కళలకు ‘తాళం’!
► ఆగిన రవీంద్రభారతి పునరుద్ధరణ పనులు
► సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు బ్రేక్
► నిధుల విడుదలలో నిర్లక్ష్యమే కారణం
► పాత సీట్లే ఉంటాయట!
నగరంలో కళా సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కటి వేదికైన రవీంద్రభారతి మూగబోయింది. నిత్యం సాంస్కృతిక ప్రదర్శనలలు, సాహితీ సభలు, సామాజిక కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని అలరించే ఈ అద్భుత వేదికకు రెండు నెలలుగా తలుపులు మూసుకున్నాయి. సకల సదుపాయాలు, ఆధునిక సాంకేతిక హంగులతో రవీంద్రభారతిని పునరుద్ధరించనున్నటు ప్రకటించిన ప్రభుత్వం...సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ప్రారంభించిన పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
సాహితీ, సాంస్కృతిక రంగాలపై ఎంతో మక్కువతో రవీంద్రభారతిని కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3 కోట్ల నిధులు కేటాయించారు. కానీ నిధుల విడుదలలో జాప్యం కారణంగా రెండు నెలల క్రితం మూసిన రవీంద్రభారతి తలుపులు ఇప్పటికీ తెరుచుకోలేదు. - సాక్షి, సిటీబ్యూరో -
సాక్షి, సిటీబ్యూరో: గత ఆరేడు దశాబ్దాలుగా తెలుగు ప్రజల సాంస్కృతిక వికాసానికి కేంద్రబిందువుగా ఉన్న రవీంద్రభారతి ఆడిటోరియాన్ని ఆధునీకరించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. ఇదెంతో ఆహ్వానించదగిన పరిణామమే. కాగా రాష్ర్ట పర్యాటకాభివృద్ధి సంస్థకు పునరుద్ధరణ పనులు అప్పగించారు. ప్రభుత్వం కేటాయించిన రూ.3 కోట్లతో ప్రధాన హాల్, గ్రీన్‌రూమ్, వీఐపీ హాల్, మినీ కాన్ఫరెన్స్ హాల్ తదితర భవనాల ఆధునీకరణ, రవీంద్రభారతి చుట్టూ రోడ్లు, పార్కింగ్ సదుపాయంతో పాటు సౌండ్, లైటింగ్ వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
భవనం మొత్తాన్ని చక్కటి రంగులతో అందంగా అలంకరించాలని భావించారు. ఇప్పుడు ఉన్న సీట్లను తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ నిధుల లేమి కారణంగా సీట్ల పునరుద్ధరణను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం సివిల్ పనులు మాత్రం ముగిశాయి. మిగతా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. విద్యుదీకరణ, సౌండ్ అండ్ లైటింగ్ పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది.
సీట్ల మార్పు ఎందుకు మరచినట్లు...?
పాతకాలం నాటి సీట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని పునరుద్ధరణ కమిటీ మొదట ప్రతిపాదించింది. కానీ ఇప్పుడు ఆ అంశాన్ని పక్కనపెట్టినట్లు తెలిసింది. బాగా చిరిగిపోయి, పనికి రాకుండా ఉన్న సీట్లను వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేయవలసి ఉండగా, ప్రస్తుతం ఆ అంశాన్ని విస్మరించడం అన్యాయమని పలువురు కళాకారులు, సాంస్కృతిక సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. అయితే పనురుద్ధరణ పనుల జాబితాలో సీట్ల మార్పు ప్రతిపాదనే లేదని పర్యాటకాభివృద్ధి సంస్థ పేర్కొనడం గమనార్హం.
నిలిచిన బుకింగ్‌లు...
ప్రతిసాయంత్రాన్ని ఆహ్లాదభరితం చేసే రవీంద్రభారతి మూసి ఉంచడంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ కళావిహీనంగా కనిపిస్తున్నాయి. రెండు నెలలుగా పనులు సాగదీస్తూ ఉండడంతో బుకింగ్‌లు నిలిచిపోయాయి. పలు సంస్థలు నిరీక్షణలో ఉన్నాయి.
కొత్త సీట్లు ఏర్పాటు చేయాల్సిందే
అన్ని పనులు పూర్తి చేసి సీట్లు పాతవే ఉంచడం వల్ల రవీంద్రభారతి కళాత్మకత దెబ్బతింటుంది. కచ్చితంగా కొత్త సీట్లు ఏర్పాటు చేయాల్సిందే. - మామిడి హరికృష్ణ, డెరైక్టర్, భాషా సాంస్కతిక శాఖ.
ఆడిటోరియాలు దొరకడం లేదు...
రవీంద్రభారతిని త్వరగా తె రవాలి. పునరుద్ధరణ పనుల కోసం మూసివేసి చాలా రోజులైంది. మదర్స్ డే సందర్భంగా... ఇంకుడు గుంతల ఏర్పాటుతో చేకూరే లాభం గురించి ప్రజలకు వివరించేందుకు ఓ కార్యక్రమం ఏర్పాటు చేయాలని రెండురోజులుగా ప్రయత్నిస్తున్నాను. నగరంలో ఎక్కడా ఆడిటోరియాలు దొరకటం లేదు. రవీంద్రభారతి అయితే అద్దె తక్కువ.
అందరికీ అందుబాటులో ఉండేది. అక్కడ డెరైక్టర్, సిబ్బంది పూర్తిగా సహకరిస్తారు. కాబట్టి పనులు త్వరగా పూర్తి చేస్తే కళా సంస్థలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలవుతుంది. - యు. అరుణా అశోక్, శ్రీసాయి అలేఖ్యా సాంస్కృతిక, సంఘ సేవా సంస్థ.