
వైద్య పరికరాల టెండర్లలో సంస్కరణలు
ప్రమాణాలు పాటించే కంపెనీల నుంచే మందుల కొనుగోలు: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : వైద్య పరికరాలు, సర్జికల్స్, మందుల కొనుగోళ్ల టెండర్లలో భారీ సంస్కరణలు చేపట్టినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. ఎల్-1 పేరుతో నాసిరకం పరికరాలు సరఫరా చేసే కంపెనీల నుంచి కాకుండా.. నిర్ణీత ప్రమాణాలు పాటించే కంపెనీల ద్వారా నేరుగా వైద్య పరికరాలు, మందులను కొనుగోలు చేస్తామన్నారు. వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో ప్రక్షాళన మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. పశ్చిమబంగలో హసీబ్ కంపెనీకి చెందిన స్టెరైల్ వాటర్ బాటిళ్లు ప్రమాణాల మేరకు లేవని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నా.. ఆ కంపెనీ నిబంధనల ప్రకారం టెండర్లలో పాల్గొనే అర్హత ఉందన్నారు.
గతేడాది జూన్ నెలలో హసీబ్ కంపెనీ సెలైన్ బాటిళ్ల టెండర్లలో పాల్గొందని మంత్రి వివరించారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచే పదేళ్లుగా ఆ కంపెనీ సెలైన్లు సరఫరా చేస్తోందన్నారు. సరోజిని కంటి ఆస్పత్రి ఘటనలో ప్రాథమిక నివేదిక ప్రకారం సెలైన్‌లో బ్యాక్టీరియా ఉందని తేలిందన్నారు. సెలైన్ నమూనాలను తదుపరి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపామనీ, దానిపై ఒక కమిటీ వేశామన్నారు. పరీక్షల నివేదిక, కమిటీ రిపోర్టు వచ్చాక బాధ్యులపై చర్యలుంటాయన్నారు. ఈ కంటి ఆసుపత్రి ఘటనలో 13 మందిలో 8 మంది పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. మిగిలిన ఐదుగురికి పూర్తిగా కళ్లు పోయినట్లుగా భావించలేమన్నారు.
అందులో ఒకరికి శస్త్రచికిత్స చేస్తే సాధారణ పరిస్థితి వస్తుందన్నారు. మిగతా నలుగురికి కూడా ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నుంచి వైద్య నిపుణులను రప్పించి చికిత్స చేస్తున్నామని.. వారు వైద్యానికి స్పందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు. కేంద్రం నుంచి రాకున్నా.. రాష్ట్ర ప్రభుత్వమే లక్ష దోమ తెరలు కొనుగోలు చేసి గిరిజనులకు అందజేస్తుందన్నారు. ఎక్కడికక్కడ ఫాగింగ్ చేపడుతున్నామని, ఏజెన్సీల్లో మలేరియా, డెంగీ నిర్దారణ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలో విషజ్వరాలు లేవని.. పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు. హైదరాబాద్‌లో కేవలం ఒక కలరా కేసే నమోదైందని, సామూహిక కలరా కేసులు ఎక్కడా నమోదు కాలేదన్నారు.