పరుగు | ready to ghmc elections | Sakshi
Sakshi News home page

పరుగు

Published Mon, Nov 23 2015 11:35 PM | Last Updated on Mon, Sep 17 2018 5:59 PM

పరుగు - Sakshi

పరుగు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు యంత్రాంగం సన్నాహాలు
ముగిసిన డీలిమిటేషన్
నేడు ఓటర్ల జాబితా విడుదల
26న బీసీల ముసాయిదా జనవరిలో ఎన్నికలు?

 
సిటీబ్యూరో:  జీహెచ్‌ఎంసీ ఎన్నికల వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం చురుగ్గా కదులుతోంది. వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. వార్డుల (డివిజన్ల) వారీగా ఓటర్ల జాబితాను మంగళవారం (నేడు) ప్రజల ముందుకు తీసుకురానున్నారు.వీటిని జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాలు, ఆర్‌డీవో, తహశీల్దారుల కార్యాలయాల్లో ఉంచడంతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేస్తారు. ప్రజలు, రాజకీయ పక్షాలు తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, చిరునామా మార్పులకు అవకాశం ఉంటుంది. అనంతరం 26వ తేదీన బీసీల ముసాయిదా జాబితాను ప్రజల ముందు ఉంచుతారు. దానిపై అభ్యంతరాలకు వారం రోజుల గడువిస్తారు. ఫిర్యాదుల ఆధారంగా అవసరమైన మార్పుచేర్పులు చేసి ఓటర్ల జాబితాలో బీసీలను మార్కింగ్ చేస్తారు. అనంతరం జనాభా ప్రాతిపదికన మొత్తం 150 డివిజన్లలో ఏవి ఏ వర్గానికి చెందుతాయో ఖరారు చేస్తారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఇవన్నీ డిసెంబర్ 15లోగా పూర్తయ్యాక... మిగిలేది ఎన్నికల నోటిఫికేషనే. జనవరిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

సిబ్బంది కోసం లేఖలు
ఈ ప్రక్రియతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు, రిటర్నింగ్  అధికారులు (ఆర్‌వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్‌వోలు)తో సహా దాదాపు 50 వేల మంది ఎన్నికల సిబ్బంది కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు వివిధ విభాగాల అధికారులకు లేఖలు రాశారు. జీహెచ్‌ఎంసీ వద్ద ప్రస్తుతం 6900 ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి. మరో 5 వేల ఈవీఎంలు కావాలని  రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు సంబంధిత అధికారి తెలిపారు.

 ప్రారంభోత్సవాలు ముమ్మరం..
 ఎన్నికల నోటిఫికేషన్‌కు ఎక్కువ వ్యవధి లేకపోవడంతో వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంతో పాటు ఇం టింటికి రెండు చెత్తడబ్బాల కార్యక్రమాన్ని ప్రారంభిం చడం...  పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్  భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయడం తెలిసిందే.
 
ప్రచారం జోరు..
జీహెచ్‌ఎంసీలో అమలవుతున్న రూ.5భోజన కార్యక్రమంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాల ప్రచార హోర్డింగులు సైతం భారీగా దర్శనమిస్తున్నాయి. నగరంలోని వివిధ ముఖ్య కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఇలా.. ఎన్నికల లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగర ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లను కూడా ఇటీవలే అమల్లోకి తెచ్చారు. దీని ద్వారా ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఒక అభిప్రాయం కాగా... జీహెచ్‌ఎంసీ ఖజానా నిండేందుకూ ఉపకరించగలదని భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement