రావెల కుమారుడికి నోటీసులు
హైదరాబాద్ : యువతిని వేధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్ కుమార్కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన పోలీసులు మంత్రి రావెల క్వార్టర్స్కు వెళ్లి నోటీసులు అందించారు. సాయంత్రం 6 గంటలలోగా సుశీల్ కుమార్ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు.
కాగా బంజారాహిల్స్ రోడ్‌నెం-13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో నివసించే ఫాతిమాబేగం(20) వింటేజ్ స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా గురువారం స్కూల్ వేళలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో రావెల కుమారుడు సుశీల్, తన డ్రైవర్‌తో కలిసి నంబర్ ప్లేట్ లేని కారులో ఆమెను వెంబడించి, వేధించారు.
బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో తొలుత కారు డ్రైవర్‌తోనే సరిపెట్టే ప్రయత్నం చేశారు. పెద్దల వ్యవహారం కావడంతో మంత్రి కొడుకును తప్పించేందుకు శతవిధాలా యత్నించారు. అయితే బాధితురాలి బంధువులు స్టేషన్‌కు వెళ్లి నిలదీయడంతో వ్యవహారం కాస్త బయటకు వచ్చింది. మీడియాలోనూ పెద్దఎత్తున ప్రచారం కావడంతో చేసేది లేక పోలీసులు అమాత్యుడి తనయుడికి ఎట్టకేలకు నోటీసులు ఇచ్చారు. కాగా బాధితురాలు తన ఫిర్యాదులో వ్యక్తి పేరు చెప్పకపోవడం వల్లే సుశీల్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని బంజారాహిల్స్ సీఐ మురళీ కృష్ణ తెలిపారు. తమ దగ్గరకు డ్రైవర్‌ను మాత్రమే తీసుకురావడంతో అతడి పేరును మాత్రమే చేర్చామన్నారు. ఆమె సుశీల్‌ను గుర్తుపట్టడంతో అతడికి నోటీసులు పంపామన్నారు.