రెండో రోజు కొనసాగనున్న రావెల సుశీల్ విచారణ
హైదరాబాద్: మహిళను వేధించిన కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు సుశీల్, అతని డ్రైవర్ రమేష్ను బంజారాహిల్స్ పోలీసులు గురువారం కూడా విచారించనున్నారు. నిందితులను రెండో రోజులు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. పోలీసులు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారించారు. నేటితో విచారణ ముగియనుంది. ఇప్పటికే అతను బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది.
ఈ నెల 3న బంజారాహిల్స్ రోడ్‌నెం-13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో రోడ్డుపై వెళుతున్న మహిళా టీచర్ ఫాతిమా బేగం పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సుశీల్ తో పాటు అతడి కారు డ్రైవర్ రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్ప తాగిన మైకంలో పబ్లిక్‌గా ప్రైవేటు స్కూల్ టీచర్ ఫాతిమా బేగంను చేయిపట్టుకు లాగి కారులో తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటనలో నిర్భయ చట్టం, ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గురువారం విచారణ అనంతరం అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.
ఇది ప్రతిపక్ష కుట్ర: సుశీల్
తనపై కేసు నమోదు చేయడం వెనక ప్రతిపక్ష పార్టీ హస్తముందని రావెల సుశీల్ ఆరోపించారు. కస్టడీలోకి తీసుకున్న అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సుశీల్ మాట్లాడుతూ.. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. ఆ ఘటనలో కేసు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. తాను మంత్రి కుమారుడినైనందునే కేసు పెద్దదైందన్నారు. హోటల్ తాజ్ బంజారాకు వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు.