‘రవీంద్రభారతి’కి ఇక మంచిరోజులు
రూ. 30 లక్షల నుంచి రూ.2 కోట్లకు నిధులు పెంపు
సాక్షి, సిటీబ్యూరో: సాంస్కృతిక వికాస కేంద్రంగా విరాజిల్లుతున్న రవీంద్రభారతికి ఇక అన్నీ మంచిరోజులే అని చెప్పొచ్చు. ఇంతవరకు రవీంద్రభారతి ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించి నిర్వహణ నిధులను రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచారు. వాస్తవంగా రవీంద్రభారతికి వివిధ కార్యక్రమాల నిర్వహణ ద్వారా నెలకు రూ.3 నుంచి 4 లక్షల వరకు ఆదాయం వస్తోంది. కానీ జీతభత్యాలే రూ. 9లక్షలు వరకు ఇవ్వాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రవీంద్రభారతికున్న ఆర్థిక కష్ట నష్టాల గురించి సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ ఇటీవల సీఎం కేసీఆర్‌కు వివరించారు.
స్పందిం చిన ఆయన తగిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీనిపై హరికృష్ణ నివేదిక ఇస్తూ రూ.2 కోట్లు ఇస్తే సరిపోతుందని వివరించారు. కేసీఆర్ వెంటనే సమ్మతం తెలుపుతూ రవీంద్రభారతికి మరమ్మతులు కూడా చేయించాలని ఆదేశించారు. అసెంబ్లీలో ప్రకటించిన బడ్జెట్ సందర్భంగా రవీంద్రభారతి నిధులకు ఆమోద ముద్ర కూడా వేశారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించిన ప్రత్యేక జీవో విడుదల కానున్నది.