రావెల సుశీల్ పోలీస్ కస్టడీ కోరుతూ పిటిషన్
బంజారాహిల్స్: ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్(24)ను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి.
మార్చి 3వ తేదీ సాయంత్రం ఏం జరిగింది. ఈ కేసులో మంత్రి కుమారుడు సుశీల్ పాత్ర, డ్రైవర్ రమేష్ దెబ్బలు తినడానికి కారణాలతో పాటు పలు అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టనున్నారు. టీచర్ ఫాతిమా బేగంను తన కారులోకి లాగడానికి యత్నించిన సుశీల్, డ్రైవర్ రమేష్ స్థానికుల చేతిలో దెబ్బలు తిన్నతర్వాత రెండోసారి మళ్లీ ఘటనా స్థలానికి ఎందుకు వచ్చారన్న దానిపై పోలీసులు ఆరాతీయనున్నారు. పది మంది అనుచరులతో ఘటనా స్థలానికి సుశీల్ ఎందుకు వచ్చాడన్న దానిపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన మెడలో గొలుసు పోగొట్టుకున్నానని అందుకే రెండోసారి ఘటనా స్థలానికి వచ్చినట్లు సుశీల్ చెప్పుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.