ఇక ట్రేడ్ కోరడా! | Red notices for unpaid fees | Sakshi
Sakshi News home page

ఇక ట్రేడ్ కోరడా!

Published Sun, Mar 6 2016 12:35 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

ఇక  ట్రేడ్  కోరడా! - Sakshi

ఇక ట్రేడ్ కోరడా!

లక్ష్యం రూ.50 కోట్లు
ఇంకా వసూలు కావాల్సింది రూ.28 కోట్లు
ఫీజు చెల్లించని వారికి రెడ్ నోటీసులు

 
సిటీబ్యూరో: ట్రేడ్ లెసైన్స్ ఫీజు వసూలుపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. ఈ ఆర్థిక సంవత్సరం వీటి వసూలు లక్ష్యం రూ. 50 కోట్లు. ఇప్పటి వరకు వసూలైంది రూ. 23 కోట్లు. ఇంకా రూ. 27కోట్లు రావాలి. అంటే రోజుకు దాదాపు రూ.కోటి వసూలు చేయాలి. ఈ నేపథ్యంలో ట్రేడ్ లెసైన్సు ఫీజులు చెల్లించని వారికి రెడ్ నోటీసుల జారీ ప్రారంభించింది. అన్ని వ్యాపార సంస్థలకు స్వయంగా ఇచ్చేందుకు తగినంత యంత్రాంగం లేకపోవడంతో పోస్టు ద్వారా వీటిని జారీ చేస్తున్నారు. వాస్తవానికి ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభంలో అంటే ఏప్రిల్‌లోనే ట్రేడ్ లెసైన్సు ఫీజు చెల్లించాల్సి ఉంది. కానీ వ్యాపారులు చెల్లించడం లేదు. జీహెచ్‌ఎంసీ అధికారులు దృష్టి సారించడం లేదు. తీరా ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో (మార్చిలో) ముమ్మర చర్యలకు దిగడం ఆనవాయితీగా మారింది.

జాబితాలో లేనివి ఎన్నో
జీహెచ్‌ఎంసీలో చిన్నవి, పెద్దవి వివిధ వ్యాపారాలు కలిపి దాదాపు రెండు లక్షలకు పైగా ఉంటాయని అనధికారిక అంచనా. జీహెచ్‌ఎంసీ రికార్డుల మేరకు లక్షా 41 వేలు మాత్రమే ఉన్నాయి. మొత్తం వ్యాపార సంస్థలను గుర్తించాలని మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఇంకా కొలిక్కి రాలేదు. వివిధ సర్కిళ్లలో వ్యాపార సంస్థలను గుర్తించేందుకు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్‌ఎఫ్‌ఏ)లకు ఒక దశలో బాధ్యతలు అప్పగించారు. వారు నిత్యం తిరిగే ప్రాంతాల్లో ఎన్ని దుకాణాలు ఉన్నాయో తెలుస్తుందనే ఉద్దేశంతో ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎందుకనో దాన్ని మధ్యలోనే ఆపేశారు. మరో పర్యాయం మొత్తం వ్యాపార సంస్థలను గుర్తించేందుకు  ఏజెన్సీలను ఆహ్వానిస్తూ కాంట్రాక్టులు పిలిచారు. దాన్నీ అమలు చేయలేదు. ఇప్పుడిక మిగిలింది మూడు వారాలే కనుక జాబితాలో ఉన్న సంస్థల నుంచి వసూలుపైనే దృష్టి సారించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం (ఏప్రిల్) నుంచే మొత్తం ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో గుర్తించే పని ప్రారంభించనున్నట్లు అడిషనల్ కమిషనర్ (రెవెన్యూ, ట్రేడ్ లెసైన్సులు) జె.శంకరయ్య తెలిపారు.
 
అంచనాలు బారెడు.. వసూలు మూరెడు
గత (2014-15) ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయాల్సిన ట్రేడ్ లెసైన్స్ ఫీజులు రూ.107 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వసూలైంది మాత్రం రూ.32 కోట్లు. ఈ అనుభవంతో ఈ ఏడాది రూ.50 కోట్లే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు వసూలైంది రూ. 22 కోట్లే. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాది అనుభవమే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.ప్రస్తుతం అధికారులు చేపట్టిన చర్యలు ఏమేరకు ఫలితమిస్తాయో నెల రోజుల్లో తేలనుంది. ట్రేడ్‌లెసైన్సుల ఫీజులను ఎక్కడికక్కడే వసూలు చేసేందుకు సంబంధిత అధికారులకు హ్యాండ్‌హెల్డ్ డివైజ్‌లను అందిస్తున్నారు. వ్యాపారుల వద్దకు వెళ్లి అక్కడికక్కడే ఫీజు కట్టించుకొని.... వీటి ద్వారా రసీదులు అందజేయనున్నారు.
 
జూన్ నుంచి పెనాల్టీలు
ఏటా ఏప్రిల్‌లోనే ఈ ఫీజులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ... మే వరకు పెనాల్టీలు లేకుండా ఫీజు తీసుకుంటున్నారు. జూన్ నుంచి జూలై వరకు 25 శాతం... ఆ తర్వాత కట్టే వారికి 50 శాతం అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement