నగరాన... నిప్పుల వాన | Record temperatures | Sakshi
Sakshi News home page

నగరాన... నిప్పుల వాన

Published Wed, Apr 13 2016 12:09 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

నగరాన... నిప్పుల వాన - Sakshi

నగరాన... నిప్పుల వాన

రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు
వడగాల్పులతో సిటీజనుల ఉక్కిరిబిక్కిరి

 

నగరం నిప్పుల కుంపటిలా మారింది. భానుడి భగభగలతో విలవిల్లాడింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు..వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రోడ్లపైకి వచ్చేందుకే భయపడ్డారు. మధ్యాహ్నం వేళలో రోడ్లన్నీ బోసిపోయి నగరంలో కర్ఫ్యూ వాతావరణం కన్పించింది. మంగళవారం అత్యధికంగా 41.8 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. కాగా ఎల్బీనగర్, తిరుమలగిరి, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయినట్లు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు తెలిపారు. పలువురు సెల్‌ఫోన్లు, థర్మామీటర్ల ఆధారంగా స్థానికంగా నమోదైన ఉష్ణోగ్రతలు తెలుసుకుంటున్నారు.      -సాక్షి, సిటీబ్యూరో

 

ఆరేళ్లలో ఇదే అత్యధికం...
గ్రేటర్‌లో 2010 ఏప్రిల్ 16న 42.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. తాజాగా ఏప్రిల్ 3న 41.4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకాగా..ఏప్రిల్ 12న(మంగళవారం) 41.8 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. కాగా రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 26.3  డిగ్రీలు నమోదవడంతో ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత అధికమవుతోంది. కాగా మే నెలలో ఈసారి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా గాలిలో తేమ 50 శాతం మేర ఉండాలి. కానీ 24 శాతానికి పడిపోవడంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి 8 తర్వాత కూడా వాతావరణం చల్లబడడం లేదు. దీంతో ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు పనిచేస్తున్నా..వేడిగాలులకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నామని వాపోతున్నారు. శరీ రంలో నీటి శాతాన్ని కోల్పోయి అతిసారం బారి నపడుతున్నామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇక మండుటెండలకు మధ్యాహ్నం వేళల్లో జనం ఇళ్లకే పరిమితం కావడంతో ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లు బోసిపోయాయి. వాహనాల రాకపోకలు తగ్గి నగరంలో పలుచోట్ల కర్ఫ్యూ వాతావరణం తలపించింది. మధ్యాహ్నం వేళల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలకు గాలిలో తేమ 24 శాతానికి పడిపోయింది. వడగాల్పుల తీవ్రతకు వృద్ధులు, రోగులు సొమ్మసిల్లుతున్నారు. పలు ఆస్పత్రుల్లో వడదెబ్బ కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.


సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది. వృద్ధులు, రోగులు ఎండ తీవ్రత బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కాగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. చర్మం, కళ్ల సంరక్షణపై శ్రద్ధ చూపాలని స్పష్టం చేస్తున్నారు. కొబ్బరి నీళ్లు, లస్సీ, మజ్జిగ, మంచినీరు, పండ్లరసాలను అధికంగా తీసుకొని అతిసారం బారి నుంచి రక్షణం పొందాలని, ఎండకు బయటికి వెళ్లే సమయంలో విధిగా గొడుగు తీసుకు వెళ్లాలని సూచిస్తున్నారు. పెంపుడు జంతువులు, పశువులు, పక్షులను కూడా వేసవి తాపం నుంచి రక్షించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement