వాటికి రిజిస్ట్రేషన్‌ చేస్తే.. ఉద్యోగం ఊడినట్లే! | Registration department decision on government lands issue | Sakshi
Sakshi News home page

వాటికి రిజిస్ట్రేషన్‌ చేస్తే.. ఉద్యోగం ఊడినట్లే!

Published Sun, Apr 2 2017 3:39 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

వాటికి రిజిస్ట్రేషన్‌ చేస్తే.. ఉద్యోగం ఊడినట్లే!

వాటికి రిజిస్ట్రేషన్‌ చేస్తే.. ఉద్యోగం ఊడినట్లే!

సర్కారు భూముల విషయంలో రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయం
- అక్రమాలకు పాల్పడితే తొలగిస్తామని సబ్‌ రిజిస్ట్రార్లకు హెచ్చరిక
- ‘ఎనీవేర్‌’లో అవకతవకల నియంత్రణకు చర్యలు


సాక్షి, హైదరాబాద్‌: సర్కారు భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసిన సబ్‌ రిజిస్ట్రార్లను ఉద్యోగం నుంచి తొలగించాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ‘ఎనీవేర్‌’ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలోని లోపాలను ఆసరాగా చేసుకొని కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారని రిజిస్ట్రేషన్‌ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నించే వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులు నిర్ణయించారు. ఎనీవేర్‌లో లోపాలను సరిదిద్దడంతో పాటు, ఉల్లంఘనులపై చర్యల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. 6 నెలల అధ్యయనం తర్వాత కమిటీ పలు సిఫార్సులు చేయగా.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి వాటిని అమలు చేయాలని నిర్ణయించారు. తొలుత హైదరాబాద్, హైదరాబాద్‌ సౌత్‌ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి అనంతరం మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేయాలని భావిస్తున్నారు.

కమిటీ సిఫార్సులు..
► రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయానికి అందిన దస్తావేజుల వివరాలను ముందస్తుగా సబ్‌ రిజిస్ట్రార్లు తనిఖీ చేయాలి. ఆ ఆస్తి ఏ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో ఉన్నదో, అక్కడి నుంచి అనుమతి తీసుకోవాలి.
► సర్కారు సూచించిన నిషేధిత ఆస్తుల పుస్తకం (పీవోబీ)లో సదరు భూమి నమోదైనట్లు రుజువైతే దస్తావేజును తిరస్కరించాలి. పీవోబీలో లేని ఆస్తులనే రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలి.
► వేరొక సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధిలోని భూమికి సంబంధించి మార్కెట్‌ విలువను నిర్ధారించే విషయమై అక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌కు ఈ మెయిల్‌ ద్వారా వివరాలు పంపాలి. ఈ–మెయిల్స్‌ను అందుకున్న సబ్‌ రిజిస్ట్రార్లు 48 గంటల్లోగా స్పందించాలి.
► దస్తావేజులో పేర్కొన్న మార్కెట్‌ విలువలో తేడా ఉన్నా, పీవోబీలో భూమి సర్వే నంబరు ఉన్నా, సంబంధిత పత్రాలను రిప్లయ్‌తో జత చేయాలి. మార్కెట్‌ విలువలో వ్యత్యాసం ఉంటే ఆ మొత్తం చెల్లించాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలి.
► అలా కాకుండా తప్పుడు మార్కెట్‌ విలువతో ఫీజు లెక్కిస్తే సదరు సబ్‌ రిజిస్ట్రార్‌పై ‘భారతీయ స్టాంపుల చట్టం 1899’ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.
► ఏదేని గ్రామంలో సర్వే నెంబరు 10ని పీవోబీలో పేర్కొని.. 10బీ, 10సీ సర్వే నెంబర్లలోని భూములుగా దస్తావేజులో పేర్కొంటే సదరు గుర్తింపులను సబ్‌ రిజిస్ట్రార్‌ రూఢీ చేసుకోవాలి.
► తెలంగాణ ల్యాండ్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో సరిచూసుకున్నాకే దస్తావేజును అనుమతించాలి. లేదంటే రెవెన్యూ అధికారులతో పరిశీలన చేయించుకోవాలని సూచిస్తూ దస్తావేజును తిరస్కరించాలి.
► సెక్షన్‌ 22ఎ ప్రకారం నిషేధించిన భూములను ఏదైనా సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేసినట్లయితే, ప్రభుత్వ సొమ్మును అపహరించిన నేరంతో సమానంగా పరిగణిస్తారు. ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిన కేసులలో సదరు అధికారులను ఉద్యోగం నుంచి తొలగించా లని రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement