కాసుల వేట
జీహెచ్‌ఎంసీ పంచ ‘తంత్రం’
{sేడ్ లెసైన్సు ఫీజుల వసూళ్ల లక్ష్యం రూ. 100 కోట్లు
పూర్తి యంత్రాంగంతో త్వరలో స్పెషల్ డ్రైవ్
{sేడ్ లెసైన్సు లేని దుకాణాలకు లెసైన్సులు
లెసైన్సులున్న వారి నుంచి ఫీజు వసూలు
లెసైన్సు పరిధిలోకి కొత్త సంస్థలు అవసరాన్ని బట్టి చట్ట సవరణ
{పత్యేక కార్యాచరణకు జీహెచ్‌ఎంసీ సన్నద్ధం
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిస్థితి ‘పనులు బోలెడు.. నిధులు జానెడు’.. అన్నట్లుగా మారింది. ఓవైపు ఎస్సార్‌డీపీ, 2బీహెచ్‌కే, రహదారుల నిర్మాణం కార్యక్రమాలకు వేల కోట్లు అవసరముతున్నాయి. అయితే జీహెచ్‌ఎంసీ ఖజానా పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఇప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి రూ. 500 డ్రా చేసుకోగా, మరో రెండునెలలు ఇలాగే కొనసాగితే సిబ్బంది వేతనాలకు సైతం ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలో ఐదు రకాల పన్నుల ద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు పంచ‘తంత్రాన్ని’ అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మొదట ట్రేడ్ లెసైన్సుల ఫీజులపై దృష్టి సారించింది. జీహెచ్‌ఎంసీలో ట్రేడ్ లెసైన్సుల కోసం పేర్లు నమోదు చేసుకున్న వ్యాపార సంస్థలు 1,48,000 ఉండగా, వాటిలో 48వేల సంస్థలు కూడా ట్రేడ్ లెసైన్సు ఫీజులు చెల్లించడం లేదు. వీటి నుంచి ట్రేడ్ లెసైన్సు ఫీజు వసూలైతే జీహెచ్‌ఎంసీకి దాదాపు వంద కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే గత ఆర్థిక సంవత్సరం రూ. 30 కోట్లు కూడా వసూలు కాకపోవడంతో సదరు వ్యాపార సంస్థలను జల్లెడ పట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకు గాను సమస్త యంత్రాంగాన్ని రంగంలోకి దింపనున్నారు. ట్రేడ్ లెసైన్సు ఫీజులు చెల్లించని సంస్థలు.? లెసైన్సులు లేని వివరాలతో పాటు ఆయా సంస్థల ఫోన్ నెంబర్లు సేకరిస్తారు. ట్రేడ్ లెసైన్సులు లేనివారిని లెసైన్సులు తీసుకునేలా, లై సెన్సుదారుల నుంచి ఫీజులు వసూలు చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా సులభంగా ఫీజు చెల్లించే విధానంపై వారికి అవగాన కల్పిస్తారు. ఇందుకుగాను త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
అవసరమైతే చట్ట సవరణ
ప్రతి వ్యాపార సంస్థ ఏటా ట్రేడ్ లెసైన్సు ఫీజు చెల్లించాల్సి ఉన్నా, జీహెచ్‌ఎంసీ నిబంధనలు, చట్టాల్లో స్పష్టత లేకపోవడంతో కొన్ని సంస్థలు ఫీజులు చెల్లించడం లేదు. వాటికి డిమాండ్ నోటీసులు జారీ చేసినా కోర్టుల కెక్కుతున్న నేపథ్యంలో అవసరాన్ని బట్టి చట్ట సవరణలు చేయాలని యోచిస్తున్నారు. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ అందుకు అనుమతించడంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మొబైల్ కంపెనీలు, వైన్స్ దుకాణాలు, హాస్టళ్లకు సంబందించి ట్రేడ్‌లెసైన్సు ఫీజుల వసూలు పై స్పష్టత లేక పోవడంతో వీటిపై స్పష్టత నిస్తూ జీవోలను సవరించే అవకాశం ఉంది. ఈ అంశాన్ని స్టాండింగ్ కమిటీ, జనరల్ బాడీ సమావేశాల్లో ఆమోదించి, ప్రభుత్వానికి నివేదించి చట్ట సవరణ చేయనున్నారు.
ప్రతిదీ తనిఖీ
స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అన్ని వ్యాపార సంస్థలను క్షుణ్నంగా తనిఖీ చేయడంతో పాటు ఇప్పటికే ట్రేడ్ లెసైన్సుల జాబితాలో నమోదై ఉన్నా సదరు సంస్థ మూతపడినా, ఆ వివరాల్నీ నమోదు చేయనున్నారు. కొత్తగా వచ్చిన వాటిని ట్రేడ్ పరిధిలోకి తెచ్చి లై సెన్సు ఫీజు వసూలు చేయనున్నారు. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఫీజుల పెంపు మాత్రం చేయరాదని భావిస్తున్నారు.