మహిళ గట్టిగా అరిచిందని, అంతే తప్ప ఏమీ జరగలేదంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

ఈ ఘటనపై అక్కడ సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు ఆ సమయంలో కారుకు అడ్డుగా కుక్కపిల్ల రాలేదన్న విషయం స్పష్టంగా బయటపడింది. సుశీల్ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడంతో పోలీసులు సుశీల్‌పై కేసును కూడా నమోదుచేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందు మంత్రి రావెల కిషోర్ బాబు దీనిపై స్పందించాలని మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. కేసు నమోదు చేశారని తెలియగానే ఆయన ఆ సమావేశాన్ని రద్దు చేసుకున్నారని సన్నిహితులు చెప్పారు.

ఈ ఘటనపై ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగు చూస్తుండటంతో మీడియా సమావేశం నిర్వహిస్తే ఇరకాటమైన పరిస్థితులు ఉంటాయని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తాను మాట్లాడాలనుకున్న విలేకరుల సమావేశాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. అయితే కారణం లేకుండా రద్దు చేసుకుంటే విమర్శలొస్తాయని గ్రహించి అసెంబ్లీలో అనుసరించే వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించడానికి సమావేశం ఏర్పాటుచేసి ఆ సమావేశం కారణంగా మీడియా సమావేశం రద్దు చేసుకున్నట్టు పార్టీ నేతలతో చెప్పించారు.

రావెల సుశీల్‌పై నెటిజన్ల ఆగ్రహం
మీ తండ్రి ఎమ్మెల్యే, మంత్రి కాబట్టి ఏ తప్పు చేసినా చెల్లింతుందనా.. బ్లఫ్ చేయడానికి ప్రయత్నించొద్దు... కుక్క కథ చెప్పినవారిపై నిర్భయ కేసు పెట్టరంట కదా.. ఏపీలోనైతే కుక్క మీద నిర్భయ కేసు పెట్టేవారేమో... ఏపీ సీఎం ఏమంటారో... కుర్రాడు కదా... నా కొడుకు చేసిన పనితో నాకేంటి సంబంధం అని మంత్రి తప్పించుకుంటారా, స్టోరీ ఎవరి దగ్గర రాయించావు... (ఫేస్ బుక్ వివరణపై) ఏమి కథ అల్లావయ్యా రావెల తనయా... తెలుగు దర్శకులకు ఈ కథ చెప్పు అంటూ అనేకమంది వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement