ఏపీ మంత్రి రావెల తనయుడి కీచకపర్వం
టీచర్ చేయి పట్టి కారులోకి లాగిన సుశీల్
* బాధితురాలి కేకలు విని సుశీల్, ఆయన డ్రైవర్‌ను చితకబాదిన స్థానికులు
* టీచర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు
* మంత్రి తనయుడు కావడంతో కేసు నుంచి తప్పించేందుకు పోలీసుల యత్నం
* బాధితురాలి బంధువులు స్టేషన్‌కు వెళ్లి నిలదీయడంతో వెలుగులోకి వచ్చిన అసలు విషయం
* సుశీల్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్:
ఆయనో మంత్రి కొడుకు.. నంబర్ ప్లేట్‌లేని కారులో దూసుకొచ్చాడు.. దారిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ టీచర్ చేయి పట్టాడు.. కారులోకి రమ్మంటూ బలవంతపెట్టాడు.. ఆమె ప్రతిఘటించడంతో కారులోకి తోసే ప్రయత్నం చేశాడు.. ఇదంతా గమనించిన స్థానికులు ఆ ‘పోకిరి’ని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు.. నడిరోడ్డుపై ఇలా వీరంగం వేసిన ఘనుడు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు సుశీల్‌కుమార్! బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో తొలుత కారు డ్రైవర్‌తోనే సరిపెట్టే ప్రయత్నం చేశారు. పెద్దల వ్యవహారం కావడంతో మంత్రి కొడుకును తప్పించేందుకు శతవిధాలా యత్నించారు. అయితే బాధితురాలి బంధువులు స్టేషన్‌కు వెళ్లి నిలదీయడంతో వ్యవహారం కాస్త బయటకు వచ్చింది. మీడియాలోనూ పెద్దఎత్తున ప్రచారం కావడంతో చేసేది లేక పోలీసులు అమాత్యుడి తనయుడికి నోటీసులు ఇచ్చారు.
కారులోకి రావాలంటూ వేధింపులు
బంజారాహిల్స్ రోడ్‌నెం-13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో నివసించే ఫాతిమాబేగం(20) వింటేజ్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా గురువారం స్కూల్ వేళలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో మంత్రి రావెల కుమారుడు రావెల సుశీల్ (26), తన డ్రైవర్‌తో కలిసి నంబర్ ప్లేట్ లేని కారులో ఆమెను వెంబడించారు. ఆమె బంజారాహిల్స్ వైట్‌హౌస్ ముందుకు రాగానే సుశీల్ ఆమె చేయి పట్టుకొని కారు ఎక్కాల్సిందిగా బలవంతం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో కారులోకి తోసేందుకు యత్నించాడు. ఆమె భయంతో గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారు గుమిగూడారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆమె భర్త సయ్యద్ కూడా అక్కడికి వచ్చారు. అంతా కలసి సుశీల్‌తోపాటు డ్రైవర్ అప్పారావును చితకబాదారు. ఈ సమయంలో సుశీల్ వారి నుంచి తప్పించుకొని కారులో పారిపోయే యత్నం చేశాడు. స్థానికులు బైక్‌లపై వెళ్లి కారును అడ్డగించి బయటకు లాగారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన సుశీల్‌తోపాటు అప్పారావు ఫోటోలను ఫాతిమా తన సెల్‌ఫోన్‌లో బంధించారు. అనంతరం స్థానికుల సహకారంతో ఇద్దరినీ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. బాధితురాలి నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు.
సుశీల్‌ను తప్పించేందుకు పోలీసుల యత్నం
సుశీల్ ఏపీ మంత్రి రావెల్ కిశోర్ కుమార్ కొడుకు అని తెలియడంతో పోలీసులు అతడిని కేసు నుంచి తప్పించే యత్నం చేశారు. ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విషయం మీడియాకు పొక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం డ్రైవర్‌పైనే లైంగిక వే ధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. కిశోర్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. డ్రైవర్‌ను కూడా పంపేశారు. అయితే శుక్రవారం బాధితురాలి బంధువులు మరోసారి స్టేషన్‌కు వెళ్లి కేసుపై ఆరా తీశారు. నిందితులు ఎక్కడంటూ నిలదీశారు. స్టేషన్ వద్ద గొడవ పై మీడియా ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. ఫాతిమా తన సెల్‌ఫోన్‌లో ఉన్న ఫొటోలను చూపిస్తూ జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించింది. దీంతో మంత్రి కొడుకు కీచక వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
సుశీల్‌ను కొట్టారంటూ పీఎస్‌లో ఫిర్యాదు
మంత్రి రావెల ఆదేశాల మేరకు ఆయన అనుచరులు రంగంలోకి దిగి బాధితులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారు. బాధితులపైనే ఎదురు కేసు బనాయించారు. బంజారాహిల్స్ మీదుగా వెళ్తున్న సుశీల్‌ను కారును అకారణంగా అడ్డగించి దాడి చేశారంటూ మణికొండ రమేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పీకల దాకా మద్యం తాగిండు: ఫాతిమా బేగం
పాఠశాల విధులు ముగించుకొని నడుచుకుంటూ ఇంటికి వస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కారులో నన్ను వెంబడించారు. పీకల దాకా మద్యం తాగి ఇష్టానుసారంగా వ్యవహించారు. సుశీల్ అనే వ్యక్తి చేయి పట్టుకొని కారు ఎక్కాల్సిందిగా బలవంతం చేశాడు. గట్టిగా అరవడంతో స్థానికులు, బంధువులు వచ్చి కొట్టారు. అందులో టాటూ వేసుకున్న(సుశీల్) వ్యక్తి చాలా అసభ్యంగా వ్యవహరించాడు.
ఎలాంటి ఒత్తిళ్లు లేవు: టి.మురళీకృష్ణ, బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్
రావెల సుశీల్‌కు నోటీసులు జారీ చేశాం. శనివారం సాయంత్రంలోగా బంజారాహిల్స్ స్టేషన్‌లో హాజరు కావాల్సిందిగా కోరాం. బాధితురాలు తన ఫిర్యాదులో వ్యక్తి పేరు చెప్పకపోవడంతో ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేకపోయాం. మా వద్దకు డ్రైవర్‌ను మాత్రమే తీసుకొచ్చారు. కనుక అతడి పేరునే ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాం. తాజాగా ఆమె సుశీల్‌ను గుర్తుపట్టడంతో అతడికి నోటీసులు జారీ చేశాం. ఈ కేసులో ఎలాంటి ఒత్తిళ్లు లేవు.